సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్టు/తాడేపల్లి రూరల్: పశ్చిమ కనుమల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటం.. ప్రధాన ఉప నది తుంగభద్ర ఉరకలెత్తుతుండటంతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. దీంతో శ్రీశైలం జలాశయంలోకి గురువారం సాయంత్రం ఆరు గంటలకు 6.68 లక్షల క్యూసెక్కులు ప్రవాహం చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతలకు 30 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పది గేట్లు 24 అడుగుల మేర ఎత్తి రెండు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 5.95 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో సాగర్‌లోకి 5.77 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. కుడి, ఎడమ కాలువలకు 18 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే, సాగర్ 26 గేట్లు ఎత్తి 5.87 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 6.38 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది.
ఇక్కడకు ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో దానిని నియంత్రిస్తూ నదీ తీర ప్రాంత ప్రజలను ముంపు బారిన పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా.. ప్రకాశం బ్యారేజీలోకి 4.80 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. నదీ ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఒకటో ప్రమాద హెచ్చరికను అధికారులు ఎగురవేశారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 5.12 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. గురువారం రాత్రికి ఆరు లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ప్రవాహం 5.66 లక్షలకు చేరితే రెండో ప్రమాద హెచ్చరికను జారీచేస్తారు. మొత్తం మీద ఈ సీజన్‌లో గురువారం ఉదయం ఆరు గంటల వరకూ ప్రకాశం బ్యారేజీ నుంచి 604.68 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి.
ప్రమాదకరంగా ప్రకాశం బ్యారేజీ గేట్లు..
బ్యారేజికి గత 75 రోజుల నుంచి తరచూ వరదలు వస్తుండడంతో గేట్లలో లోపాలు బయటపడుతున్నాయి. గురువారం 5లక్షల క్యూసెక్కుల పైచిలుకు వరద రావడంతో సీతానగరం వైపు ఉన్న అండర్ స్లూయిస్ గేట్ల మీద నుంచి నీళ్లు పొర్లాయి. ఈ ఒత్తిడికి అండర్ స్లూయిస్ గేట్లలో 7వ గేటు వద్ద చెయిన్ లింక్ తప్పి నీళ్లలో వేలాడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment