పట్టభద్రులు మేల్కొనాలి
► టీడీపీ ప్రభుత్వానికి ఓటుతో గుణపాఠం చెప్పాలి
► వెన్నపూస గోపాల్‌రెడ్డికి ఓటేసి గెలిపించుకుందాం
► కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి
కడప అగ్రికల్చర్: టీడీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేం దుకు ఎమ్మెల్సీ ఎన్నికలను సద్వినియోగం చేసుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పట్టభద్రులకు పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క హామీని అమలు చేయకుండా నిరుద్యోగులు, పట్టభద్రులు.. ఇలా అన్ని వర్గాలను మోసం చేసిం దని ఆయన తెలిపారు. ఇటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే వైఎస్సార్ సీపీ తరఫున పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెన్నపూస గోపాల్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుది: కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఎంపీ మాట్లాడుతూ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇంటికో ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామని ఓట్లు దండుకుందని తెలిపారు. అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేయడమే పనిగా ముందుకు వెళుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న కేజే రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను, నిరుద్యోగులను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ముంచారన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని, పరిశ్రమలు నెలకొల్పుతున్నానని చెప్పి అందినకాడికి దండుకుని నిరుద్యోగులను మోసగించారన్నారని తెలిపారు.
సామాన్యులను మోసం చేసిన ఘనుడు కేజే రెడ్డి: కర్నూలు జిల్లాలో సామాన్యులను సైతం మోసం చేసిన ఘనుడు కేజే రెడ్డి అని ఆరోపించారు. ఈయన బాగోతం కర్నూలు జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. అటువంటి మోసగాడికి, అక్రమార్కుడిని సీఎం చంద్రబాబు చేరదీసి అభ్యర్థిగా నిలబెట్టడం దారుణమన్నారు. నీతి, నిజాయితీ పనిచేసే వెన్నపూసను గెలిపించుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. ఈయన్ను గెలిపిస్తే నిరుద్యోగులు, యువకుల తరఫున శాసనమండలిలో టీడీపీని నిలదీస్తారని చెప్పారు. సమావేశంలో మేయర్ కె సురేష్‌బాబు, గోపాల్‌రెడ్డి తనయుడు రవీంద్రరెడ్డి, పార్టీ నాయకుడు మధువర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓటుతో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి
కడప ఎడ్యుకేషన్: నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబుకు పట్టభద్రులు ఓటుతో బుద్ధి చెప్పాలని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖాజారహ్మతుల్లా పిలుపునిచ్చారు. కడప నగరంలో పలు విద్యాసంస్థలు, వ్యాపార సంస్థల్లో ఆదివారం వెన్నపూసకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ నిరుద్యోగులను, రైతులను.. ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితులో లేరని తెలిపారు. యువతంతా ఓటింగ్‌లో పాల్గొని ఓటు వేసి వెన్నపూసను అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు మహేశ్వరరెడ్డి, యాసిన్, రహీమ్, సాయిదత్త, రవితేజ పాల్గొన్నారు.