మీ పాలనకై వేచి చూస్తున్నం.. | Guntur People Are Waiting For YS Jagan Mohan Reddy Government | Sakshi
Sakshi News home page

మీ పాలనకై వేచి చూస్తున్నం..

Published Tue, Mar 19 2019 11:04 AM | Last Updated on Tue, Mar 19 2019 11:04 AM

Guntur People Are Waiting For YS Jagan Mohan Reddy Government - Sakshi

సాక్షి, గుంటూరు : గుప్పెడు మెతుకుల కోసం ఏ రోజుకారోజు కండలు కరిగించే పేదోడి గుండెకు జబ్బు చేస్తే నువ్వెందుకయ్యా విలవిలలాడిపోయావు. బక్కచిక్కినోళ్ల ఇళ్లలో భవిష్యత్‌ వెలుగు దీపమై ప్రకాశించాల్సిన బిడ్డల చదువులు మధ్యలో ఆగిపోతుంటే నువ్వెందుకయ్యా దిగులు పడ్డావుఅవ్వాతాతల ఆవేదనలు ఓ మూలన దీనంగా వినిపిస్తుంటే .. నీ గుండెపై ఎందుకయ్యా కన్నీటి తడి తెచ్చుకున్నావు.

పాదయాత్ర ఆసాంతం.. ప్రతి అడుగులో బడుగుల ఆరని కన్నీళ్లు నిన్ను కదిలించాయా.. అప్పటి చంద్రబాబు పాలనలో దుర్భిక్ష పరిస్థితులు నిన్ను చలింపచేశాయా.. అందుకేనా.. ఆరోగ్యశ్రీ పథకంలో మనసున్న వైద్యుడిగా మారావు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో బిడ్డల జీవితాలకు ఉజ్వల దారులు పరిచావు. పింఛన్‌లతో అవ్వాతాతల బోసినవ్వులను దోసిటపట్టావు. సంక్షేమాన్ని పేదోళ్ల గుమ్మానికి తోరణంగా కట్టావు.. ఇన్ని చేసిన నిన్ను ఎవరూ మరిచిపోలేదయ్యా.

ప్రజల నుంచి దూరమై ఏళ్లు గడుస్తున్నా ప్రతి గుండెచప్పుడులోనూ నిత్యం వినిపిస్తూనే ఉన్నావు. పేదోళ్ల ప్రతి మాటలోననూ కనిపిస్తూనే ఉన్నావు. నిర్మలమైన నీ రూపంతో ప్రతి గుండె గుడిలో దేవుడిలా కొలువై నిలిచిపోయావు. అందుకే గుంటూరు గుండె చప్పుడు ఎదురు చూస్తోంది మళ్లీ సంక్షేమ సారథివై వస్తావని.. 

జిల్లావాసుల సుదీర్ఘ స్వప్నమైన పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం వైఎస్‌ హయాంలో ప్రారంభమైంది. 2004లో జలయజ్ఞంలో భాగంగా జిల్లా పరిధిలోని బెల్లంకొండ మండలం పులిచింతల గ్రామం, నల్గొండ జిల్లాలోని మేళ్ళచెరువు గ్రామాల మధ్య పులిచింతల నిర్మాణ పనులు చేపట్టారు. 13.08 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే ఉద్దేశంతో రూ.682 కోట్లతో ప్రాజెక్టు మంజూరైంది. ప్రాజెక్టు నిర్మాణం రూ.483.33 కోట్లతో పనులు పూర్తయ్యాయి.

ప్రాజెక్టు నిర్మాణం పూర్తితో హెక్టారుకు 3.4 టన్నుల ఆహార ధాన్యాల అధిక ఉత్పత్తి అవుతుందని, తద్వారా రూ.808 కోట్ల నికర ఆదాయం పొందవచ్చని అంచనా. నాగార్జునసాగర్‌ కుడి కాల్వ పరిధిలో రూ.7.46 కోట్లతో కాల్వ ఆధునికీకరణ పనులు చేపట్టారు. కృష్ణా పశ్చిమ డెల్టాలకు దివంగత వైఎస్‌ఆర్‌ హయాంలో మహర్దశ పట్టింది. రెండు డెల్టాలకు రూ.4,444.41 కోట్లతో 604 కిలోమీటర్ల పొడవునా కాల్వల ఆధునీకరణ, 848 కొత్త బ్రిడ్జిల మంజూరయ్యాయి. జిల్లాలో 1,59,489 ఎకరాల ఆయకట్టుకు నీరందించటానికి 234 లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు 483.27 కోట్లతో మంజూరైనా .. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణంతో వాటిని పట్టించుకునే నాథుడు లేక నిలిచిపోయాయి. 

అడిగిన వెంటనే ఎత్తిపోతల వరం

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వినుకొండ ప్రాంతం అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. 2004లో తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వినుకొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామస్తులు ముఖ్యమంత్రిని కలసి తమ గ్రామం గుండ్లకమ్మ నది ఒడ్డున ఉన్నప్పటికీ సాగు నీరు అందడం లేదని తెలిపారు. వైఎస్‌ వెంటనే స్పందించి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ.4.80 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు సభాస్థలిలోనే ప్రకటించారు. దీంతో చకచకా పథకం నిర్మాణం పూర్తయింది. 1050 ఎకరాలు మెట్ట భూములకు సాగు నీరు వచ్చింది. గతంలో రూ.50 వేలు ధర కూడాలేని భూములు ఇప్పుడు లక్షల రూపాయలు పలుకుతున్నాయి. ఆయన జ్ఞాపకార్థంగా గ్రామంలో వైఎస్‌ విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు.  

గొంతు తడిపిన మహనీయుడు

గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల, – గురజాల పట్టణ ప్రజల మంచినీటి కష్టాలను చూసి  వైఎస్‌ చలించిపోయారు. గోవిందాపురం కృష్ణానది నుంచి రూ.36 కోట్ల వ్యయంతో పిడుగురాళ్ల పట్టణానికి మంచినీటిని అందించే రక్షిత మంచినీటి పథకాన్ని పూర్తి చేశారు. గురజాలకు సైతం బుగ్గవాగు నుంచి రూ.12 కోట్ల వ్యయంతో మంచినీటిని అందించారు.సత్తెనపల్లి పట్టణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.14.5 కోట్లతో 120 ఎకరాల మంచినీటి చెరువును కొనుగోలు చేసి బాగు చేయించారు. మరో రూ.20 కోట్లతో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు, ఓవర్‌హెడ్‌ ట్యాంకులను నిర్మించి రెండు పూటలా మంచినీరు అందించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement