ఆపరేషన్ చేస్తున్న వైద్యులు (ఫైల్)
సాక్షి, గుంటూరు: నిరు పేదలకు అందించే వైద్య సేవలపై నిర్లక్ష్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు జీజీహెచ్‌లో గతంలో గుండె ఆపరేషన్లు జరిగేవీ కావు. 2015 మార్చి 18వ తేదీ నుంచి సహృదయ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలేతో కూడిన వైద్యుల బృందం పీపీపీ పద్ధతిలో గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. జీజీహెచ్‌లో గత మూడేళ్లలో 500 మందికి పైగా నిరుపేదలకు బైపాస్ సర్జరీలు చేశారు. వీటితో పాటు నలుగురు నిరుపేద హృద్రోగులకు రూ.20 లక్షల వరకు ఖర్చయ్యే గుండె మార్పిడి ఆపరేషన్లు సైతం జీజీహెచ్‌లో ఉచితంగా చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. అయితే డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే చేస్తున్న కృషికి, ఆయన పడుతున్న కష్టానికి సహకారం అందించాల్సిన ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దాతల సహాయంతో ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్న డాక్టర్ గోఖలే కనీసం గుండె మార్పిడి ఆపరేషన్‌లకైనా ప్రభుత్వం సహకరించాలని పలు మార్లు విన్నవించారు.
2016లో జీజీహెచ్‌కు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య సైతం గుండె మార్పిడి ఆపరేషన్లను ఆరోగ్యశ్రీలో చేరుస్తామంటూ ప్రకటించారు. ఆ తరువాత కొద్ది నెలలకే జీవో కూడా ఇచ్చారు. 2016 మే 20వ తేదీన దాతల సహకారంతో ఏడు కొండలు అనే నిరుపేద రోగికి గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఈ ఆపరేషన్ జరిగి రెండేళ్లు దాటినా ప్రభుత్వం ఇంత వరకు ప్యాకేజీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరం. దేశంలో అతి తక్కువ కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాత్రమే నిర్వహించే గుండెమార్పిడి ఆపరేషన్‌ను గుంటూరు జీజీహెచ్‌లో ఉచితంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం మాత్రం అందుకు తగ్గ సహకారం అందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి వీరికి మరింత ప్రోత్సాహం అందిస్తే జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు మరిన్ని నిర్వహించేందుకు డాక్టర్ గోఖలే బృందం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటాల కోసం పెట్టే ఖర్చు వీరికి వినియోగిస్తే మరికొన్ని నిరుపేద ప్రాణాలు నిలబెట్టే అవకాశం దక్కుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గుండె మార్పిడి ఆపరేషన్లు జరిగిన ప్రతిసారీ మంత్రులు, ముఖ్యమంత్రి శాలువాలు కప్పి అభినందిస్తూ, తమ ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయనే బిల్డప్ ఇవ్వడం మినహా సహకారం అందించడం లేదు.
ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోకు లేఖ
ఆపరేషన్లకు నిధులు మంజూరు చేయాలంటూ 2016 అక్టోబర్ 12వ తేదీన ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోకు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు లేఖ కూడా రాశారు. 2015 మార్చి నుంచి పీపీపీ పద్ధతిలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సహృదయ హెల్త్ మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో 240కు పైగా గుండె ఆపరేషన్లు విజయవంతంగా చేశామని పేర్కొన్నారు. 2016 అక్టోబర్ 4న బి.హీరామతిబాయి అనే మహిళకు గుండె మార్పిడి ఆపరేషన్‌తో పాటు అత్యవసర వైద్యం అందిస్తున్నామని నిధులు వెంటనే మంజూరు చేయించాలని డాక్టర్ రాజునాయుడు ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవోకు రాసిన లేఖలో విన్నవించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం గుండె మార్పిడి ఆపరేషన్లకు నిధులు మంజూరు చేసి నిరుపేదలకు సహకారం అందించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment