
మనకూ బుల్లెట్ రైల్
భారతీయుల కల సాకారం చేస్తాం
రైల్వే బడ్జెట్‌లో కేంద్రం ప్రకటన
► ముంబై-అహ్మదాబాద్ సెక్టార్‌లో అమలు
► దాదాపు రూ. 60 వేల కోట్ల ఖర్చు!
► 9 రూట్లలో హైస్పీడ్ రైల్ కారిడార్
► రైళ్ల వేగం గంటకు 160-200 కిలోమీటర్ల వరకు పెంపు
న్యూఢిల్లీ: దేశంలో తొలిసారిగా బుల్లెట్ రైలును పరుగులు పెట్టిం చేందుకు ఎన్డీయే సర్కారు సంకల్పించింది. ముందుగా ముంబై-అహ్మదాబాద్ కారిడార్‌లో దాదాపు రూ. 60వేల కోట్లతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు తన తొలి రైల్వే బడ్జెట్‌లో ప్రకటించింది. అంతేకాదు, అన్ని మెట్రోలు, ప్రధాన నగరాలను కలుపుతూ హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్(వజ్ర చతుర్భుజి నెట్‌వర్క్)ను నిర్మించాలని కూడా బృహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. మంగళవారం పార్లమెంట్‌లో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా రైల్వే మంత్రి సదానంద గౌడ ఈ వివరాలు వెల్లడించారు. ఈ కారిడార్ విషయంలో తదుపరి చర్యలు చేపట్టేందుకు వీలుగా రూ. వంద కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో బుల్లెట్ రైలు పరుగులు తీయాలన్న భారతీయులందరి చిరకాల వాంఛను నెరవేర్చే దిశగా భారతీయ రైల్వేలు అడుగులేస్తున్నాయని ఆయన లోక్‌సభలో వ్యాఖ్యానిం చారు. ఎంపిక చేసిన సెక్టార్లలో రైళ్ల వేగాన్ని గంటకు 200 కిలోమీటర్లకు పెంచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. వీటిలో ఢిల్లీ-ఆగ్రా, ఢిల్లీ-చండీగఢ్, ముంబై-అహ్మదాబాద్ రూట్లు ఉన్నాయి. అలాగే ఢిల్లీ-కాన్పూర్, నాగ్‌పూర్-బిలాస్‌పూర్, మైసూర్-బెంగళూరు, చెన్నై, ముంబై-గోవా, చెన్నై-హైదరాబాద్, నాగ్‌పూర్-సికింద్రాబాద్ సెక్టార్లలో రైళ్ల వేగాన్ని గంటకు 160 నుంచి 200 కిలోమీటర్ల వరకు పెంచనున్నట్లు రైల్వే మంత్రి వెల్లడించారు. ఇందుకోసం ప్రస్తుత నెట్‌వర్క్‌ను ఆధునీకరించాల్సి ఉంటుందని, అలాగే బుల్లెట్ రైలు కోసం సరికొత్త మౌ లిక వసతులు అవసరమని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
58 కొత్త రైళ్లొస్తున్నాయ్!
న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం తొలి రైల్వే బడ్జెట్ 58 కొత్త రైళ్లను మోసుకొచ్చింది. మంగళవారం రైల్వేమంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 58 కొత్త రైళ్లను ప్రతిపాదించారు. వీటిలో ఐదు జణ్ సాధారణ రైళ్లతోపాటు మరో ఐదు ప్రీమియం రైళ్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఆరు ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 27 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 8 ప్యాసింజర్ రైళ్లు, రెండు మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్(మెమూ) సర్వీసులు, 5 డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (డెమూ) సర్వీసులు ఉన్నాయి. అలాగే మరో 11 ైరె ళ్ల గమ్యస్థానాలను పొడిగించారు. అలాగే కేదార్‌నాథ్, బద్రీనాథ్ వంటి చార్‌ధామ్ పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఓ కొత్త లైన్‌తో సహా 18 లైన్ల సర్వేను చేపట్టనున్నట్టు మంత్రి వెల్లడించారు. జైపూర్ -కోట, చందన ఫోర్ట్-నాగ్‌భిర్, మంగళూర్-ఉల్లాల్-సూరత్‌కల్, రేవారి-మహేందర్‌గఢ్‌ల మధ్య డబ్లింగ్ కోసం సర్వేలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
జన్ సాధారణ్ రైళ్లు.. 5
1.. అహ్మదాబాద్-దర్భంగా (వయా సూరత్), 2. జైనగర్-ముంబై, 3. ముంబై-గోరఖ్‌పూర్, 4. సహర్సా-ఆనందవిహార్ (వయా మోతీహారీ), 5. సహర్సా-అమృత్‌సర్
ప్రీమియం రైళ్లు.. 5
1. ముంబై సెంట్రల్-న్యూఢిల్లీ (ఏసీ), 2. షాలిమార్-చెన్నై (ఏసీ), 3. సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ (ఏసీ), 4. జైపూర్-మదురై, 5. కామాఖ్య-బెంగళూరు
ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. 6
1. విజయవాడ-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (రోజూ), 2. లోకమాన్యతిలక్ టెర్మినల్(ముంబై)-లక్నో (వారానికోరోజు), 3. నాగపూర్-పుణే (వారానికోరోజు), 4. నాగపూర్-అమృత్‌సర్ (వారానికోరోజు), 5. నహర్‌లాగూన్-న్యూఢిల్లీ (వారానికోరోజు), 6. నిజాముద్దీన్-పుణే (వారానికోరోజు)
ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. 27
1. అహ్మదాబాద్-పాట్నా (వారానికోరోజు), 2. అహ్మదాబాద్-చెన్నై (వారానికి 2 రోజులు), 3. బెంగళూరు-మంగళూరు (రోజూ), 4. బెంగళూరు-షిమోగా (వారానికి 2 రోజులు), 5. బాంద్రా-జైపూర్ (వారానికోరోజు), 6. బీదర్-ముంబై (వారానికోరోజు), 7. ఛాప్రా-లక్నో (వారానికి మూడురోజులు), 8. ఫిరోజ్‌పూర్-చండీగఢ్ (వారానికి 6 రోజులు), 9. గౌహతి-నహర్‌లాగూన్ (రోజూ), 10. గౌహతి-ముర్‌కాంగ్‌సెలెక్ (రోజూ), 11. గోరఖ్‌పూర్-ఆనందవిహార్ (వారానికోరోజు), 12. హాపా-బిలాస్‌పూర్ (వారానికోరోజు), 13. హుజూర్‌సాహెబ్ నాందేడ్-బికనీర్ (వారానికోరోజు), 14. ఇండోర్-జమ్మూతావి (వారానికోరోజు), 15. కామాఖ్య-కత్రా (వారానికోరోజు), 16. కాన్పూర్-జమ్మూతావి (వారానికి రెండురోజులు), 17. లోకమాన్యతిలక్ టెర్మినల్ ముంబై-ఆజంగఢ్ ((వారానికోరోజు), 18. ముంబై-కాజీపేట (వారానికోరోజు) వయా బలార్షా, 19. ముంబై-పాటియాలా (వారానికోరోజు), 20. న్యూఢిల్లీ-భటిండా శతాబ్ది (వారానికోరోజు), 21. న్యూఢిల్లీ-వారణాసి (రోజూ), 22. పారాదీప్-హౌరా (వారానికోరోజు), 23. పారాదీప్-విశాఖపట్నం (వారానికోరోజు), 24. రాజ్‌కోట్-రేవా (వారానికోరోజు), 25. రామ్‌నగర్-ఆగ్రా (వారానికోరోజు), 26. టాటానగర్-బయ్యప్పనహళ్లి బెంగళూరు (వారానికోరోజు), 27. విశాఖపట్నం-చెన్నై (వారానికోరోజు)
