చిరకాలం.. చిరంజీవే! | haribabu donated his organs | Sakshi
Sakshi News home page

చిరకాలం.. చిరంజీవే!

Published Mon, Dec 1 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM

చిరకాలం.. చిరంజీవే!

చిరకాలం.. చిరంజీవే!

ఆరిపోయే కొవ్వొత్తి కాసేపట్లో తాను శూన్యమవుతానని తెలిసి కూడా మరో కొవ్వొత్తికి వెలుగునిస్తుంది. అంతటి గొప్ప మనసు సృష్టిలో జీవరాశులకు ఉండటం..అరుదు! తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ ఒక మనిషి మరొక  మనిషికి ప్రాణం పోయడం.. బహు అరుదు!! ప్రాణం మీద కొస్తోందంటే జీవరాశులు త్యాగానికి సిద్ధపడవు. త్యాగాన్ని స్వార్థం.. నిత్యం వెనక్కు నెడుతుంది.

అది మనిషైనా, ప్రాణమున్న ఏ జీవైనా. కాలం మారే కొద్దీ మనుషుల్లో స్వార్థం దూరమవుతోందని కొన్ని ఘటనలు రుజువు చేస్తున్నాయి. మనుషులు కూడా ఇప్పుడిప్పుడే కొవ్వొత్తుల్లా కరిగిపోవడం అలవాటు చేసుకుని తమ వెనక తరం వారికి ఆదర్శంగా ఉంటున్నారు. ఓ ఉద్యోగి త్వరలో తాను చనిపోతానని తెలుసుకుని అవయవాల దానానికి మనస్ఫూర్తిగా అంగీకరించాడు. మరొకరికి ప్రాణం పోసిన గంటల్లోనే ఆ కొవ్వొత్తి కరిగిపోయింది.

టంగుటూరు : మండలంలోని వల్లూరమ్మ దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ వి.హరిబాబు(42) తన అవయవాలను మరొకరికి దానం చేసి ఆదివారం తుది శ్వాసం విడిచారు. ఆయన చిన్న వయసులోనే వల్లూరమ్మ దేవస్థానంలో చిరుద్యోగిగా కాంట్రాక్ట్ బేసిక్ పై చేరారు. విధులు చిత్తశుద్ధితో నిర్వహించి ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదిగి పలువురి అధికారులకు దగ్గరయ్యారు. ఉద్యోగం పర్మినెంటై అదే ఆలయంలో ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్‌గా కొనసాగుతున్నారు.

14 ఏళ్లు అమ్మవారి సేవలో హరిబాబు పునీతులయ్యారు. దేవస్థానానికి కార్యనిర్వాహణాధికారిగా ఎవరు వచ్చినా కొన్ని రోజుల్లోనే హరిబాబుకు వారు దగ్గరవుతారంటే విధుల పట్ల ఆయన చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చు. పేరుకు సీనియర్ అసిస్టెంట్ అయినా తన సుదీర్ఘ అనుభవంతో ఉన్నతాధికారులకు సలహాదారునిగా కూడా వ్యవహరించారు. వల్లూరమ్మ దేవస్థానం అనగానే అక్కడ పని చేసిన ఉద్యోగులు నుంచి.. పాలకవర్గ సభ్యులు, ఆ శాఖ ఉన్నతాధికారులకు మొదట గుర్తుచ్చేది హరిబాబే.

ఇంతకీ ఏమైంది?
గరువారం తన కుమార్తె కృషి 8వ పుట్టిన రోజు వేడుకలను బంధుమిత్రుల నడుమ హరిబాబు ఘనంగా జరిపారు. కుమార్తెతో కలిసి దేవస్థానానికి వచ్చి సహచర ఉద్యోగులకు స్వీట్లు పంచారు. ఈ నేపథ్యంలో ఒంగోలులో నివాసం ఉండే హరిబాబు తన స్వగ్రామం త్రోవగుంటలోని కుటుంబ సభ్యుల వద్దకు భార్య శేషమ్మ, కుమార్తెతో కలిసి అదే రోజు బయల్దేరారు. రాత్రికి తిరిగి వచ్చి ఓ హోటల్‌లో ముగ్గురూ భోజనం చేశారు. ఉన్నట్టుండి హరిబాబుకు ఒక్కసారిగా హైబీపీ వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చగా వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. మెరుగైన చికిత్స కోసం తక్షణమే విజయవాడ పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని బంధువులకు సూచించారు.

ఈ నెల 28వ తేదీన శుక్రవారం ఉదయం హరిబాబును బంధువులు విజయవాడ తీసుకెళ్లారు. అక్కడ కూడా వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. హరిబాబు ప్రాణాలు దక్కవని చెప్పడంతో భార్య,  బంధువులు నిర్ఘాంతపోయారు. హరిబాబుకు అసలేం జరిగిందో తెలుసుకునేలోపే అంతా జరిగిపోయింది. ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదని వైద్యులు మళ్లీ చెప్పారు. అవయవ దానం చేసి మరొకరికి ప్రాణం పోయాలన్న వైద్యుల సలహాకు హరిబాబు కుటుంబ సభ్యులు సమ్మతించారు. అప్పటికప్పుడు హరిబాబు గుండె, లివర్, కిడ్నీలు దానం చేశారు. ఆదివారం కన్నుమూసిన హరిబాబు .. చివరకు చిరంజీవిగా మిగిలాడు. హరిబాబు భౌతిక కాయాన్ని త్రోవగుంటలోని ఆయన నివాసం వద్ద ఉంచారు. దేవదాయశాఖ డీఈ శ్రీనివాసరావు, వల్లూరమ్మ దేవస్థానం ఉద్యోగులు వెళ్లి ఘన నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement