
హై ఫీవర్!
పక్కనున్న గణాంకాలు జిల్లా వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖల పనితీరును ప్రశ్నిస్తున్నాయి.
జిల్లాలో పది రోజుల్లో నమోదైన జ్వరం కేసులు 11,501
వారం రోజుల్లో రుయాలో నిర్ధారణ అయిన డెంగీ కేసులు 174
తొమ్మిది రోజులుగా వేలూరు సీఎంసీలో డెంగీతో చికిత్స పొందుతున్నవారు 157
ఆరు నెలల్లో ఇదే జ్వరంతో మృతి చెందిన వారి సంఖ్య 37
జనవరి నుంచి ఈనెల 20 వరకు డెంగీతో మృతి చెందిన వారి సంఖ్య 19 (అధికారికంగా)
ఈ ఒక్క నెలలో జిల్లాలో డెంగీతో మృతి చెందిన వారి సంఖ్య 18 (అనధికారికంగా)
పక్కనున్న గణాంకాలు జిల్లా వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖల పనితీరును ప్రశ్నిస్తున్నాయి. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. జ్వరాల బారిన పడకుండా ప్రజల్ని అప్రమత్తం చేయడంలో వైద్యశాఖ అధికారులు, సిబ్బంది వైఫల్యానికి
నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
చిత్తూరు అర్బన్: జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా రెండు వారాలుగా జ్వరం ఊపేస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రుల్లో రోజుకు సగటున 1,100 జ్వరం కేసులు నమోదవుతుండడం ప్రమాద ఘంటికల్ని సూచిస్తున్నాయి. ఇళ్లల్లో నీటిని నిల్వ చేసుకోవడం వల్ల దోమలు వృద్ధి చెంది.. మనుషుల్ని కుట్టడంతోనే విష జ్వరాలు వస్తున్నట్లు అధికారులు తేల్చేశారు. కానీ గ్రామాల్లో క్షేత్ర స్థాయికి వెళ్లి చూస్తే పారిశుద్ధ్య పనుల లోపం, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం, ప్రజలకు అవగాహన కల్పించకపోవడం లాంటి సమస్యలే ప్రధానంగా కనిపిస్తున్నాయి.
తీరు మారని ఆరోగ్య శాఖ
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కింద 3 వేల మందికి పైగా అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వీరందర్నీ సమన్వయం చేసుకుంటూ ఉన్నతాధికారులు రోజూ ఏదో గ్రామాన్ని వెళ్లి సందర్శించడం ద్వారా అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. కానీ జిల్లాలో క్షేత్ర స్థాయికి వెళ్లి ప్రజల్ని పరిశీలించే అధికారుల్ని వేళ్లపై లెక్కించవచ్చు. నిత్యం కలెక్టర్‌ను దర్శనం చేసుకుని... అవసరం లేకున్నా ఆయన వెంట పరుగులు తీయడానికే ఇక్కడున్న కొందరు అధికారులు ప్రాముఖ్యత ఇస్తున్నారన్నది బహిరంగ రహస్యం. పని ఉంటే తప్ప తన వద్దకు రావొద్దని పలుమార్లు కలెక్టర్.. వైద్యశాఖ అధికారుల్ని హెచ్చరించినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. ఇటీవల వర్షాలు పడడం, జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో పారిశుద్ధ్యం లోపించి జనం జ్వరాల బారిన పడుతున్నారు. దీనికి తోడు పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు అంతంతమాత్రంగా జరుగుతుండడం, ప్రతి గ్రామానికీ వైద్యఆరోగ్యశాఖ నుంచి కేటాయించే నిధులను బ్యాంకు ఖాతాల్లోనే ఉంచుకోవడం ప్రజల ప్రాణాలపైకి వచ్చింది. ఇప్పటికైనా వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీ అధికారులు మొద్దు నిద్ర వదలి ప్రజారోగ్యంపై దృష్టి సారించి, సమన్వయంతో ముందుకెళ్లి ప్రజల్లో మనోధైర్యం నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పసికందు మృతి
చిత్తూరు (అర్బన్): డెంగీ జ్వరంతో ఏడు నెలల పసికందు బుధవారం మృతి చెందాడు. యాదమరి మండలం సామిరెడ్డిపల్లెకు చెందిన జయరాజ్ కూలి పనిచేస్తున్నాడు. ఇతని ఏడు నెలల మగబిడ్డ వారం రోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. పిల్లాడికి డెంగీ లక్షణాలు ఉ న్నాయని, చిత్తూరుకి తీసుకెళ్లాలని వైద్యులు సూ చించారు. బుధవారం చిత్తూరు ప్రభుత్వా స్పత్రికి తీసుకొచ్చారు. అయితే పసికందు మృతి చెందా డు. తల్లిదండ్రులు ఆస్పత్రి వద్దే విలపించారు.
ప్రజలకు అవగాహన కల్పించండి
చిత్తూరు (అర్బన్) : డెంగీ జ్వరంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లాలోని ఆరోగ్యశాఖాధికారులను డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ కోటీశ్వరి ఆదేశించారు. బుధవారం స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆమె డెంగీ జ్వరంపై వైద్యాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కోటీశ్వరి మాట్లాడుతూ డెంగీ జ్వరంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించాలన్నారు. డెంగీ జ్వరాన్ని వ్యాప్తిజేసే దోమ ల్వారా ఎలా ఉంటుందో ప్రదర్శన ద్వారా ప్రజల ఇళ్లల్లోని నిల్వ నీటిలోని లార్వాలను సీసాలో పట్టి, చూపించి వివరించాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిత్తూరు, మదనపల్లె, శ్రీకాళహస్తి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాటు కే.వీ.ఎస్.లక్ష్మి, డెమో ఇన్‌చార్జ్ రఘురామ్, డెప్యూటీ డెమో కళావతి, హెచ్‌ఈలు పాల్గొన్నారు.