చంద్రబాబు ఆటంకాలు సృష్టిస్తున్నారు: కేసీఆర్
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 11 గంటలకు కేసీఆర్ రాజ్భవన్లో గవర్నర్తో భేటీ అయ్యారు. సుమారు గంటకు పైగా సాగుతున్న ఈ భేటీలో తాజా పరిణామాలపై విస్తృత చర్చ జరుగుతున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఓటుకు కోట్లు కేసు పురోగతి, ఏసీబీ దర్యాప్తుపై కేసీఆర్ ఈ సందర్భంగా గవర్నర్తో చర్చించినట్లు తెలుస్తోంది.
సెక్షన్ -8పై ప్రచారాన్ని కేసీఆర్... గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. అటార్నీ జనరల్ సలహాలపై కథనాలనూ ప్రస్తావించారు. ఏసీబీ కేసుకు, సెక్షన్ -8 కూ ఎలాంటి సంబంధం లేదని గవర్నర్‌కు వివరించారు. చట్టం తన పని తాను చేసుకుపోయేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, అయితే దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటంకాలు సృష్టిస్తున్నారన్న కేసీఆర్ ఈ సందర్భంగా నరసింహన్ దృష్టికి తీసుకు వచ్చారు. తనను కాపాడుకోవడం కోసం సెక్షన్-8పై లేనిపోని ప్రచారం చేస్తున్నారన్న కేసీఆర్.. గత రెండు మూడు వారాలుగా చంద్రబాబు, ఏపీ ప్రభుత్వ తీరుపై గవర్నర్‌కు వివరించారు.
కేసును ఎదుర్కోలేక రెండు రాష్ట్రాల్లో ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారనీ.. ప్రజలను గందరగోళపెట్టేలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారనీ కేసీఆర్... గవర్నర్‌కు చెప్పినట్లు సమాచారం. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా హైదరాబాద్‌లో ఇప్పటివరకూ ఒక్క ఘటనా కూడా జరగలేదన్న విషయాన్ని గవర్నర్‌కు తెలిపిన కేసిఆర్..ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా చూసుకుంటామన్నారు. సెటిలర్స్ అంటూ ఎవ్వరూ లేరనీ.. అందరూ హైదరాబాదీలే అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి అన్నిరకాల ఆధారాలున్నాయన్న కేసీఆర్.. చట్టపరంగా ముందుకు సాగుతామని గవర్నర్‌కు చెప్పారు. కేసుతో ముడిపెట్టి సెక్షన్ 8 ను తెరపైకి తెస్తే.. ఆందోళన తప్పదని కేసీఆర్ స్పష్టం చేసినట్టు సమాచారం.