నితిన్‌ను ప్రశ్నిస్తున్న స్థానాచార్యుడు రాజగోపాల్
గుండె జారి గల్లంతయ్యేలా చేసే చాకులాంటి ఈ కుర్రాడుహీరోయిజంతో అమ్మాయిల దిల్ దోచాడేమో కానీ.. ఉంగరం దొంగిలిస్తాడా? అందునా అప్పన్న దర్శనానికి వచ్చి స్వామిఅంగుళీయకాన్నే కొట్టేస్తాడా? మనకు డౌటే కానీ.. అదే జరిగిందంటున్నారు ఆలయంలో అయ్యవార్లు. అందుకే ‘ఛల్ మోహనరంగా’ అంటూ వచ్చిన హీరో నితిన్‌ను తాళ్లతో కట్టి మరీ నిలదీశారు. స్వామి ఉంగరం ఎక్కడంటూ గద్దించారు. ఆదివారం ఉదయం సింహాచలం ఆలయంలో జరిగిన ఆ ‘దొంగాట’ కథా కమామిషు..
సింహాచలం(పెందుర్తి): ‘ఏమండీ.. చాలా సినిమాల్లో హీరోగా నటించి పేరు తెచ్చుకున్నారు.. పైగా బాగా స్థితిమంతులు. అలాటి మీరు స్వామి వారి ఉంగరాన్ని చోరీ చేశారంటే నమ్మశక్యం కాకుండా ఉంది. మర్యాదగా ఇచ్చేయండి.’ ఇదీ ప్రముఖ నటుడు నితిన్‌కు ఆదివారం సింహగిరిపై ఎదురైన ప్రశ్నల వర్షం. ఆలయ సందర్శనకు వచ్చినప్పుడు ఎదురైన అనుభవం. స్వామి దర్శనానికి వచ్చిన నితిన్‌కు అలయ అలంకారి కరి సీతారామాచార్యులు ఎదురై ఒకమాటైనా మాట్లాడకుండా తాళ్లతో బంధించారు. తర్వాత స్థానాచార్యుడు టి.పి.రాజగోపాల్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన నితిన్‌పై ఎడాపెడా ప్రశ్నలు సంధించారు. దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయమన్నారు. ‘నేను తియ్యలేదండి కావాలంటే చెక్ చేసుకోండి’ అని నితిన్ బదులిచ్చారు. ‘శనివారం రాత్రి స్వామివారి ఉంగరం పోయింది. చోరులెవరో కనిపెట్టే పనిలో ఉన్నాం. మాకు ఉంగరం దొరికే వరకు మీరు బందీలుగా ఉండాల్సిందే.’ అని స్థానాచార్యుడు హుకుం జారీ చేశారు.
నితిన్‌కు ఇదేం అనుభవం? అని విస్మయపడుతున్నారా? మరేం లేదు.. ఇది సింహగిరిపై జరిగిన వరాహ లక్ష్మీనృసింహస్వామివారి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆదివారం ఉదయం జరిగిన వినోదోత్సవంలో చోటుచేసుకున్న ఘట్టం. ఏటా ఏడు రోజులపాటు జరిగే కల్యాణోత్సవాల్లో భాగంగా ఆరో రోజు రాత్రి దొంగలదోపు ఉత్సవం నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఉభయ దేవేరులతో విహారయాత్రకు వెళ్లిన స్వామివారి ఉంగరం కనిపించకపోవడంతో ఆయనకు అదో సమస్య అవుతుంది. ఉంగరం ఉంటేనే రావాలని అమ్మవారు అలుగుతుంది. దీంతో స్వామి మర్నాడు ఉదయం ఉంగరాన్ని వెతుక్కునే పనిలో పడతారు. తన తరపు దూతగా వైదికుల్లో ఒకరిని నియోగించి.. భక్తులను తాళ్లతో బంధించి తీసుకొచ్చి ప్రశ్నింపజేస్తారు. అలా పలువురు భక్తులు ఉంగరం దొంగలనే అభియోగాన్ని ఎదుర్కొంటారు. చివరికి ఎక్కడా ఉంగరం దొరక్కపోయేసరికి.. స్వామికి ఆచ్ఛాదనగా ఉండే పరదాలలో అన్వేషించగా, చివరి పరదాలో ఉంగరం లభిస్తుంది. ఆద్యంతం రక్తికట్టే ఈ వేడుకను వినోదోత్సవంగా అభివర్ణిస్తారు. సింహగిరిపై ఆదివారం వినోదోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవం జరుగుతున్నప్పుడే హీరో నితిన్ స్వామివారి దర్శనానికి సింహగిరికి వచ్చారు. అప్పుడు ఆయన్ని తాళ్లతో బంధించి ప్రశ్నించారు.
కన్నీళ్లు.. గొడవలు
నితిన్‌ను మాత్రమే కాక.. చాలామంది భక్తులను కూడా అలంకారి కరి సీతారామాచార్యులు బంధించగా.. స్థానాచార్యుడు రాజగోపాల్ కఠినంగా ప్రశ్నించారు. విషయం తెలిసిన భక్తులకు ఇది వినోదంగా ఉండగా.. చాలామంది భక్తులు ఏమీ తెలియక బెంబేలెత్తిపోయారు. స్వామివారి ఉంగరాన్ని తాము తీశామన్న అభియోగం ఎదుర్కోవడంతో వారు కలవరపడ్డారు. ‘స్వామి దర్శనానికి వస్తే దొంగలంటారేమిటండీ.. మేం దొంగల్లా కనిపిస్తున్నామా?’ అని కొందరు గర్జించారు. కొంతమంది వలవలా ఏడ్చేశారు. మరికొందరు స్థానాచార్యులతో వాగ్వాదానికి దిగారు. ఇదంతా చూస్తూ నవ్వుతున్న వారిపై చిర్రుబుర్రుల్లాడారు. చివరికిది వినోదోత్సవం అని తెలుసుకుని స్వామి తమకు కల్పించిన మహాభాగ్యమని ఆనందోత్సాహాలతో వెనుదిరిగారు. ఇలా విజయవాడకు చెందిన అనూష, విశాఖలో డిగ్రీ చదువుతున్న ఖర్గపూర్ వాస్తవ్యులు వందన, పింకీ, వినీత కన్నీరు పెట్టుకున్నారు. శ్రీకాకుళానికి చెందిన తండ్రీకొడుకులు అప్పారావు, ప్రసాద్, విశాఖ విద్యార్ధినులు కావ్య, ప్రమీల స్థానాచార్యులతో వాదులాడారు. విశాఖలో గుర్రంపాలేనికి చెందిన అమిత్, అలేఖ్య, గోపాలపట్నానికి చెందిన నూతన దంపతులు రవి, ఆకాంక్ష ‘దొంగలు’గా చిక్కారు. గీతం కళాశాల బిటెక్ విద్యార్ధినులు మౌనిక, నివేదిత, స్వప్న, శ్రీకాకుళం రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌లో పనిచేస్తున్న మోహన్, మణి దంపతులు తదితరులు ఉంగరం దొంగలుగా పట్టుబడ్డారు. ఆలయ కొత్వాల్ నాయక్, ఏఈవో ఆర్.వి.ఎస్.ప్రసాద్, పీఆర్‌వో జైమునిలనూ బంధించారు. చివరికి స్థానాచార్యులు, హవల్దార్ కూడా దొంగలుగా చిక్కారు.
Comments
Please login to add a commentAdd a comment