ప్యాసింజర్ రైళ్లు (రోజూ).. 8
1. బికనీర్-రేవారీ , 2. ధార్వాడ్-దండేలీ, 3. గోరఖ్‌పూర్-నౌతాన్వా, 4. గౌహతి-మెందీపత్తర్, 5. హాతియా-రూర్కెలా, 6. బిందూర్-కాసరగోద్, 7. రంగపారా నార్త్-రంగియా, 8. యశ్వంత్‌పూర్-తుంకూర్
మెమూ రైళ్లు.. 2
1. బెంగళూరు-రామనగరం (వారానికి ఆరురోజులు),
2. పల్వాల్-ఢిల్లీ-అలీగఢ్
డెమూ రైళ్లు.. 5
1. బెంగళూరు-నీల్‌మంగళ (రోజూ), 2. ఛాప్రా-మాండ్వాదీ (వారానికి ఆరురోజులు), 3. బారాముల్లా-బనిహాల్ (రోజూ), 4. సంబల్‌పూర్-రూర్కెలా (వారానికి ఆరురోజులు), 5. యశ్వంత్‌పూర్-హోసూర్ (వారానికి ఆరురోజులు)
పాలు, పళ్లు, కూరగాయలకోసం ప్రత్యేక రైళ్లు
న్యూఢిల్లీ: ఆహారపదార్థాల రవాణాకు ప్రత్యేక రైళ్లను నడపాలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆకాశాన్నంటుతున్న ధరలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా పాల రవాణాకు మిల్క్ ట్యాంకర్లు, కూరగాయలు, పళ్ల రవాణాకు ప్రత్యేక సదుపాయాలు కల్పిం చాలని భావిస్తున్నట్లు సదానంద గౌడ తెలిపారు. ఆయన మంగళవారం పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతూ... దేశంలోని పది ప్రాంతాల్లో సెంట్రల్ రైల్‌సైడ్ వేర్‌హౌస్ కార్పొరేషన్ (సీఆర్‌డబ్యూసీ) భాగస్వామ్యంతో పళ్లు, కూరగాయల రవాణాకు శీతలీకరణ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. తొలి దశలో వాత్వా, విశాఖపట్నం, బడగర, చెరియనాడ్, భివాండీ రోడ్, అజారా, నవ్‌లూర్, కాలంబోలి, సనంద్‌లలో ఈ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. అక్కడినుంచి పంపిణీని సీఆర్‌డబ్ల్యూసీ పర్యవేక్షిస్తుందన్నారు. దీనివల్ల కూరగాయలు వృథాకాకుండా నివారించడంతోపాటు రైతులకు సరసమైన ధరలు లభిస్తాయని తెలిపారు. జాతీయ పాల అభివృద్ధి సంస్థ, అమూల్ సంస్థతో కలిసి పాల రవాణాకు ప్రత్యేక ట్యాంకర్లను నడుపుతామన్నారు. పళ్లు, కూరగాయలు, తృణధాన్యాల ధరల పెరుగుదల వల్ల మే నెలలో ద్రవ్యోల్బణం 6.01కు చేరినట్లు తెలిపారు. ధరల నియంత్రణకోసం బీజేపీ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని చెప్పారు.
రూ.11,790 కోట్ల రుణాల సేకరణ
న్యూఢిల్లీ: రైల్వేశాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15)లో పెట్టుబడి వ్యయం కోసం రూ.11,790 కోట్ల మేరకు మార్కెట్ రుణాలను సేకరించనుంది. తన కంపెనీలైన ఇండియన్ రైల్వే స్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ), రైల్వేస్ వికాస్ నిగం లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) ద్వారా ఈ రుణాలు చేయనుంది. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో ఈ మొత్తా న్ని రూ.13,800 కోట్లుగా పేర్కొనడం తెలిసిందే. అయితే అంతర్గత వనరులను పెంపొందించుకుంటున్నందున ఆ మేర రుణాలను తగ్గించుకోవాలని ప్రతిపాదించినట్టు మంత్రి తెలి పారు. తాజా ప్రణాళికను అనుసరించి.. గూడ్స్ వ్యాగన్లు, ప్రా జెక్టుల్లో పెట్టుబడుల కోసం ఐఆర్‌ఎఫ్‌సీ ద్వారా రూ.11,500 కోట్ల రుణాలను సేకరిస్తారు. ఆర్‌వీఎన్‌ఎల్ ద్వారా రూ.290 కోట్లను, పీపీపీ రూపేణా రూ.6,005 కోట్లను సమీకరిస్తారు.
యాత్రా స్పెషల్స్
న్యూఢిల్లీ: దేశీయ టూరిజాన్ని అభివృద్ధి పరిచే లక్ష్యంతో ప్రముఖ తీర్థయాత్రా స్థలాలను కలుపుతూ పలు టూరిస్టు రైళ్లను నడుపుతామని రైల్వే మంత్రి ప్రకటించారు. ఇప్పటికే దేవీ సర్క్యూట్, జ్యోతిర్లింగ సర్క్యూట్, జైన్ సర్క్యూట్ లాంటి వాటిని రైల్వే శాఖ గుర్తించిందన్నారు. వీటితోబాటు క్రిస్టియన్, ముస్లిం/సుఫి, సిక్, బుద్ధిస్ట్ సర్క్యూట్‌లే కాకుండా ప్రఖ్యాత ఆలయాల సర్క్యూట్లలలో కూడా రైళ్లు ప్రవేశపెడతామన్నారు. ఈశాన్య ప్రాంతాల్లో ఎకో-టూరిజం, ఎడ్యుకేషన్ టూరిజం కూడా చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలోని యాత్రా స్థలాలను కలుపుతూ గడగ్, పండరీపూర్ మధ్య.. రామేశ్వరం నుంచి చెన్నై, బెంగళూరు, అయోధ్య, వారణాసిల మీదుగా హరిద్వార్ వరకూ మరో టూరిస్టు రైలు నడుపుతామన్నారు.
మహిళా భద్రతకు భరోసా
న్యూఢిల్లీ: రైళ్లలో అన్ని తరగతుల బోగీల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, వారికి ప్రత్యేక సూచనలు కూడా చేస్తున్నామని రైల్వే మంత్రి సదానంద గౌడ తెలిపారు. వారి భద్రతకు మరిన్ని అదనపు చర్యలు కూడా తీసుకుంటామన్నారు. స్టేషన్లలో భద్రత పెంచేందుకు 1,700 మంది రైల్వే భద్రతా దళ (ఆర్పీఫ్) కానిస్టేబుళ్లను రిక్రూట్ చేసుకున్నామని, త్వరలోనే వారిని విధుల్లోకి పంపుతామని చెప్పారు. మరో 4,000 మంది మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను నియమించాలని ప్రతిపాదించామని, వీరిని మహిళల బోగీలకు రక్షణగా పంపుతామని పేర్కొన్నారు. రైళ్లకు రక్షణ గా వెళ్లే ఆర్పీఎఫ్ సిబ్బందికి మొబైల్ ఫోన్లు అందజేస్తామని, ప్రయాణికులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని సంప్రదించవచ్చని అన్నారు. భద్రతకు సంబంధించిన హెల్ప్‌లైన్‌ను విస్తరిస్తామని, స్టేషన్ల చుట్టూ ప్రహరీల నిర్మాణాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టేందుకు మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు.
