3నెలల్లో హంద్రీ-నీవా పూర్తికావాలి
► పనులపై జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ అసంతృప్తి
► వేగం పెంచండి, ఇంకొన్ని యంత్రాలు వాడండి
► ఇసుక అక్రమ రవాణాపై 1100,100కు ఫోన్‌చేయండి
మదనపల్లె రూరల్: కాంట్రాక్టర్లు పనులు వేగవంతం చేయాలి, 3 నెలల్లో మదనపల్లె-కుప్పం హంద్రీ-నీవా పనులు పూర్తి కావాలి’ అని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ చెప్పారు. మదనపల్లె సమీపంలోని కోళ్లబైలు, పొన్నేటి పాళెం గ్రామాల్లో జరుగుతున్న హంద్రీ-నీవా కాలువ పనులను ఆయన, సబ్ కలెక్టర్ కృతికా బాత్రా కలిసి ఆకస్మికంగా తనిఖీచేశారు. కాట్లాటపల్లె, రామిరెడ్డిగారిపల్లె వద్ద టన్నెల్ (సొరంగం) పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. హంద్రీ-నీవా, రెవెన్యూ, అధికారులతో పాటు రైతుల నుంచి ఎటువంటి సమస్యలు లేకుండా మార్గం సుగుమం చేసినా ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. టన్నెల్ పనులు మొత్తం 500 మీటర్ల వరకు జరగాల్సి ఉండగా, 200 మీటర్ల పనులే జరగడంపై మండిపడ్డారు.
కాంట్రాక్టర్లు ఇంకా యంత్రాలను రంగంలోకి దించాలని సూచించారు. అవసరమైతే మరో మూడు బూమర్లు తెచ్చి స్పీడు పెంచాలని సూచించారు. హంద్రీ-నీవా కాలువ ఎస్‌ఈ మురళీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ 2014-15లో రూ.100 కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించగా, తాము రూ.272 కోట్లను ఖర్చు చేశామని చెప్పారు. 2015-16లో రూ 212 కోట్లను కేటాయించగా, రూ.540 కోట్లు ఖర్చుచేసి పనులను వేగవంతం చేశామని తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1600 కిలోమీటర్ల సీసీ రోడ్లు అవసరం ఉందన్నారు. ప్రస్తుతం 400 కిలోమీటర్లు వేయగా, రానున్న ఆర్థిక సంవత్సరంలో మరో 600 కిలోమీటర్ల సీసీ రోడ్లను వేయనున్నట్లు చెప్పారు. రైతులు వరితో పాటు ఉద్యాన పంటలను అధికంగా సాగుచేసి ఆర్థికంగా రాణించాలని సూచించారు.
ఇసుకను గృహ నిర్మాణలకే వినియోగించాలన్నారు, ఇతర రాష్ట్రాలకు తరలిస్తే కఠినంగా చర్యలుంటాయన్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే కాల్ సెంటర్1100, 100 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. మండలాలవారీగా రీచ్‌లను గుర్తించి వాటి వివరాల బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. టమాట మార్కెట్‌లో 10 శాతం కమీషన్ తీసుకుంటే వ్యాపారుల లెసైన్సులు రద్దు చేస్తామన్నారు. ఈఈ రామిరెడ్డి,డీఈఈ హరినాథ్‌రెడ్డి, తహశీల్దార్ శివరామిరెడ్డి, ఆర్‌ఐ సయ్యద్ ఉన్నారు.