కరుణిస్తున్న వరుణుడు
పొంగిన వాగులు
నర్సీపట్నం-కేడీపేట రోడ్డులో నిలిచిపోయిన వాహనాలు
స్తంభించిన జనజీవనం
విశాఖపట్నం/గొలుగొండ: జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జనజీవనం స్తంభించింది. గొలగొండ మండలంలో సోమవారం ఉదయం నుంచి సాయత్రం వరకు వర్షం కురవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జోగుంపేట నుంచి చిట్టింపాడు వెళ్లే మార్గంతో ఉన్న బోరింగ్ గెడ్డ పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కేడీపేట- నర్సీపట్నం మార్గంలో జోగుంపేట వద్ద గెడ్డలు పొంగడంతో వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. రాత్రి 6.30 గంటలైన గెడ్డ ఉధృతి తగ్గలేదు. వందలాది ఎకరాల్లో వరి పంటలు నీట మునిగాయి.
దారగెడ్డ, బొడ్డేరు పొంగడంతో తాండవ జలాశయంకు భారీగా వరద నీరు చేరుతోంది. వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. జోగంపేట, గొలుగొండ, చిన్నయ్యపాలెం, పాతమల్లంపేట, కేడీపేట ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. వ ర్షంతో పాటు గాలులు వీయడంతో కొత్తమల్లంపేట ప్రాంతంలో సుమారుగా 50 ఎకరాలలో చెరకు పంట నేలకొరిగింది. మెరక ప్రాంతాల్లోని కూరగాయలు, కంది, పత్తి, పెసర పంటలకు తీవ్ర నష్టం కలిగించింది.