
‘హెల్త్ స్కీమ్’ సేవలపై వీడిన సందిగ్ధం
ఆషా ప్రతినిధులతో మంత్రి కామినేని చర్చలు
విజయవాడ: ఉద్యోగులకు నగదు రహిత సేవల విషయంలో 4 నెలలుగా నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. మెడికల్ ఇల్‌నెస్ కేసులకు సంబంధించి ప్యాకేజీతో నిమిత్తం లేకుండా.. ఖర్చు మొత్తం చెల్లించడంతో పాటు కొన్ని అభ్యంతరకరమైన ప్యాకేజీలను సడలించేందుకు 3 నెలల్లో చర్యలు తీసుకుంటానని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆషా(ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్) ప్రతినిధులకు హామీ ఇచ్చారు. దీంతో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్‌ఎస్)పై సేవలు అందించేందుకు ఆస్పత్రి యాజమాన్యాలు సుముఖత వ్యక్తం చేశాయి.
ఈహెచ్‌ఎస్ సేవలపై చర్చించేందుకు ఆషా ప్రతినిధులు డాక్టర్ పి.వి. రమణమూర్తి, డాక్టర్ పి.రమేష్‌బాబు, డాక్టర్ విశ్వేశ్వరరావు, డాక్టర్ మొవ్వ పద్మ ఆదివారం విజయవాడలో మంత్రితో సమావేశమయ్యారు. ఈహెచ్‌ఎస్ సేవలందించేందుకు తమ అభ్యంతరాలను తెలియజేశారు. మెడికల్ ఇల్‌నెస్ సేవలను ముందుగా నిర్ణయించిన ప్యాకేజీతో చేయలేమని, కొన్ని ప్యాకేజీలు తక్కువగా ఉండడంతో ఆస్పత్రులు ముందుకు రాని విషయాన్ని తేల్చి చెప్పారు. కాగా, ఉద్యోగ సంఘాలతో ఈ నెల 25న చర్చించడంతోపాటు 26న ఆషా ప్రతినిధులను సీఎం వద్దకు తీసుకెళ్లి చర్చించనున్నట్టు కామినేని శ్రీనివాస్ విలేకరులకు తెలిపారు. ఆషా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు.