సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులదే. తల్లిదండ్రుల తరువాత గౌరవించేది అధ్యాపకులనే. ఇంతటి గౌరవప్రదమైన వృత్తికే కళంకం తెచ్చాడు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న ఆ కీచకుడు స్పెషల్ క్లాసుల పేరుతో తన ఫ్లాట్‌కు విద్యార్థినులను రప్పించుకుని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆ అధ్యాపకుడిపై ఫిర్యాదు చేద్దామంటే వర్సిటీలో ఉన్నతాధికారులంతా ఆయన్నే వెనకేసుకొస్తూ బాధితులనే బెదిరిస్తుండడంతో చాలా కాలం పాటు మౌనందాల్చారు. చివరకు ధైర్యం చేసి నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే లేఖ రాశారు. లేఖ అందుకున్న ముఖ్యమంత్రి తక్షణమే విచారణకు ఆదేశించారు.
చరిత్ర ఘనం...
కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారిని ఆనుకుని రాజానగరం వద్ద మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్నయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు ప్రభుత్వ ఆధ్వర్యంలో మరో వర్సిటీ కావాలనే సంకల్పంతో నాడు ఈ వర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వర్సిటీకి అనుబంధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న కాలేజీలు అన్నింటా కలిపి 1.20 లక్షల మంది విద్యార్థులు చదువుకుం టున్నారు. ఒక్క రాజా నగరంలో వర్సిటీ క్యాంపస్‌లోనే 2,200 మంది విద్యను అభ్యసి స్తున్నారు. అన్ని వేల మంది విద్యార్థులు చదువుకుంటు న్న ఈ వర్సిటీలో విద్యార్థినుల పట్ల అధ్యాపకుని లైంగిక వేధింపులపై వర్సిటీలో సహచర అధ్యాపకులెవరూ పెదవి విప్పడం లేదు. ఇంగ్లిషు హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్‌గా పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.సూర్యరాఘవేంద్ర ఈ ఆరోపణలకు కేంద్ర బిందువుగా నిలిచారు. చాలా కాలంగా ఈ వేధింపులున్నా భవిష్యత్తు దెబ్బతింటుందనే భయంతో విద్యార్థునులెవరూ ముందుకు రాలేదు.
కీచకుడుగా మారి...
ఇంగ్లిషు పాఠాలు చెప్పాల్సిన ఈ మాస్టారు ప్రేమ పాఠాలు చెబుతూ లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. చాలా కాలంగాప్రొఫెసర్ వేధింపులను భరిస్తూ వచ్చారు. వేధింపులు ఇటీవల మితిమీరిపోవడంతో నలుగురైదుగురు విద్యార్థినులు ధైర్యం చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి లేఖ రాయడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. ప్రొఫెసర్ నుంచి ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను లేఖలో పూసగుచ్చినట్టు వివరించారు. దీనిపై తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి విచారణకు ఉన్నత విద్యాశాఖను ఆదేశించారు. ఆ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ టేకీ ఆధ్వర్యంలో అంతర్గతంగా విచారణ జరుపుతున్నారు. వర్సిటీ ప్రతిష్టకు భంగం కలుగుతుందనో లేక, విద్యార్థినులు భయపడుతున్నట్టే వర్సిటీ పరిపాలనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న అధికారులు నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారో తెలియదు కానీ విషయాన్ని బయటకుపొక్కకుండా జాగ్రత్తపడుతున్నారు. మహిళా అధ్యాపకులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కొత్తపల్లి వీర్రాజుపై సస్పెన్షన్ వేటు పడిన ఉదంతం మరిచిపోకముందే నన్నయ్య వర్సిటీలో ఓ ప్రొఫెసర్ వేధింపుల బాగోతం వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది.
‘ప్రత్యేకం’ పేరుతో...
వర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్ కోర్సు చేస్తున్న కొంతమంది విద్యార్థినులు పాఠాలు అయిపోయాక స్పెషల్ క్లాసుల కోసమంటూ రాజమహేంద్రవరంలో తన ఫ్లాట్‌కు రావాలని బలవంతం చేస్తున్నాడు. తెగించి ఎవరైనా పై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే ప్రాజెక్టులు ఆపేస్తా, పాస్ కాకుండా చేస్తాననే బెదిరింపులతో విద్యార్థినులు పెదవి విప్పలేని పరిస్థితి. ఒక దశలో కొందరు విద్యార్థినులు ఇన్‌ఛార్జి వైస్‌చాన్సలర్‌కు ఫిర్యాదు చేద్దామని అనుకున్నా ఆయన తనకు బాగా క్లోజ్ అని... ఒకవేళ చెబితే మీకే నష్టమని బెదిరింపులకు దిగడంతో ఫిర్యాదుకు వెనకడుగు వేశారు. విద్యార్థినుల మొబైల్ నంబర్లు సతీసుకుని వాట్సప్‌లో అసభ్య పదజాలంతో కూడిన సందేశాలు పంపిస్తూ చాటింగ్ కూడా చేసేవాడంటున్నారు. యూనివర్సిటీ పరిపాలనంతా తన చేతిలోనే ఉందని, పీజీలో చేరాలన్నా, పీహెచ్‌డీ చేయాలన్నా, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నా, చివరకు యూనివర్సిటీలో జాబ్ రావాలన్నా వీసీ తాను చెప్పిందే చేస్తారంటూ విద్యార్థినులను బెదిరించి లొంగదీసుకున్నాడని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వేధింపుల వ్యవహారంపై అంతర్గత విచారణ జరుగుతోంది.
