గుంటూరుకు జర్రమొచ్చింది! | Guntur People Suffering With Viral Fever | Sakshi
Sakshi News home page

గుంటూరుకు జర్రమొచ్చింది!

Published Wed, Sep 5 2018 12:16 PM | Last Updated on Wed, Sep 5 2018 12:16 PM

Guntur People Suffering With Viral Fever - Sakshi

జీజీహెచ్‌ జ్వరాల వార్డులో చికిత్సపొందుతున్న రోగులు

జ్వరాలతో జిల్లా మంచం పట్టింది. ఎక్కువ మంది రోగులు డెంగీ, మలేరియా బారిన పడ్డారు. ముఖ్యంగా               గుంటూరు నగర వాసులు జ్వరాలతో సతమతమవుతున్నారు. ఈ ఏడాది మార్చిలో అతిసారతో అల్లాడిన నగర ప్రజలు నేడు డెంగీ, మలేరియాతో         ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో నమోదైన జ్వరం కేసుల్లో సగం గుంటూరులోనే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.

గుంటూరు మెడికల్‌: జిల్లా ప్రజలు జ్వరాలతో అల్లాడుతున్నారు. ముఖ్యంగా గుంటూరు నగర ప్రజలు డెంగీ, మలేరియాతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఏడాది మార్చిలో అతిసార వ్యాధితో అల్లాడిపోయిన నగర ప్రజలు నేడు డెంగీ, మలేరియా జ్వరాలతో మంచంపట్టారు. రాష్ట్రంలో ఏ నగరంలోనూ లేని విధంగా   సుమారు రెండువేలకు పైగా డయేరియా కేసులు నమోదవడంతో పాటుగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. ప్రజలకు నగరపాలక సంస్థ అధికారులు సరఫరా చేసిన తాగునీరు పరిశుభ్రంగా లేకపోవడం, నీటిలో ఈ కోలి బ్యాక్టీరియా ఉండటం వల్లే అతిసార వ్యాధి ప్రబలిందని నిర్ధారణ చేశారు. తాజాగా జిల్లాలో నమోదవుతున్న మలేరియా, డెంగీ కేసుల్లో అధికశాతం గుంటూరు నగరంలోనే నమోదుకావడంపై వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జ్వరాలను వ్యాప్తి చేసే దోమలు వృద్ధి చెందడానికి నగరంలో అనుకూల వాతావరణం ఉంది. అనేక ప్రాంతాల్లో రోడ్లన్నీ చెత్తకుప్పలతో నిండిపోయాయి. మురుగు నీరు రోజుల తరబడి ఇళ్ల మధ్య తిష్టవేసింది. దీంతో దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా వంటి వ్యాధులను వ్యాప్తిచేస్తున్నాయి.

జ్వరాల కేసుల వివరాలు
గుంటూరు జిల్లాలో 2015 సంవత్సరంలో దోమకాటు వల్ల వచ్చే  మలేరియా కేసులు 413 నమోదయ్యాయి. గుంటూరు నగరంలోనే 271 మలేరియా కేసులు నమోదయ్యాయి. 2016లో జిల్లా వ్యాప్తంగా 369 మలేరియా కేసులు నమోదవగా 263 కేవలం గుంటూరు నగరంలోనే కావడం గమనార్హం. 20 17లో జిల్లా వ్యాప్తంగా నమోదైన 962 మలేరియా కేసుల్లో 667 గుంటూరువే. 2018లో ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 279 మలేరియా కేసులు నమోదయ్యాయి. 172 గుంటూరు నగరంలోనే నమోదుకావడం గమనార్హం. మలేరియా జ్వరా నికి జిల్లా మొత్తానికి గుంటూరు నగరం చిరునామాగా మారడంపై విమర్శలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్లుగా జిల్లా మలేరి యా అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న పలు వురు వైద్య సిబ్బంది, అధికారులు సైతం మలేరియా వ్యాధిన బారిన పడ్డారంటే నగరంలో మలేరియా వ్యాప్తి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

డెంగీ కేసులదీ అదే తీరు
జిల్లాలో 2016లో 349 డెంగీ కేసులు నమోదయ్యాయి. వాటిలో 65 కేసులు గుంటూరు నగరంలో నమోదయ్యాయి. 2017లో జిల్లా వ్యాప్తంగా 686 డెంగీ కేసులు నమోదు నగరంలో 180 కేసులు నమోదయ్యాయి. 2018లో ఆగస్టు 31వ తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా 87 డెంగీ కేసులు నమోదవగా వాటిలో 42 కేసులు గుంటూరువే. ఈ పరిస్థితిపై ప్రజలతోపాటు వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జ్వరాలు నమోదవుతున్న ప్రాంతాలు ఇవీ..
నగరంలో సా«ధారణంగా స్లమ్‌ ఏరియాలు, నగర శివారున ఉండే మురికివాడల్లో ఎక్కువగా జ్వరా లు నమోదవడం సహజం. అయితే క్లాస్, కమర్షియల్‌ ఏరియాగా పేరు పొందిన అరండల్‌పేట, బ్రాడీపేటలో సైతం మలేరియా, డెంగీ కేసులు నమోదవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నల్ల చెరువు, శారదాకాలనీ, కేవీపీ కాలనీ, ఏటి అగ్రహా రం, స్వర్ణభారతి నగర్, మంగళదాస్‌నగర్, పాతగుంటూరు, డీఎస్‌నగర్, ఆనంద్‌పేట, బాలా జీనగర్, లాలాపేట తదితర ప్రాంతాల్లో కేసులు నమో దు అవుతున్నాయి. కార్పొరేషన్‌ వైద్యాధికా రులు, జిల్లా వైద్యాధికారులు సమన్వయం చేసుకుని ఎన్‌జీఓల సహకారంతో ప్రజలకు వ్యాధులపై అవగాహన కల్పించి, వాటి బారిన పడకుండా చేయాల్సి ఉంది. లేకుంటే నేడు కొన్ని ప్రాంతాలకే పరి మిత జ్వరాలు నగరం అంతా వ్యాపించే ప్రమాదం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
గుంటూరు నగరంలో జ్వరాల కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో కార్పొరేషన్‌ సిబ్బంది సహకా రంతో దోమల నివారణ చర్యలు తీసుకుంటున్నాం. గతంలో కేసులు నమోదయిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఆయా ప్రాంతాల్లో సిబ్బందికి అదనంగా విధులు కేటాయించాలని ఆదేశించాం. ఇంటింటికి సర్వే చేసి వ్యాధులు సోకకుండా అవగాహన కల్పించి కరపత్రాలను అందజేస్తున్నాం. ప్రజలు సహకారం లేకుండా దోమల నియంత్రణ సాధ్యం కాదు. ప్రజలు ఇంటి ముందు కాల్వలో, రోడ్లపై మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. దోమతెరలు వాడటం ద్వారా రోగాల బారిన పడకుండా ఉండొచ్చు. జ్వరం వచ్చిన వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్తే అన్ని పరీక్షలు ఉచితంగా చేస్తారు.– డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్,జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement