* నిర్విఘ్నంగా సాగుతున్న కౌంట్‌డౌన్
* సాయంత్రం గం. 4.50 కు ‘షార్’ నుంచి ప్రయోగం
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజన్ తో కూడిన జీఎస్‌ఎల్‌వీ డీ5 రాకెట్ సోమవారం నింగికి దూసుకుపోనుంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో ఈ మేరకు ఆదివారం ఉదయం 11.50 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమై నిర్విఘ్నంగా కొనసాగుతోంది.
29 గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం సాయంత్రం 4.50 గంటలకు రెండో ప్రయోగవేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ డీ5 నింగికి దూసుకుపోనుంది. ప్రయోగానికి ఆరు గంటల ముందు రాకెట్‌లోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలను అప్రమత్తం చేస్తారు. ఈ ప్రయోగం ద్వారా జీశాట్-14 సమాచార ఉపగ్రహాన్ని 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెడతారు. జీశాట్-14లో 6 కేయూ బాండ్, 6 ఎక్సెటెండెడ్ సీబాండ్, భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి రెండు కేఏ-బాండ్ ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయి.
డీటీహెచ్ ప్రసారాలు, టెలికం రంగానికి ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలు అందించనుంది. జీఎస్‌ఎల్‌వీ డీ5 కౌంట్‌డౌన్‌ను ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ ప్రయోగంలో క్రయోజనిక్ దశ కీలకం కావడం, గతంలో ఆ దశ వైఫల్యం చెందిన నేపథ్యంలో ఆయన అప్రమత్తంగా ఉన్నారు.
నేడు నింగికి ‘జీఎస్‌ఎల్‌వీ డీ5’
Published Mon, Aug 19 2013 2:45 AM | Last Updated on Fri, Sep 1 2017 9:54 PM
Advertisement