కేసీఆర్‌కు చంద్రబాబు ఎలా గురువవుతారు?: హరీష్ రావు
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖరరావుకు చంద్రబాబు ఎలా గురువవుతారు అని టీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రశ్నించారు. పార్టీ ఆవిర్భావ సమయంలో కేసీఆర్ టీడీపీలో ఉండగా, ఆ సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ వ్యక్తిగా ఉన్న విషయాన్ని హరీష్ రావు మీడియాకు వివరించారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబు వ్యక్తి కేసీఆర్‌కు ఎలా గురువవుతారని హరీష్ అన్నారు.
వెన్నుపోటు చరిత్ర చంద్రబాబుదని, ఖాళీలేక టీడీపీ వారిని చేర్చుకోవడం లేదని, ఒకవేళ తాము చేర్చుకోవాలని భావిస్తే తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతుందని హరీష్‌రావు అన్నారు. తెలంగాణలో బీసీని సీఎంను చేస్తానన్న చంద్రబాబు.. అదే విషయాన్ని సీమాంధ్రలో ఎందుకు చెప్పడం లేదని హరీష్ నిలదీశారు. పొత్తుల విషయం కేకే కమిటీ చూసుకుంటుందని, మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఓ ప్రశ్నకు టీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు సమాధానమిచ్చారు.