► అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారిన నోటీసులు
► కారాలు నూరుతున్న 25 వేల కాల్వగట్ల నివాసితులు
► విపక్షాల ఆందోళనలతో ‘దేశం’ నేతలు ఉక్కిరిబిక్కిరి
సాక్షి, విజయవాడ : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు.. కాల్వగట్ల ఆధునీకరణ, సుందరీకరణ పేరుతో ఇరిగేషన్, నగరపాలక సంస్థ అధికారులు కాల్వగట్లవాసులకు నోటీసులివ్వడం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల నగరంలో పర్యటించి కాల్వగట్లను సుందరీకరించాలంటూ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరిగేషన్ అధికారులు బుడమేరు మధ్య కట్ట, రైవస్ కెనాల్, బందరు కాల్వలకు రెండువైపులా నివాసముంటున్నవారి గుడిసెలు తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేశారు.
గుణదల, పటమట, రామవరప్పాడు, బుడమేరు కట్టపై ఉంటున్న కొంతమంది పేదలకు నోటీసులివ్వడంతో ప్రజలు, విపక్షాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలు ఇళ్లు తొలగిస్తే సహించేది లేదని, వారికి అండగా నిలబడతామని వైసీపీ, వామపక్షాల నేతలంటున్నారు. ఇరిగేషన్ మంత్రి సొంత జిల్లాలోనే పేదలకు రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
గద్దె, వంశీ, బొండాలకు సెగ..
జిల్లాలో 25 వేలు, నగరంలో 10 వేల కుటుంబాలు కాల్వగట్లపై పూరిగుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నాయి. సుమారు నలభై ఏళ్లుగా అలా నివసిస్తున్నవారిని తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేయడంతో కంగుతిన్న పేదలు ఎమ్మెల్యేను నిలదీస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీమోహన్, బొండా ఉమామహేశ్వరరావులకు ఈ సెగ బాగా తగులుతోంది. తమను ఇళ్లు ఖాళీ చేసి పొమ్మంటే ఎక్కడికి పోతామని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇరిగేషన్ మంత్రికి తెలియకుండానే తమకు నోటీసులిచ్చారా.. అని ప్రశ్నిస్తున్నారు. దీంతో పేదల ఇళ్లు తొలగించకుండా చూస్తామంటూ ప్రజాప్రతినిధులు హామీలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. వంశీమోహన్ కలెక్టర్‌ను కలిసి పేదలకు ప్రత్యామ్నాయం చూపించిన తరువాత ఇళ్లు తొలగించాలంటూ కోరాల్సి వచ్చింది. మంత్రి దేవినేని ఉమాపై ఒత్తిడి తెచ్చి నోటీసులు నిలుపుదల చేయించేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
రే పథకం ఏమైంది...?
రాజీవ్ ఆవాస్ యోజన కింద కాల్వగట్లపై పేదల ఇళ్లను తొలగించి అక్కడే బహుళ అంతస్తుల సముదాయాలను నిర్మించి ఇవ్వాలని గతంలో ప్రణాళికలు సిద్ధం చేశారు. వాటిని అమలు చేయాలని పేదలు కోరుతున్నారు.
ఇరిగేషన్ స్థలాల్లో పలు భవనాలు
♦ పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద అగ్నిమాపక శాఖ రాష్ట్ర కార్యాలయాన్ని చంద్రబాబు ప్రారంభించారు.
♦ బందరు రోడ్డులో నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజుకు పాత కెనాల్ గెస్ట్‌హౌస్ స్థలాన్ని లీజుకు ఇవ్వడంతో బహుళ అంతస్తుల సముదాయాలు నిర్మించారు.
♦ అమెరికన్ హాస్పిటల్ వద్ద కళాశాలలు, ఇంకా అనేక భవనాలున్నాయి.
♦ కాల్వకట్టల సుందరీకరణ, ఆధునీకరణకు ఈ భవనాలు అడ్డురానప్పుడు చిరు వ్యాపారుల దుకాణాలు, పేదల నివాసాలే అడ్డు వస్తాయా.. అని జనం నిలదీస్తున్నారు. తొలుత ఆయా భవనాలను తొలగించిన తర్వాతే పేదల జోలికి వెళ్లాలని విపక్షాల నేతలు చెబుతున్నారు.
వారికి పొగ...వీరికి సెగ
Published Fri, Apr 24 2015 3:44 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement