
గోరంత సాయం.. కొండంత ప్రచారమా!
రైతులు, మహిళల కుటుంబాల్లో చీకట్లు నింపి చంద్రబాబు మాత్రం సంక్రాంత్రి చేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆరోపించారు. వర్షాలు లేక, పంటలు పండక రైతులు కష్టాల్లో ఉంటే ఆయనకు మాత్రం పండుగ వెలుగులు కావాల్సి వచ్చాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పుణ్యమా అని రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారన్నారు.
సంక్రాంతి వెలుగులు కేవలం తెలుగు తమ్ముళ్లు, టీడీపీ నేతలకేనని.. ప్రజలు మాత్రం అష్టకష్టాలు పడుతున్నారని ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రన్న కానుక పేరుతో గోరంత సాయం చేస్తూ కొండంత ప్రచారం చేసుకుంటున్నారన్నారు. బ్రహ్మానందం సినిమాల్లో కామెడీ చేస్తుంటే..చంద్రబాబు ప్రజలను కామెడీ చేస్తున్నారని తెలిపారు. చంద్రన్న కానుక పేరుతో రూ. 60 నుంచి రూ.70 కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. దీనిపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేసే అధికారం టీడీపీ నేతలకు ఎవరిచ్చారన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంటే ప్రభుత్వం ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెడుతోందని మోహన్ రెడ్డి విమర్శించారు.