రైల్వే వర్సిటీ ఏర్పాటుపై పరిశీలన
న్యూఢిల్లీ: రైల్వేలకు సంబంధించిన అంశాల అధ్యయనం లక్ష్యంగా రైల్వే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సాంకేతిక పరిజ్ఞాన అంశాలు, సాంకేతికేతర అంశాల అధ్యయనంకోసం ఈ వర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించింది. సిబ్బందిలో నైపుణ్యాల మెరుగుదలకోసం ప్రణాళికలు రూపొందించినట్టు బడ్జెట్ సమర్పణ సందర్బంగా రైల్వే మంత్రి చెప్పారు. రైల్వేలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పాఠ్యాంశాలను గ్రాడ్యుయేషన్ స్థాయిలో ప్రవేశపెట్టేందుకు సాంకేతిక విద్యా సంస్థలతో రైల్వేశాఖ అవగాహన కుదుర్చుకుంటుందన్నారు. కింది స్థాయి సిబ్బందిచేత స్వల్పకాలిక కోర్సులను అధ్యయనం చేయిస్తామన్నారు. హై స్పీడ్, భారీ స్థాయి సరుకు రవాణా తదితర కార్యకలాపాలపై సిబ్బందికి, అధికారులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు.
తగ్గిన ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు
న్యూఢిల్లీ: అధిక ఆదాయం కోసం ఎయిర్ కండీషన్డ్ బోగీల ప్రయాణి కులపై కన్నేసిన రైల్వేకు చేదువార్త. గత ఏడాదితో పోలిస్తే ఏసీ మొదటి తరగతి, ఏసీ త్రీటైర్ ప్రయాణికుల సంఖ్య తగ్గింది. ఏసీ ఫస్ట్‌క్లాస్‌లో 33.1 లక్షల ప్రయాణించగా, 2013-14 లో 26.1 లక్షల మంది మాత్రమే వెళ్లారు. 2012-13లో ఏసీ త్రీటైర్ బోగీల్లో 7 కోట్ల మందికిపైగా ప్రయాణించగా, 2013-14లో 6.87 కోట్ల మంది ప్రయాణించారు. అయితే ఏసీ చైర్‌కార్ తరగతి ప్రయాణికుల సంఖ్య మాత్రం కాస్త పెరిగింది. ఈ తరగతిలో గత ఏడాది 2.21 కోట్ల మంది వెళ్లగా 2013-14లో 2.51 కోట్ల మంది వెళ్లారు. ఏసీ స్లీపర్(ఏసీ టూటైర్) ప్రయాణికుల సంఖ్య కూడా 2.23 కోట్ల నుంచి 2.25 కోట్లకు పెరిగింది. తాజా బడ్జెట్ ప్రకారం.. ఏడాది ఏసీ ఫస్ట్‌క్లాస్‌లో 38.6 లక్షల మంది ప్రయాణిస్తారని ప్రభుత్వ అంచనా.
బుల్లి.. బుల్లి రైళ్లు...
టాయ్ ట్రైన్లు అంటే.. బొమ్మ రైళ్లనుకునేరు. ప్రముఖ చారిత్రక రైల్వే లైన్లపై నడిచే చిన్న రైళ్లే.. టాయ్ ట్రైన్లు. ప్రధానంగా పర్వత ప్రాంతాల మీదుగా సాగే ఈ రైళ్లు చాలా నెమ్మదిగా నడుస్తాయి. గమ్యస్థానాలు చేరడానికి దాదాపు ఎనిమిది గంటలసమయం కూడా పడుతుంటుంది. అయినప్పటికీ ప్రయాణం మాత్రం ఎందో ఆహ్లాదకరంగా ఉంటుంది. కారణం.. వీటిలో బోగీలు మామూలు రైళ్ల మాదిరిగా కాకుండా.. రెండువైపులా కొండకోనల అందాలను తిలకించడానికి, పిల్లగాలులను ఆస్వాదించడానికి వీలుగా ఉంటాయి. వీటిలో ప్రముఖమైనవి..
డార్జిలింగ్ హిమాలయన్ రైలు
తూర్పు హిమాలయాల నుంచి డార్జిలింగ్‌లోని తేయాకు తోటల వరకు ప్రయాణిస్తుంది. 1881లో మొదలైన ఈ రైలే.. భారత్‌లో మొట్టమొదటి టాయ్ ట్రైను.
కల్కా-సిమ్లా రైలు
బ్రిటిష్ పాలకులు 1903లో తమ వేసవి రాజధాని సిమ్లాకు వెళ్లడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 100 సొరంగ మార్గాలు, దేవదార్ అడవులు, పర్వత ప్రాంతాల మీదుగా ఈ ప్రయాణం సాగుతుంది.
మాథేరన్ రైలు
1907లో దీన్ని ప్రారంభించారు. సైకిళ్లు సహా వాహనాలకు ప్రవేశం లేని మాథేరన్ (మహారాష్ట్ర) కొండ ప్రాంతాల్లో పచ్చని అందాల నడుమ ప్రయాణిస్తుంది. కొండపైకి వెళ్లడానికి దాదాపు 2.30 గంటల సమయం పడుతుంది.
ఊటీ నీలగిరి రైలు
తమిళనాడులోని ఊటీ సోయగాలతో మనల్ని పరవశింపజేస్తూ సాగుతుంది ఈ రైల్లో ప్రయాణం. ఇది 1899లో ప్రారంభమైంది. భారత్‌లో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఇది. గంటకు 10 కిలోమీటర్లు మాత్రమే వెళుతుంది.
కంగర వ్యాలీ రైలు
ఇది పంజాబ్‌లోని పఠాన్‌కోట్ నుంచి సుందరమైన జోగీందర్ నగర్ లోయ వరకు నడుస్తుంది. హిమాలయా ఉప ప్రాంతాల్లో 163 కిలోమీటర్ల పాటు సాగుతుంది దీని ప్రయాణం. 1929లో దీన్ని ప్రారంభించారు.
రైల్వే బడ్జెట్‌లో ముఖ్యాంశాలు
♦ 2014-15లో రూ.1,64,374 కోట్ల ఆదాయం అంచనా. ఖర్చును రూ.1,49,176 కోట్లకు కుదించారు.
♦ గతంలో లేనంత ఎక్కువగా రూ.65,455 కోట్ల ప్రణాళికా వ్యయం.
♦ మొత్తం 58 కొత్త రైళ్లు. వీటిలో ఐదు జన్ సందర్శన్, ఐదు ప్రీమియం, ఆరు ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నారుు. 11 రైళ్ల పొడగింపు.
♦ {పయూణికుల చార్జీలను, సరుకు రవాణా చార్జీలను పెంచలేదు.
♦ త్వరలో హైస్పీడ్ నెట్‌వర్క్‌తో పాటు పట్టాల పైకి బుల్లెట్ రైళ్లు.
♦ ముంబరుు-అహ్మదాబాద్ సెక్టార్‌లో బుల్లెట్ రైలు.
♦ హైస్పీడ్ రైళ్ల కోసం వజ్ర చతుర్భుజి. ఈ ప్రాజెక్టు కోసం రూ.9 వేల కోట్లు అవసరం. రూ.100 కోట్ల కేటారుుంపు.
♦ తొమ్మిది సెక్టార్లలోని ఎంపిక చేసిన మార్గాల్లో రైళ్ల స్పీడ్‌ను గంటకు 160 నుంచి 200 కిలోమీటర్లకు పెంచే యోచన.
♦ ఆన్‌లైన్‌లో ఫ్లాట్‌ఫామ్‌తో పాటు అన్ రిజర్వ్‌డ్ టికెట్లు. స్టేషన్ల వద్ద పార్కింగ్‌కు, ప్లాట్‌ఫామ్‌కు కలిపి కోంబో టికెట్లు
♦ అన్ని స్టేషన్లలో ప్రయూణికుల విశ్రాంతి గది సౌకర్యం. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రధాన స్టేషన్లలో బ్యాటరీతో నడిచే కార్లు. రైలు సమయంపై ప్రయూణికులను అప్రమత్తం చేసేందుకు ఎస్మెమ్మెస్.
