=ఎస్సీ రిజర్వుడు
=గ్రామంలో వారెవరూ లేనందునే...
=ఓసీ.బీసీలకు కేటాయించాలని గ్రామస్తుల డిమాండ్
కంచికచర్ల రూరల్, న్యూస్‌లైన్ : మండల పరిధిలోని పెండ్యాల గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. గతంలో ఈ గ్రామ పంచాయతీ సర్పంచి పదవిని ఎస్సీలకు కేటాయించారు. గ్రామంలో ఎస్సీలు లేకపోవడంతో ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. అంతేకాకుండా వార్డు సభ్యులకు సైతం ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో గతంలో ఇక్కడ పంచాయతీ ఎన్నికలు నిలిచిపోయిన సంగతి విదితమే. అయినప్పటికీ అధికారులు ఈ గ్రామ సర్పంచి పదవిని తిరిగి ఎస్సీలకే కేటాయిస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం సర్వత్రా విమర్శలకు గురవుతుంది.
గతంలో నోటిఫికేషన్ జారీ అయిన సమయంలో ఈ గ్రామంలో ఎస్సీలు ఎవరూ నివాసం ఉండటంలేదని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఎస్సీలు ఎవరూ లేనందున ఓసీలకుగానీ, బీసీలకుగానీ కేటాయించాలని గ్రామస్తులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో గ్రామనౌకర్లు, రేషన్ డీలరు సైతం గ్రామంలో ఉండకుండా పక్కనే ఉన్న కీసర గ్రామంలో నివాసముంటున్నారని అప్పుడే అధికారులకు తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ముందు తయారు చేసిన ఓటర్ల జాబితాలో 10 మంది ఎస్సీ ఓటర్లున్నారు.
వారిలో గ్రామ నౌకర్లు వారి కుటుంబ సభ్యుల ఓట్లు నాలుగు, ప్రభుత్వ వసతి గృహంలో పనిచేస్తున్న ముగ్గురి ఓట్లు, రేషన్ డీలరు కుటుంబానికి సంబంధించి రెండు ఓట్లు, వీఆర్వో ఓటుతో కలిపి మొత్తం 10 మందికి చెందిన ఎస్సీల పేర్లు ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్నాయి. వీరిలో ఎవరూ గ్రామంలో నివాసముండటం లేదని గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు 2013 జూలై 5న గ్రామంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి రిపోర్టు ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది.
ఈ మేరకు మండల రెవెన్యూ అధికారులు గ్రామంలో పూర్తిస్థాయిలో విచారణచేసి గ్రామంలో వీఆర్వో(ఉద్యోగరీత్యా) మినహా మిగిలిన ఎస్సీలు ఎవరూ ఉండటం లేదని, ఓటర్ల జాబితాలో నుంచి 9 మంది పేర్లను తొలగిస్తున్నట్లు తహశీల్దార్ జీ విక్టర్‌బాబు 2013 ఆగస్టు 4న ప్రకటించారు. గ్రామంలో వీఆర్వో మినహా ఓటర్ల జాబితాలో ఎస్సీలు ఎవరూలేనప్పటికీ తిరిగి సర్పంచి పదవిని ఎస్సీలకు కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు ఇవ్వడం పలు విమర్శలకు తావిస్తుందని గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ షేక్ అన్వర్, మాజీ సర్పంచులు అబ్దుల్ కరీం, షేక్ ఖాజాబాషా, షేక్ జోర్‌ఖాన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ గ్రామానికి జరుగనున్న పంచాయతీ ఎన్నికలు మరోసారి నిలిచిపోనున్నాయని తెలుస్తోంది.
ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు....
పెండ్యాల గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికకు ఈ సారీ ఒక్క నామినేషన్ రాలేదని ఎన్నికల అధికారి టీ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. మూడు నుంచి ఆరో తేదీ వరకు నామినేషన్ గడువు ఉందని ఎస్సీ జనరల్ అభ్యర్థులు నామినేషన్ వేసుకోవచ్చని ఆయన చెప్పారు.
పెండ్యాల సర్పంచి ఎన్నికకు మళ్లీ గండం!
Published Sat, Jan 4 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM
Advertisement
Advertisement