కౌంటర్ దాఖలుకు సీబీఐకి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసుకు సంబంధించి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో జరుగుతున్న విచారణలో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. సీబీఐ కౌంటర్‌ను పరిశీలించిన తరువాతనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్టీ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఓఎంసీ కేసులో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వై.శ్రీలక్ష్మి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్టీ విచారించారు. శ్రీలక్ష్మి తరఫున సీనియర్ న్యాయవాది ఆర్.బసంత్ వాదనలు వినిపించారు. దీనికి సీబీఐ తరఫు న్యాయవాది పి.కేశవరావు సమాధానమిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, 6 వారాల గడువు కావాలన్నారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను వాయిదా వేశారు.