టీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎండగడతాం
⇒ రాష్ట్ర ఆవిర్భావం రోజున భారీ బహిరంగ సభ: ఉత్తమ్
⇒ ఈ మూడేళ్ల పాలనలో అంతా అవినీతి, బంధుప్రీతే
⇒ గవర్నర్, చంద్రబాబు, కేసీఆర్‌ల తీరుపై రాష్ట్రపతి వద్దకు వెళతాం
సాక్షి, హైదరాబాద్: మూడేళ్ల టీఆర్‌ఎస్ పాలన అంతా అవినీతి, బంధుప్రీతి, హామీలిచ్చి మోసం చేయడం, ప్రశ్నించే వారిని వేధించడం, ప్రతిపక్షాలపై కుట్రలు, పార్టీ ఫిరాయింపులు, ప్రశ్నిస్తే దబాయించడం వంటివాటితోనే గడిచిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విరుచుకుపడ్డారు. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు భారీ బహిరంగసభ నిర్వహిస్తామని తెలిపారు. మంగళవారం పార్టీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, జి.చిన్నారెడ్డి, మల్లు రవి తదితరులతో కలసి గాంధీభవన్‌లో ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎండగట్టడానికి భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీపీసీసీ ముఖ్యుల సమావేశంలో నిర్ణయించామని.. 2019 ఎన్నికలే లక్ష్యంగా స్పష్టమైన వ్యూహం, కార్యాచరణతో ఐక్యంగా పనిచేయాలని ఏకాభిప్రాయానికి వచ్చామని తెలిపారు. పార్టీలో నాయకుల మధ్య క్రమశిక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.
దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక రూ.2 లక్షల కోట్ల మేర పనులకు టెండర్లు పిలిచారని, అవన్నీ పూర్తిగా అవినీతితో నిండిపోయాయని ఉత్తమ్ దుయ్యబట్టారు. దేశంలోనే టీఆర్‌ఎస్‌ది అత్యంత అవినీతి ప్రభుత్వమని విమర్శించారు. సీఎం కేసీఆర్, వారి కుటుంబసభ్యుల అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళతామన్నారు. పోలీసులతో ప్రతిపక్షాలను వేధింపులకు గురిచేస్తున్నారని, ప్రభుత్వ తీరుకు నిరసనగా జైల్ భరో కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. ధర్నా చౌక్ తరలింపునకు వ్యతిరేకంగా ఆందోళన చేపడతామని.. దానిపై రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజాసంఘాలను ఏకం చేస్తామని తెలిపారు.
ఫిరాయింపులపై నిలదీస్తాం
రాష్ట్రంలో సీఎం కేసీఆర్, ఏపీలో చంద్రబాబు అత్యంత జుగుప్సాకరంగా, అసహ్యకరంగా పార్టీ ఫిరాయింపులకు బరితెగిస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తూ గవర్నర్ కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. గవర్నర్, కేసీఆర్, చంద్రబాబులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని, జాతీయ స్థాయిలో పోరాడతామని ప్రకటించారు. మంత్రులు అవగాహన లేకుండా, నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలపై వీధి పోరాటాలు కూడా చేస్తామన్నారు. ఇక డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో పేదలను సీఎం కేసీఆర్ మోసం చేశాడని ఉత్తమ్ విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అదనంగా మరో గది కట్టిస్తామని ప్రకటించారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోను ఏడాది ముందే ప్రకటిస్తామని చెప్పారు.
కేసీఆర్‌ది అహంకార వైఖరి
నిరుద్యోగుల విషయంలో సీఎం కేసీఆర్ అహంకార పూరితంగా వ్యవహరి స్తున్నాడని ఉత్తమ్ మండిపడ్డారు. జింకల వేటలో మంత్రుల కుమారులు ఉన్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయని, ఆ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన అన్ని అంశాలపై అధ్యయనం చేసి, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై నిర్ణయం తీసుకుంటామని.. ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.