సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తారాస్థాయిలో గ్రూపు విభేదాలున్న జిల్లా కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారనుంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో రెండు, మూడు గ్రూపుల మధ్య విభేదాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి అనుచరులకు కౌన్సిలర్ టిక్కెట్లు దక్కుతా యో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. అభ్యర్థుల ఎంపిక స్థానికంగానే ఉంటుందని పీసీ సీ ఇప్పటికే సంకేతాలిచ్చింది. స్థానిక ఎమ్మెల్యే లేదా గతంలో పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి, తాజా మాజీ చైర్మన్‌తోపాటు ఇద్దరు డీసీసీ సభ్యులతో కూడిన కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుందని వెల్లడించింది. కానీ అన్ని మున్సిపాలిటీల్లో నేతల మధ్య తీవ్ర విభేదాలున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం నేతలు ఎవరికి వారే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఈ ప్రయత్నాల్లో ఈ విభేదాలు మరింత ముదిరాయి. ఈ పరిస్థితుల్లో అభ్యర్థుల ఎంపిక సజావుగా సాగడం ప్రశ్నార్థకమే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఏడు మున్సిపాలిటీలుండగా, మందమర్రి మున్సిపాలిటీకి ఈసారి కూడా ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన ఆరింటిలో ఆదిలాబాద్, మంచిర్యాల, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, భైంసా మున్సిపాలిటీలు జనరల్ మహిళలకు రిజర్వు అయ్యాయి. నిర్మల్ మున్సిపాలిటీ జనరల్ అయింది. దీంతో చైర్మన్ పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ‘సెలక్ట్.. ఎలక్ట్..’ అనే పద్ధతిపైనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి పేర్కొన్నారు. వార్డుల్లో ఉండే అన్ని వర్గాల అభిప్రాయం మేరకే తమ పార్టీ అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని చెప్పారు.
అన్ని చోట్లా గ్రూపులే..
ఆదిలాబాద్ మున్సిపాలిటీ విషయానికి వస్తే డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, పీసీసీ కార్యదర్శి సుజాత మధ్య విభేదాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన సోనియా కృతజ్ఞత సభలో ఇరువర్గాల నాయకులు ఏకంగా పరస్పర దాడులకు దిగారు. సమావేశం వేదికపై ఉన్న ఫ్లెక్సీలను చించేశారు. ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఈ రెండు వర్గాల నేతలు ఏకతాటిపైకి రావడం ప్రశ్నార్థకమే అవుతుందనే అభిప్రాయం నెలకొంది.
భైంసా మున్సిపాలిటీ విషయంలోనూ ఇదే పరిస్థితి. ముథోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌రెడ్డిలు ఆధిప త్య పోరు సాగుతోంది. మున్సిపల్ కౌన్సిలర్ టిక్కెట్ల విషయంలో ఎవరిది పైచేయి అవుతుందో తెలియని పరిస్థితి.
బెల్లంపల్లిలో ఎమ్మెల్సీ వెంకట్రావు అనుచరుడైన మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు వర్గాలున్నాయి. బెల్లంపల్లి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చినుముల శంకర్ ఉన్నారు. ఈ మూడు గ్రూపులు కలిస్తేగానీ కౌన్సిలర్ల టిక్కెట్లపై ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశాల్లేవు.
మంచిర్యాలలో దివాకర్‌రావు, ప్రేంసాగర్‌రావు గ్రూపులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇటీవల ఎమ్మెల్యే అరవిందరెడ్డి కూడా రాకతో మూడు బలమైన గ్రూపులుగా తయారైంది. ఎవరిని ఆశ్రయిస్తే టిక్కెట్టు వస్తుందో తెలియని అయోమయం నెలకొంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో అరవింద్‌రెడ్డి అప్పుడే ఓ అడుగుముందుకేసి సమష్టిగా చర్చించి ఎంపిక చేస్తామని ప్రకటించారు. ఎదుటి వర్గం నేతల నుంచి స్పందన కరువైంది.
కాగజ్‌నగర్‌లో మున్సిపల్ మాజీ చైర్మన్ దస్తగిరి అ హ్మద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గజ్జిరామయ్య, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు రమణారావు తదితరుల మ ధ్య అంతర్గత విభేదాలున్నాయి. టిక్కెట్ల విషయంలో ఎవరికి వారే ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు.
నిర్మల్‌లో కాంగ్రెస్ గ్రూపులు బహిర్గతం కాకపోయినా అంతర్గతంగా ఉన్నాయి. ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి రాకముందు నుంచి ఉన్న నాయకులకు, ఆయన కాంగ్రెస్‌లో చేరాక తెరపైకి వచ్చిన నేతలకు మధ్య విభేదాలున్నాయి. ఇక్కడ కూడా టిక్కెట్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం నెలకొంది.
కత్తిమీద సామే!
Published Thu, Mar 6 2014 12:27 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement