
చెప్పేవి నీతులు... చేసేవి చీకటి పనులు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై హరీష్‌రావు ధ్వజం
* విద్యుత్, నీటి విషయంలో తెలంగాణకు ద్రోహం
* కేంద్ర మంత్రి పదవి దక్కకుండా అడ్డుకున్నారు
* ఇక్కడకు పరిశ్రమలు రాకుండా చేసేందుకూ యత్నించారు
* ఇలా అన్యాయం చేసి ఇప్పుడు చర్చలకు సిద్ధమంటారా?
సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి అవసరమైతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చిస్తానంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలవరం ఆర్డినెన్స్, పీపీఏల రద్దు సమయంలో ఆయన తెలంగాణ ప్రభుత్వంతో ఎందుకు చర్చలు జరపలేదని ప్రశ్నించారు. బాబు మాటలకు, చేతలకు పొంతన లేదని, ఆయన తీరు.. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి చీకటి పనులు చందంగా ఉందని ధ్వజమెత్తారు.
హరీష్‌రావు గురువారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పోలవరం ముంపు మండలాలను ఆంధ్రలో కలపుతూ ఆర్డినెన్స్ తెప్పించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేస్తూ మాతో చర్చించకుండానే నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలో తెలంగాణకు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నా, దాన్నీ అడ్డుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో చర్చిస్తామనడం, అందితే జుట్టూ లేదంటే కాళ్లు అన్న తరహాలో ఉంది’’ అని విమర్శించారు. గురుకుల్ భూ అక్రమార్కులకు మద్దతిచ్చేలా చంద్రబాబు మాట్లాడటం చూస్తుంటే ఆయన బంధువులు ఈ భూముల్లో ఉన్నారనే అనుమానం కలుగుతోందన్నారు.
హరీష్‌కు అదనంగా గనుల శాఖ
భారీ నీటిపారుద ల మంత్రి టి.హరీష్‌రావుకు అదనంగా భూగర్భ గనుల శాఖను సీఎం కేసీఆర్ అప్పగించారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.