
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: గ్రీన్ హైవేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.10 వేల కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఈ పనులకుగాను స్థల సేకరణకు తగ్గ ఆదేశాలు జారీ అయ్యాయి. చెన్నై నుంచి సేలం వైపు ఎనిమిది మార్గాలతో 274 కిమీ దూరంలో ఈ గ్రీన్ నేషనల్ హైవే రూపుదిద్దుకోనుంది. కన్యాకుమారి నుంచి చెన్నై మీదుగా పలు రాష్ట్రాలను కలుపుతూ జాతీయ రహదారి రూపదిద్దుకుని ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో జాతీయ రహదారుల్లో నిత్యం వాహనాలు దూసుకెళ్తున్నాయి. ఈ జాతీయ రహదారులను అనుసంధానిస్తూ రాష్ట్ర రహదారులు అనేకం ఉన్నాయి. అయినా, ట్రాఫిక్ తగ్గేది లేదు. ఈ పరిస్థితుల్లో చెన్నై నుంచి పశ్చిమ తమిళనాడు వైపుగా సేలంకు సరికొత్త రోడ్డు మార్గానికి కేంద్రం నిర్ణయించింది.
ఇందుకు తగ్గ ప్రణాళిక సిద్ధమైంది. పచ్చదనంతో నిండిన మార్గంగా ఈ జాతీయ రహదారిని రూపొందించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. ఈ పనులకుగాను స్థలసేకరణ నిమిత్తం రాష్ట్ర రహదారుల శాఖ కార్యదర్శి రాజీవ్ రంజన్‌కు కేంద్ర రహదారుల శాఖ నుంచి ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మార్గం సాగే జిల్లాల్లోని కలెక్టర్ల పర్యవేక్షణలో స్థల సేకరణకు ప్రత్యేక అధికారుల్ని రంగంలోకి దించే విధంగా ఆ ఉత్తర్వుల్లో వివరించారు. అలాగే , ఆ రోడ్‌రూట్ మ్యాప్ అంశాలను అందులో పొందుపరిచారు.
రూ.10 వేల కోట్లతో పచ్చదనం:
చెన్నై నుంచి సేలం వరకు 274 కి. మీద దూరం రూపుదిద్దుకోనున్న ఈ హైవే 250 కిమీ దూరం అటవీ మార్గంలో సాగనుంది. చెన్నై తాంబరం నుంచి ధర్మపురి జిల్లా అరూర్ వరకు ఎన్‌హెచ్ 179బీగా, అరూర్ నుంచి సేలం వరకు ఎన్‌హెచ్ 179ఏగా ఈ గ్రీన్ హైవేను పిలుస్తారు. రూ.పదివేల కోట్ల వ్యయంతో పచ్చదనంతో ఈ మార్గం రూపుదిద్దుకోనుంది. కాంచీపురం జిల్లాల్లో 53 కిమీ, తిరువణ్ణామలై జిల్లా సెయ్యారు, వందవాసి, పోలూరు, ఆరణి, సెంగం మీదుగా 122 కి.మీ, కృష్ణగిరిలో రెండు కిమీ, ధర్మపురి జిల్లా తీర్థమలై, అరూర్, పాపిరెడ్డి పట్టిలను కలుపుతూ 53 కి.మీ, సేలం జిల్లా వాలప్పాడి తాలుకా నుంచి సేలం నగరంలోకి 38 కిమీ దూరం నిర్మించనున్నారు.
స్థలసేకరణ ప్రక్రియను త్వరితగతిన ముగించాలని, ప్రత్యేక అధికారుల ద్వారా పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 250 కి.మీ దూరం అటవీ మార్గంలో ఈ గ్రీన్ హైవే పయనించనున్న దృష్ట్యా, అందుకు తగ్గ అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఉంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ రహదారి పూర్తయతే చెన్నై నుంచి సేలంకు 3 గంటల్లో చేరుకోవచ్చు. దేశంలోనే రెండవ గ్రీన్ హైవే తమిళనాడుకు దక్కడం గమనించదగ్గ విషయం.
Comments
Please login to add a commentAdd a comment