
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మత సామరస్యం లేకపోవడానికి హిందూ నాయకులే కారణమంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు ఖండించారు. బుధవారం జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ.. మత ఘర్షణలకు హిందువులే కారణమంటూ చెప్పడం వెనక పవన్‌కు రాజకీయ దురుద్దేశం ఉందని మండిపడ్డారు. పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టీడీపీ నేతలు బీజేపీతో కలిసే ఉన్నారని, కేంద్ర పెద్దలు అంటే తనకెంతో గౌరవం ఉందంటూ పవన్ చెప్తున్నారని జీవీఎల్ తెలిపారు. బీజేపీ విధానాలు నచ్చి కలిసి పని చేయాలనుకునే ప్రాంతీయ పార్టీల విలీనాన్ని స్వాగతిస్తామని చెప్పారు. పవన్ విలీన ప్రతిపాదనతో వస్తే కచ్చితంగా ఆహ్వానిస్తామని.. అందుకు తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ఎన్నికల ముందే జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని కోరినప్పటికీ పవన్ అంగీకరించలేదని వ్యాఖ్యానించారు. మరోవైపు పొత్తులకు ఇది సమయం కాదని అభిప్రాయపడ్డారు.
ఏపీకి 3 స్మార్ట్ సిటీలు మాత్రమే కేటాయించారు : టీజీ
స్మార్ట్ సిటీల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. అభివృద్ధి చెందిన తమిళనాడు రాష్ట్రానికి 11 స్మార్ట్ సిటీలు కేటాయిస్తే, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం 3 మాత్రమే కేటాయించారని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత నాలుగేళ్ల కింద ప్రారంభమైన అమృత్ పథకంలో భాగంగా కర్నూలు పట్టణ త్రాగునీటి అవసరాలకు నిధులు కేటాయించారని వాటిని సక్రమంగా ఖర్చుపెట్టి సకాలంలో పనులు పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సకాలంలో పనులు పూర్తి చేసినట్లయితే కర్నూలు జిల్లా ప్రజల నీటి కష్టాలు తొలుగుతాయని టీజీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment