పైసా విదల్చని ప్రభుత్వం | Heat kaikaluru risk to the independence standards | Sakshi
Sakshi News home page

పైసా విదల్చని ప్రభుత్వం

Published Mon, Jul 7 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM

పైసా విదల్చని ప్రభుత్వం

పైసా విదల్చని ప్రభుత్వం

కైకలూరు సంత మార్కెట్‌లో జరిగిన స్టౌ ప్రమాద బాధితులు పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. ఎనిమిది నెలలు గడుస్తున్నా సాయం అందక పోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

  • కైకలూరులో స్టౌ ప్రమాద బాధితుల ఆక్రందన
  •  ఎనిమిది నెలలు గడుస్తున్న అందని పరిహారం
  •  ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు
  • కైకలూరు : కైకలూరు సంత మార్కెట్‌లో జరిగిన స్టౌ ప్రమాద బాధితులు పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. ఎనిమిది నెలలు గడుస్తున్నా సాయం అందక పోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. గతేడాది నవంబరు 12న మార్కెట్‌లో బజ్జీల బండి వద్ద స్టౌ పేలింది. కాగుతున్న నూనె 10 మందిపై పడింది.

    ఈ ఘటనలో కైకలూరుకు చెందిన తోట పోతురాజు (65), అడపా సుబ్బలక్ష్మి (33), ఖాదర్ బాషా (26), ఆగొల్లు శిరీషా కుమారి (19), కైకలూరు మండలం పల్లెవాడకు యాళ్ళ ఎలీషారావు (19), మండవల్లి మండలం దెయ్యంపాడుకు చెందిన కంభంపాటి మేరి సరోజిని (58), భైరవపట్నానికి చెందిన నత్తల వాణిశ్రీ (50), కలిదిండి మండల పేట కలిదిండికి చెందిన లింగం నాగమణి (50), పశ్చిమగోదావరి జిల్లా కోమటిలంకకు చెందిన పెనుగొండ సలోమి (17), ఇదే జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి చెందిన బురగ తేరేజమ్మ (45)లు గాయపడ్డారు.

    వీరంతా విజయవాడలోని పలు ప్రైవేటు ఆస్పత్రిలలో చికిత్స పొందారు. వారం రోజులు మృత్యువుతో పోరాడి నవంబరు 19న కైకలూరుకు చెందిన బజ్జిల బండి యజమాని తోట పోతురాజు, అడపా సుబ్బలక్ష్మి, కంభంపాటి మేరి సరోజిని, గురజ తేరేజమ్మలు మరణించారు. కోమటిలంకకు చెందిన పెనుగొండ సలోమి 47 రోజులు మృత్యువుతో పోరాటం చేసి నవంబరు 29న కన్నుమూసింది. ఇందులో ఖాదర్‌బాషా, ఆగొల్లు శిరీషాకుమారి, నత్తల వాణిశ్రీ, యాళ్ళ ఎలిషారావు, లింగం నాగమణిలు క్షతగాత్రులుగా మిగిలారు.
     
    గొల్లుమంటున్న ఆగోల్లు శిరీషా తల్లిదండ్రులు
     
    స్టౌ ప్రమాదంలో ఆగొల్లు శిరీషాకు 50 శాతం శరీరం కాలింది. ఆమె స్థానిక వైవీఎన్నార్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ చదివింది. కుమారీ టాకీస్ వద్ద ఓ సెల్ దుకాణంలో పని చేస్తోంది. మార్కెట్ సమీపంలోని ఇంటి వద్ద భోజనం చేసి తిరిగి దుకాణానికి వెళుతుండగా ప్రమాదబారిన పడింది. విజయవాడలో 6 నెలలుగా ఓ చర్చిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మంచంపై కదలకుండా ఉండటంతో కొద్దిరోజుల కిందట కుడికాలు బిగిసుకుపోయింది. ఆగొల్లు శ్రీనివాసరావు, సీతామహాలక్ష్మి దంపతులకు ఇద్దరు ఆడ, ఇద్దరు మగ సంతానం. శిరిషా రెండో కుమార్తె. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం వారిది. ఇప్పటి వరకు వైద్యం నిమిత్తం రూ. లక్షా 50 వేలు ఖర్చు అయ్యిందని,ప్రభుత్వం ఆదుకోవాలని శ్రీనివాసరావు కోరారు.
     
    మృతురాలు అడపా సుబ్బలక్ష్మి భర్త సుబ్బారావు 2004 మృతిచెందాడు. వీరికి నాగలక్ష్మి (16), మణికంఠస్వామి (20), భవాని (14) పిల్లలు. ప్రమాదం జరిగిన రోజున టౌన్‌హాలులో రచ్చబండ కార్యక్రమానికి సుబ్బలక్ష్మి వచ్చింది.  

    ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు హామీ

    రైతు పరామర్శ యాత్రలో భాగంగా ప్రతిపక్ష నేత హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవంబరు 26న కైకలూరు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం ఆధికారంలో ఉంటే మృతులకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షలు పరిహారం అందించేవారిమని, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రూ. 2లక్షలైనా అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ నుంచి మృతులకు రూ. 10 వేలు, క్షతగాత్రులకు రూ. 5వేలు అందించారు.

    క్షతగాత్రులకు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు రూ. 5వేలు చొప్పున అంతకు ముందు అందించారు. ప్రమాదం జరిగినప్పుడు మృతులకు అపద్బంధు పథకం కింద నష్టపరిహారం వచ్చే విధంగా అధికారులు నివేదికలు పంపారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నగదు వచ్చే ఏర్పాట్లు చేస్తామని స్థానిక నాయకులు వాగ్దానాలు చేశారు. ఇప్పటి వరకు బాధితులకు సాయం అందలేదు. సీఎం చంద్రబాబు ఆదుకోవాలని బాదితులు కోరుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement