న్యూఢిల్లీ: కోర్టు భవనాలు, న్యాయమూర్తులు, అధికారులు, సిబ్బందికి క్వార్టర్లు తదితర అవసరమైన వసతులన్నీ సిద్ధమైన తర్వాతే ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు జరుగుతుందని న్యాయశాఖ సహాయమంత్రి పీపీ చౌదరి స్పష్టం చేశారు. శుక్రవారం రాజ్యసభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. హైదరాబాద్లోని హైకోర్టు జ్యూడికేచర్‌తో సంప్రదించి ఈ వసతులన్నీ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని ఆయన తెలిపారు.
ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కోసం అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం...హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ఏపీ సీఎంని కోరినట్లు మంత్రి వెల్లడించారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం ప్రస్తుతం హైదరాబాద్‌లోని హైకోర్టు విచారణలో ఉన్నట్లు చెప్పారు.
‘ఆంధ్రప్రదేశ్ విజభన చట్టం ప్రకారం ఏపీలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏపీలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసిన పిమ్మట ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వెళ్లిపోతుంది. అప్పటివరకూ హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా పని చేస్తుంటుందని’ మంత్రి వివరించారు.
కేంద్రం పరిశీలనలో విశాఖ ఐటీఐఆర్
విశాఖపట్నంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్టిమెంట్ రీజియన్‌ను ఏర్పాటు చేయావలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 26, 2014లో తమకు ప్రతిపాదనలు పంపిందని రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి చౌదరి తెలిపారు. విశాఖలో ఐటీఐఆర్ ఏర్పాటు చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
అన్ని సిద్ధమయ్యాకే ఏపీకి ప్రత్యేక హైకోర్టు
Published Fri, Aug 11 2017 3:11 PM | Last Updated on Thu, Aug 9 2018 2:49 PM
Advertisement
Advertisement