♦ భద్రత పెంపు కోసం 17 వేల మంది ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల భర్తీ. మహిళల బోగీల్లో భద్రత కోసం 4 వేల మంది మహిళా కానిస్టేబుళ్ల నియూమకం. రైళ్లలోని ఆర్పీఎఫ్ బృందాలకు మొబైల్ ఫోన్లు.
♦ {పధాన రైళ్లు, సబర్బన్ బోగీలకు తలుపులు ఆటోమేటిక్‌గా మూసుకునే వ్యవస్థ ఏర్పాటు
♦ సాంకేతిక, సాంకేతికేతర సబ్జెక్టులకు రైల్ విశ్వవిద్యాలయం.
♦ విమానాశ్రయూన్ని తలపించేలా, అలాంటి అనుభూతిని కలిగించేలా అంతర్జాతీయ స్థారుుకి టాప్ 10 స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ.
♦ స్టేషన్ల నిర్వహణకు మూల నిధి ఏర్పాటు. స్టేషన్లు, రైళ్లలో ఆర్వో తాగునీరు. ప్రధాన స్టేషన్లకు సౌర విద్యుత్ సౌకర్యం.
♦ రైలు ప్రయూణికులకు మరింత మెరుగైన ఆహారం. ప్రముఖ కంపెనీలకు చెందిన వండి తినడానికి సిద్ధంగా ఉన్న భోజనం అందజేత. నాణ్యత లోపిస్తే సంబంధితులపై చర్యలు. ఐవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్.
♦ శుభ్రత కోసం ఉద్దేశించిన బడ్జెట్ 40% పెంపు. స్టేషన్లలో శుభ్రతను పర్యవేక్షించేందుకు సీసీటీవీల వినియోగం. మూడో పార్టీ
♦ రిజర్వేషన్ విధానం పునర్వ్యవస్థీకరణ. మొబైల్ ఫోన్లు, పోస్ట్ ఆఫీసుల ద్వారా టికెట్ బుకింగ్‌కు మరింత ప్రచారం.
♦ ఇ-టికెటింగ్ విధానంలో నిమిషానికి 7,200 టికెట్ల జారీ. ఏకకాలంలో 1,20,000 మంది ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం. ప్రస్తుతం నిమిషానికి 2 వేల టికెట్లే జారీ.
♦ కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో ఆఫీస్ ఆన్ వీల్స్, వై-ఫై, వర్క్ స్టేషన్ సదుపాయూలు.
♦ ఒక్కో ప్రయూణికుడిపై ఒక కిలోమీటర్‌కు వాటిల్లుతున్న నష్టం 10 పైసల (2000-01) నుంచి 23 పైసలకు (2012-13) పెరుగుదల.
♦ సంపాదించిన రూపారుులో 94 పైసల ఖర్చు. కేవలం 6 పైసలే మిగులు. ప్రస్తుత ప్రాజెక్టుల కోసం వచ్చే పదేళ్లలో రూ.5 లక్షల కోట్లు అవసర ం. ఐదేళ్లలో కాగితాలు లేని రైల్వే కార్యాలయూలు.
♦ స్వామి వివేకానంద బోధనల కోసం ప్రత్యేక రైలు
ఆఫీస్ ఆన్ వీల్స్
రైళ్లలో ప్రయాణించే వాణిజ్యవేత్తల సౌకర్యార్థం ‘ఆఫీస్ ఆన్ వీల్స్’ పేరుతో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు రైల్వే మంత్రి సదానంద గౌడ వెల్లడించారు. ఎంపిక చేసిన కొన్ని రైళ్లలో వర్క్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తామనీ, వీటిని వినియోగించుకునే వారు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందనీ చెప్పారు. అన్ని ఏ1, ఏ తరగతి స్టేషన్లతో పాటు కొన్ని రైళ్లలో వైఫై సేవలను అందుబాటులోకి తెస్తామని వివరించారు.