శ్రీకాకుళం సిటీ : జిల్లాలో గురువారం నుంచి హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ జిల్లాస్థాయి ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు రవాణాశాఖతోపాటు పలు శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేశారు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడితే వెయ్యి రూపాయలు జరిమానా విధించే అవకాశం ఉంది. హెల్మెట్ వాడకం అమలుపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు గతంలోనే ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అంతగా అమలుకు నోచుకోలేదు. అయినప్పటికీ ప్రమాదాల స్థాయి అధికంగా ఉండడంతో పోలీసు, రెవెన్యూ అధికారులు హెల్మెట్ వాడక ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వచ్చారు.
తొలుత జాతీయ రహదారులపై ప్రయాణించేవారు హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అన్ని మండలాల్లో పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకూ అన్ని తరగతుల విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లాలో ఏటా అనేక మంది హెల్మెట్ లేకపోవడంతో ప్రయాణ సమయాల్లో ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతుండగా.. మరికొందరు క్షతగాత్రులు అవుతున్నారు. జిల్లాలో 2.32 లక్షల ద్విచక్ర వాహనదారులు, 2.84 లక్షల మంది నాలుగు టైర్ల వాహనదారులు ఉన్నారు.
ఈ పరిస్థితిలో ద్విచక్ర వాహనదారులంతా హెల్మెట్ వాడకం తప్పనిసరి చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే నాలుగు టైర్ల వాహనదారులు సైతం సీట్‌బెల్ట్ పెట్టుకోవడాన్ని తప్పనిసరి చేశారు. జాతీయ రహదారి అయినా, గ్రామాలైనా ప్రమాదాల తీరుతెన్నులు ఒకేలా ఉన్నాయని చెబుతున్న ఆయా శాఖల అధికారులు సురక్షిత ప్రయాణానికి హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి అంటూ హితబోధ చేస్తున్నారు. హెల్మెట్ ధరించని పక్షంలో రూ.వెయ్యి జరిమానాను విధిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు మైనర్లు వాహనాన్ని నడిపితే వారితోపాటు వారి తల్లిదండ్రులపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
నేటి నుంచి హెల్మెట్ తప్పనిసరి!
Published Thu, Jun 1 2017 1:36 AM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM
Advertisement