ఐటీ.. తోడ్పాటేదీ!
సాక్షి, విశాఖపట్నం: ‘విశాఖలో ఐటీ రంగం అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయి. కానీ అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఈ రంగం నీరుగారిపోతోంది. పేరుకు ఎస్‌ఈజెడ్‌లు మంజూరు చేసి ఆ తర్వాత చేతులు దులిపేసుకుంటున్నారు. వీటికి కనీస సదుపాయాలు కల్పించడం లేదు. విద్యుత్ సమస్యల కారణంగా ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోతున్నాం. భూములిచ్చిన కంపెనీలకు వాటిపై బ్యాంకు రుణాలు తీసుకునే అవకాశం ఇవ్వడం లేదు. అందువల్ల నిర్మాణాలు చేపట్టలేకపోతున్నాయి. ఇంకేం ఉద్యోగాలొస్తాయి.
మా కంపెనీలో విదేశీ నిపుణులను తీసుకువద్దామనుకుంటే విశాఖలో అత్యున్నతస్థాయి విద్యా వ్యవస్థలు లేవు. దీని వల్ల నిపుణులు విశాఖకు రావడానికి ఇష్టపడడం లేదు. మహిళా ఉద్యోగులకు రా త్రి వేళల్లో భద్రత లేకపోవడంతో ఉద్యోగా లు మానేస్తున్నారు’ అని పలు కంపెనీల యజమానులు గళమెత్తారు. మంగళవారం విశాఖ నగరంలో సీఐఐ ఆధ్వర్యంలో ఐటీశాఖ ఉన్నతాధికారులు, కంపెనీ యాజ మాన్యాల ముఖాముఖీ జరిగింది. ఇందు లో పలువురు ఐటీ యజమానులు సమస్యలపై ఎలుగెత్తారు.
భద్రతలేక మహిళా ఉద్యోగుల రాజీనామా
రుషికొండ హిల్ నంబర్-2లో ఐటీ కంపెనీలకు కనీస భద్రత లేదు. ఇక్కడ వీధి దీపాలు లేవు. మహిళా ఉద్యోగులు రాత్రి వేళ విధులకు రావడానికి భయపడుతున్నారు. చాలా మంది ఉద్యోగం మానేస్తున్నారు. పోలీసు భద్రత ఎక్కడా కనిపించడంలేదు. ఇలా అయితే కంపెనీలు ఎలా నడపాలి?. మరోవైపు కంపెనీకి బ్రాడ్‌బ్యాండ్ సమస్య తీవ్రంగా ఉంది. ఏ నెట్‌వర్క్ కూడా పనిచేయడంలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోతే మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి.
-సతీష్ కనుమూరి, సీఈవో, న్యూనెట్
విదేశీ నిపుణులు విశాఖకు రావడం లేదు
ఐటీ కంపెనీలను విద్యుత్ సమస్య వేధిస్తోంది. జనరేటర్లతో కంపెనీలను నడపడం చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరా గురించి పట్టించుకోవడం లేదు. ఉన్న కంపెనీలను విస్తరించాలంటే అనుమతుల కోసం తిరగాల్సి వస్తోంది. మా కంపెనీలో సీనియర్ నిపుణుల అవసరం ఉండడంతో అమెరికాలో పనిచేస్తున్న ఉత్తరాది ఉద్యోగులను విశాఖకు పిలిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. వారి పిల్లలకు ఇక్కడ సరైన విద్యా వసతుల్లేక రావడానికి ఇష్టపడడంలేదు. ప్రభుత్వం ఐటీ నిపుణుల పిల్లలు, కుటుంబ సభ్యుల కోసం ఇటువంటి సౌకర్యాలు కల్పించాలి.
-మాధురి, మిరాకిల్ కంపెనీ వైస్‌ప్రెసిడెంట్
పరిశ్రమలు పెట్టనివ్వరా!
టీవీ చానల్ లేదా హోటల్ పెడతామంటే ఏపీఐఐసీ నరకం చూపిస్తోంది. అధికారుల చుట్టూ తిరిగితే భూమి మంజూరు చేయడం లేదు. డెయిరీ పెడదామనుకున్నా అదే పరిస్థితి. కేవలం లంచం ఇవ్వనందుకే ఇలా ఇబ్బంది పెడుతున్నారు. పరిశ్రమలు పెట్టాలనుకునే వారిని నిరుత్సాహ పర్చకండి. 500 మందికి ఉద్యోగం కల్పించాలనే నా ఆశయాన్ని అంతా కలిసి నీరుగార్చేశారు.
-వై.వెంకటేశ్వరరావు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త
ప్రభుత్వం సహకరించడం లేదు
విశాఖలో అనేక ఐటీ కంపెనీలు బ్రాడ్‌బ్యాండ్ సమస్య ఎదుర్కొంటున్నాయి. గూగుల్ కంపెనీ తరపున విశాఖలో బ్రాడ్‌బ్యాండ్ సమస్య పరిష్కారానికి మేం చాలా ప్రయత్నించాం. కానీ ప్రభుత్వం నుంచి సరైన మద్దతు దొరకడం లేదు. డీమ్డ్ ఎక్స్‌పోర్ట్స్ స్టేటస్ ఇవ్వాలి. విశాఖలో మాకు సహకరిస్తే ఆ తర్వాత విజయవాడలోనూ ఐటీ రంగానికి మా వంతు సహకారం అందిస్తాం.
-శ్రీనివాస్, గూగుల్ కంపెనీ ప్రతినిధి
పేరుగొప్ప.. ఊరుదిబ్బ
ఐటీ కంపెనీలు సమావేశాలు నిర్వహించుకోవడానికి కనీసం ఇంక్యుబేషన్ సెంటర్ లేదు. కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కలగానే మిగిలింది. ఐటీ కంపెనీలకు ఎగ్జిట్ పాలసీ అమలుచేయాలి. 100 ఎకరాలను జో న్‌గా ఏర్పాటుచేసి చిన్న కంపెనీలకు ఎకరం చొప్పున కార్యాలయాల కు స్థలం మంజూరుచేయాలి. ఐటీ కంపెనీలకు సమీపంలో ఉద్యోగులకు మోడల్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణం చేపడితే వారి సమస్యలు తీరుతాయి. -ఓ.నరేష్‌కుమార్, సింబయాసిస్ టెక్నాలజీస్ సీఈవో