సీఎంకు రాసిన లేఖలో ఇలా...
‘నీ ప్రాజెక్టు వర్కు కంప్లీట్ చేసి, ఎగ్జామ్‌లో ఎక్కువ మార్కులు వచ్చే విధంగా చేస్తాను. ఒక గంట నేను చెప్పినట్టుగా వింటే చాలు. కాదని విషయాన్ని ఎవరికైనా చెప్పావా, నీకే నష్టం. ఎందుకంటే వీసీ నేను చెప్పిందే వింటాడు, నీవు అంగీకరిస్తే బాక్‌లాగ్ సబ్జెక్ట్సు కూడా పాస్ చేయిస్తాను. లేకుంటే వాటిలో ఎప్పటికీ పాస్ కాలేవని’ అంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. ఇప్పటివరకూ వేధింపులలో బలైపోయి, బతుకులు నాశనం చేసుకున్న వారెందరున్నారో తెలియదు గానీ ఆ అధ్యాపకుని వికృత చేష్టలను బయటపెట్టే సాహసం చేసిన వారు మాత్రం కొంతమందే. ఆ కొద్దిమంది ముందుకు వచ్చి ‘శాడిస్టు అధ్యాపకునిపై తగిన చర్యలు తీసుకోవా’లని సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశారు.
ఆరోపణలు అవాస్తవం
విద్యార్థినులపై లైంగిక వేధింపులకు దిగుతున్నాననే ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ప్రత్యేక తరగతుల కోసం యూనివర్సిటీకి ఉదయాన్నే రమ్మంటుంటాం. ఆ విధంగా రావడానికి ఇష్టపడని వారే ఇలా తప్పుడు ప్రచారం చేస్తుంటారనుకుంటున్నా. హెచ్‌ఓడీగా నేను గత నాలుగు సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. అది ఇష్టం లేని వారు కూడా ఇటువంటి అభియోగాలు చేస్తున్నారు.
– డాక్టర్ ఎన్. సూర్యరాఘవేంద్ర,హెచ్‌ఓడీ ఆఫ్ ఇంగ్లిష్
విచారణవాస్తవామే
ఇంగ్లిషు విభాగాధిపతిపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలు అవునా, కాదా తెలుసుకునేందుకు ప్రస్తుతం విచారణ జరుగుతోంది. మరో రెండు, మూడు రోజుల్లో నిజంఏమిటనేది విచారణలో తేలుతుంది.
– డాక్టర్ పి. సురేష్‌వర్మ, వైస్ చాన్సలర్
జగనన్నకు మా విన్నపం
న్యాయం చేయాలని విద్యార్థినుల కన్నీటి లేఖ
చాలా రోజులుగా ఈ ఆదికవి నన్నయ యూనివర్సిటీలో జరుగుతున్న అఘాయిత్యాలను మీ దృష్టికి తీసుకురావడానికి మేము రాస్తున్న ఉత్తరం మా మానసిక మనో వేదనను ప్రతిబింబిస్తుంది.ఎన్నో ఆశలతో, మా తల్లిదండ్రులు మాపై ఉంచిన నమ్మకంతో నన్నయ యూనివర్సిటీలో ఉన్నత చదువులను పూర్తి చేయాలని అడుగుపెట్టాం. మా అమాయకత్వాన్ని అలుసుగా చేసుకుని మా జీవితాలతో ఇంగ్లిష్ డిపార్ట్‌మెంట్ హెడ్ ఎన్.సూర్యనాగేంద్ర ఆడుకుంటున్నాడు.వైస్ చాన్సలర్ పి.సురేష్‌వర్మ చాలా చాలా క్లోజ్ అని ఆయన చెప్పుకుంటున్నారు. అందువల్ల మాకు న్యాయం జరగదు. సూర్యరాఘవేంద్ర, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పి.సురేష్‌వర్మపై ఫిర్యాదులు చేసినా ఉపయోగం లేదు.
రాష్ట్ర ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సాధించిన మీరు మా అన్నగా... తండ్రిగా ఆలోచించి మా జీవితాలను నాశనం చేస్తున్న ఒక శాడిస్ట్ ప్రొఫెసర్‌ను వర్సిటీ నుంచి డిస్మిస్ చేయాలని కోరుతున్నాం. చాలా మంది ఆడపిల్లలు మీ ముందుకు వచ్చి చెప్పుకోలేకపోవడానికి అనేక కారణాలున్నాయి. ఈ విషయాలు ఇంట్లో తెలిస్తే ఎక్కడ చదువును అర్ధాంతరంగా ఆపేస్తారోనని భయం. మొత్తం మా బాధను వైస్ చాన్సలర్‌కు చెప్పినప్పటికీ న్యాయం జరగలేదు. అందుకే మీ దృష్టికి మా బాధను తీసుకువస్తున్నాం. మేము విద్యార్థినులం. మా కన్నీళ్లు యూనివర్సిటీకి మంచిది కాదు. అందరూ విద్యార్థినులూ మాలా ముందుకు ధైర్యంగా రాలేరు. మాలాంటి అమాయకపు విద్యార్థినుల జీవితాలను కాపాడాలని ఈ ఉత్తరం ద్వారా విన్నవిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment