'గవర్నర్ పెత్తనం' చంద్రబాబు కుట్రే!
మెదక్: హైదరాబాద్ నగర బాధ్యతలను గవర్నర్ నరసింహన్ కు అప్పగించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. హైదరాబాద్ పై గవర్నర్ పెత్తనం అంశం మాత్రం కచ్చితంగా చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుల కుట్ర పూరిత రాజకీయాల్లో భాగమేనని మండిపడ్డారు. ఈ రోజు జిల్లాలోని సంగారెడ్డిలో కుటుంబ సమగ్ర సర్వే సన్నాహక సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. గతంలో రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందంటూ యూపీఏపై భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పడు అదే పనిని ఎందుకు చేస్తున్నారని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఇదిలా ఉండగా హైదరాబాద్లో గవర్నర్ పాలనపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. పునర్విభజన చట్టానికి లోబడే మంత్రివర్గ నిర్ణయాల మేరకే గవర్నర్ కార్యాలయం పని చేస్తుందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. గవర్నర్ అధికారాలు అమలు చేయటం సాధ్యం కాదని రాజీవ్ శర్మ స్పష్టం చేశారు. రాష్ట్రం విషయంలో కేంద్రం జోక్యం తగదని, పూర్తిస్థాయిలో గవర్నర్కు అధికారాలు అప్పగించలేమని ఆయన లేఖలో తెలిపారు. ఇదే విషయంపై రాజీవ్ శర్మ ఈరోజు ఉదయం గవర్నర్ నరసింహన్ను కలిశారు.