మూడో కుంపటి!?
ఎమ్మెల్సీ మూర్తి నేతృత్వంలో తెరపైకి మూడోవర్గం
ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలతో బలప్రదర్శన
గంటా, అయ్యన్న వర్గాలకు కొత్త సవాల్
జిల్లా టీడీపీలో వర్గవిభేదాల సెగ
విశాఖపట్నం : జిల్లా టీడీపీలో వర్గ పోరు ఆసక్తికర మలుపుతిరుగుతోంది. ఇప్పటికే రెండువర్గాల పోరు రాజేస్తుంటే తెరపైకి మూడో కుంపటి వచ్చి చేరింది. మంత్రులు అయ్యన్న, గంటా వర్గాలకు పోటీగా జిల్లా టీడీపీలో మూడో వర్గం రూపపుదిద్దుకుంటోంది. ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తిని ముందుంచుతూ ఈ వర్గం బలప్రదర్శనకు సంసిద్ధమవుతోంది. ఇద్దరు మంత్రుల వైఖరితో విసిగిపోయిన ఎమ్మెల్యేలు ఈ మూడో వర్గం గొడుకు కిందకు చేరుతుండటం గమనార్హం. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందున్న అంచనాల నేపథ్యంలో ఈ మూడో వర్గం సత్తాన్ని చూపడానికి పావులు కదుపుతోంది.
మంత్రులకు మూర్తి చెక్!: మంత్రులు గంటా, అయ్యన్నలు వారి ప్రయోజనాలే చూసుకుంటూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. మూర్తి ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో వారికి ఓ ప్రత్యమ్నాయాన్ని చూపించాయి. గంటా, అయ్యన్నలకు చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా ఈయనకు సన్నిహితమవుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, గణబాబు ఎమ్మెల్సీ మూర్తితో జట్టుకట్టారు. ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు కూడా ఎంవీవీఎస్ మూర్తితో సాన్నిహిత్యం ఉంది. ఆయన కూడా ఈ వర్గంలో చేరిపోయారు. దాంతో ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలతో ఈ వర్గం బలంగా తయారైంది. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా వీరితో టచ్‌లో ఉంటుండటం గమనార్హం.
మంత్రుల విఫలయత్నం : ఈ పరిణామాలు మంత్రులు అయ్యన్న, గంటాలకు కంటగింపుగా తయారైంది. ఎమ్మెల్సీ మూర్తికి నేరుగా సీఎం చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉండటం వారికి దడపుట్టిస్తోంది. పోటీగా ఓ బలమైన వర్గం రూపుదిద్దుకోవడం వారికి కంటగింపుగా మారింది. ఈ వర్గ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఎంవీవీఎస్ మూర్తి జిల్లాకు తొలిసారి వచ్చినప్పుడు టీడీపీ నేతలు పెద్దగా హాజరుకాకుండా ఉండేలా కట్టడి చేశారు. ఎక్కువమంది ఎమ్మెల్యేలు, ద్వితీయశ్రేణి నేతలు హాజరుకాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్రధానంగా అయ్యన్నకు సన్నిహితుడైన సిటీ ఎమ్మెల్యే ఒకరు ద్వితీయశ్రేణి నేతలకు ఫోన్లు చేసి మరీ ఆ సమావేశానికి వెళ్లొద్దని చెప్పారు. మంత్రి గంటా అనుచర వర్గం పూర్తిగా రంగంలోకి దిగి ఆ సమావేశం విఫలం చేసేందుకు ప్రయత్నించింది. తాజా మాజీ కార్పోరేటర్లు ఎక్కువగా సమావేశానికి వెళ్లకుండా కట్టడి చేసింది. ఇద్దరు మంత్రుల యత్నాలు పూర్తిగా సఫలీకృతం కాకపోవడంతో మూర్తి శిబిరంలో ఉత్సాహాన్నింపింది.
మంత్రి పదవే లక్ష్యంగా వ్యూహరచన : మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారన్న సమాచారం నేపథ్యంలో టీడీపీలో వర్గ పోరు పీటముడి మరింతగా బిగుసుకుంటోంది. ఇప్పటికే ఇద్దరు మంత్రులు గంటా, అయ్యన్నల వర్గ విభేదాలతో విసిగిపోయిన చంద్రబాబు కొత నేతను తెరపైకి తెస్తారని భావిస్తున్నారు. ఎమ్మెల్సీ మూర్తివర్గం పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తోంది. మూడో మంత్రి పదవి అవకాశం ఇవ్వాల్సి వస్తే ఎలా చేయాలి?... ఇద్దరు మంత్రుల్లో ఒకర్ని తప్పించి కొత్తవారికి అవకాశం ఇస్తే ఎలా చేయలి అనే ప్రతిపాదనలతో చంద్రబాబును కలవాలని భావిస్తోంది. ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల అభిప్రాయాలను కూడగట్టే పనిలో నిమగ్నమైంది. హడావుడిలేకుండా చాపకింద నీరులా సాగిస్తున్న ఈ వ్యవహారం మాత్రం అయ్యన్న, గంటా వర్గాల్లో కారం చల్లుతోంది.