రమణీయం రంగనాథుని ఆలయం | Grand Ranganatha Temple | Sakshi
Sakshi News home page

రమణీయం రంగనాథుని ఆలయం

Published Mon, Jan 27 2014 4:18 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Grand Ranganatha Temple

చెక్కు చెదరని శిల్ప సంపద.... ఆకాశాన్నంటే గాలి గోపురాలు...విలువ కట్టలేని చిత్ర లేఖలు...సువిశాలమైన చెరువు... భక్తి భావాన్ని పెంచి మానసిక ప్రశాంతత నిచ్చే ఆధ్యాత్మికత కేంద్రం...వెరసి ‘రంగాపూర్  రంగనాథుని ఆలయం. కోరిన కోరికలు తీరుతాయని ఈ క్షేత్రం భక్తుల పాలిట కల్పతరువుగా విరాజిల్లుతోంది. వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నుంచి ఉగాది వరకు 15 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. ఒకసారి సందర్శిస్తే మళ్లీమళ్లీ చూడాలనిపించే ఈ క్షేత్రానికి వెళ్లొద్దాం ఇలా....
 - న్యూస్‌లైన్, పెబ్బేరు
 
 
 ఆకట్టుకునే శిల్పసంపద
 రంగనాయకస్వామి ఆలయంలో ఉన్న అద్భుతమైన శిల్పసంపద భక్తులను కట్టిపడేస్తుంది. ద్వార పాలక శిల్పాలతో ఆకాశాన్నంటే గాలిగోపురాలతో భక్తులకు ఆలయం స్వాగతం పలుకుతోంది. శేషాశయనుడై అభయహస్తం చూపుతూ స్వామివారు, ఎడమవైపున చతుర్భుజ తాయారు ఆలయంలో లక్ష్మీదేవి భక్తులకు దర్శనమిస్తారు. ఆలయం పక్కనే ఆనాటి ప్రభువులు నిర్మించిన సువిశాలమైన శ్రీరంగసముద్రం ఎంతో ఆకట్టుకుటోంది.
 
 చెరువు మధ్యలో రాజులు సాయంత్రవేళల్లో విడిది చేసే కృష్ణవిలాస్ భవనం కనిపిస్తుంది. ఆలయంలోని నేల మాళిగలో ఆనాటి చిత్రకళకు నిదర్శనంగా బంగారు పూతతో పూసిన అపురూప అరుదైన వివిధ దేవతామూర్తుల చిత్రపటాలు దర్శనమిస్తాయి. అద్భుత అందాలకు నిలయమైన ఈ ఆలయంలో ఇప్పటికే అనేక సినిమాలు, టీవీ సీరియల్స్ చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా చేసి, సందర్శకులకు రంగ సముద్రం చెరువులో బోటింగ్ ఏర్పాటు, విడిదికి అవసరమైన నిర్మాణాలు చేపడుతున్నారు.  
 
 ఇదీ రూట్...
 44వ నెంబర్ జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు ఎంతో సులువుగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వచ్చేవారు 150 కిలోమీటర్లు, కర్నూలు నుంచి వచ్చే వారు 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెబ్బేరుకు రావాలి. అక్కడి నుంచి 12 కి.మీ.దూరంలో ఉన్న శ్రీరంగాపూర్ గ్రామానికి ప్రతిరోజు తిరిగే ఆటోల ద్వారా రంగనాయక స్వామి ఆలయానికి చేరుకోవచ్చు.
 
 స్వామి వారి ఉత్సవాలు..
 రంగనాయకస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా మార్చి నెలలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామి వారికి వీధి ఉత్సవం, సూర్యవాహనసేవ, శేషవాహనసేవ, హనుమంత వాహనసేవ, మోహిని, గరుడ వాహన సేవ, రథోత్సవం నిర్వహిస్తారు. అనంతరం15 రోజుల పాటు జాతర కొనసాగుతుంది.
 
 ఆలయ చరిత్ర
 కొర్విపాడు (నేటి శ్రీరంగాపూర్) గ్రామంలో సుమారు 340 సంవత్సరాల క్రితం సూగూరు (వనపర్తి) సంస్థాన ప్రభువు అష్టభాషా బహిరీ గోపాలరావు (క్రీ.శ.1670)కాలంలో ఈ ఆలయం నిర్మాణం జరిగింది. గ్రామంలో రంగసముద్రం చెరువు ఒడ్డున గరుడాద్రి మీద నిర్మించిన ఈ రంగనాయక స్వామి ఆలయం అపర శ్రీరంగంగా పేరొందింది. ఆలయం నిర్మాణంతో కొర్విపాడు ఉన్న ఈ గ్రామం పేరు శ్రీరంగాపూర్‌గా మారింది. తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా ఉన్న శ్రీరంగంకు సమానంగా ఈ రంగాపూర్ రంగనాయకస్వామి ఆలయం ప్రసిద్ధికెక్కింది. శ్రీరంగం వెళ్లి స్వామి వారిని దర్శించే శక్తి లేని భక్తులు శ్రీరంగాపూర్ లోని ఆలయాన్ని దర్శించి పుణ్యాన్ని పొందవచ్చని భక్తుల నమ్మకం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement