
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్దే తమ ప్రభుత్వం ధ్యేయం అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అమరావతి రైతులకు మరింత లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం వైఎస్ జగన్ సూచనలు చేశారని బొత్స వెల్లడించారు. మూడు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాలు చర్చిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో హైపవర్ కమిటీ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై చర్చించేందుకు ఏర్పాటైన హైపవర్ కమిటీ శుక్రవారం సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జీఎన్ రావు, బీసీజీ నివేదికలపై.. హైపవర్ కమిటీ సభ్యులు సీఎం వైఎస్ జగన్‌కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రైతుల అంశంపైనా సీఎం వైఎస్ జగన్‌తో చర్చించినట్టు తెలిపారు. కమిటీ రిపోర్ట్‌లోని అంశాలను కూడా సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సమగ్ర ప్రణాళికలతో రాష్ట్ర అభివృద్ధిపై ప్రజల మనోభావాల మేరకు ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ప్రాంతీయ అసమానతలపై దృష్టి సారించినట్టు వివరించారు. కమిటీ రిపోర్ట్‌ను కేబినెట్ ముందు ఉంచుతామని తెలిపారు. కేబినెట్ భేటీలో అన్ని విషయాలను సీఎంకు చెబుతామని అన్నారు. అన్నివర్గాలు బాగుపడాలన్నదే తమ తాపత్రయమని చెప్పారు.అమరావతి రైతులు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాయలో పడొద్దని సూచించారు.
వ్యక్తిగత స్వార్థంతో చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి రైతులెవరూ అధైర్య పడొద్దన్నారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలన్నీ పూర్తిచేస్తామని చెప్పారు. అమరావతిలో నిర్మించిన అన్ని భవనాలను ఉపయోగించుకుంటామని తెలిపారు. అమరావతిపై చంద్రబాబు అఖిలపక్షం అభిప్రాయం కోరలేదని గుర్తుచేశారు. 13 జిల్లాలతోపాటు అమరావతి ప్రాంతాలు అభివృద్ధి చేస్తామన్నారు. ఉనికి కాపాడుకోవడం కోసమే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.