'రైతు సంక్షేమానికి పనిచేస్తున్నాం'
వరంగల్‌సిటీ: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి పనిచేస్తున్నదని మార్కెటింగ్‌శాఖ, భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి శనివారం స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్‌తో కలిసి హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి, ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరందించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మతులు, దేవాదుల ప్రాజెక్టు పూర్తిచేయడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఎస్సారెస్సీ స్టేజీ-1, 2 పనులను కూడా త్వరితగతిన పూర్తిచేస్తామని తెలిపారు. రైతాంగానికి రబీలోనూ 9గంటల నాణ్యతతో కూడిన విద్యుత్ అందిస్తామని తెలిపారు.
ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంపై అక్కసు వెల్లగక్కుతూ ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుపడుతున్నాడని, తెలంగాణలో ఎటూకాకుండా మిగిలిపోయిన తెలుగుదేశం నాయకులు ఇంకా చంద్రబాబుకే వత్తాసు పలుకుతున్నారని అన్నారు. వారి అమాయకత్వానికి జాలిపడాలా, చేతగాని తనానికి సిగ్గుపడాలో అర్ధం కావడం లేదన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ నన్నపనేని నరేందర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, టీ.రాజయ్య, ఎమ్మెల్సీ కొండా మురళి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.