మళ్లీ హైజాక్ ముఠా!
- రహదారుల్లో డ్రైవర్లను మట్టుపెట్టే గ్యాంగ్
- ఇటీవల కొందరు జైలు నుంచి విడుదల
పలమనేరు : జాతీయ రహదారుల్లో లారీలను హైజాక్ చేసి డ్రైవర్లను అత్యంత క్రూరంగా మట్టుపెట్టే గ్యాంగ్ మళ్లీ జిల్లాలో సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యనే నెల్లూరు జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. గతంలో లారీ ైెహ జాక్‌లకు పాల్పడే నరహంతక ముఠాలోని కీలక సభ్యులు ప్రస్తుతం పలు జైళ్లలో ఉన్నారు. కొందరు ఆరునెలల క్రితం విడుదలయ్యారు. వీరు కొత్త గ్యాంగ్‌లా ఏర్పడి మళ్లీ ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎనిమిది నెలల క్రితం తమిళనాడులోని శూలగిరిలో లారీని హైజాక్ చేసి తీసుకెళ్లి ఇద్దరు డ్రైవర్లను హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో పలమనేరుతో ప్రమేయమున్న ఈ నర హంతకుల విషయం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే ఈ గ్యాంగ్ 12 మందికి పైగా డ్రైవర్లను హత్యచేసి పలు లారీలను
దోచుకెళ్లారు.
కరుడుగట్టిన నేరస్తులు: లారీల హైజాక్ గ్యాంగ్‌లో సుమారు 18 మంది సభ్యులున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరు పలమనేరు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారు. మిగిలిన వారు కర్ణాటక, తమిళనాడులకు చెందిన వారు. వీరిలో ముఖ్యమైన వ్యక్తి గుండుగల్లు శ్రీరాములు (58). ఇతనిపై మూడు రాష్ట్రాల్లో పలు కేసులున్నాయి. ఈ గ్యాంగ్ కోట్లాది రూపాయల విలువైన కాపర్ లారీలనే టార్గెట్ చేసి ఆ డ్రైవర్లను హత్య చేసి లారీలు, సరుకును తీసుకెళ్తుంది.
ఇప్పటికే 12 మందికి పైగా డ్రైవర్ల హతం: ఈ ముఠా తమిళనాడు, కర్ణాటకతో పాటు మన జిల్లాలోని ములకలచెరువు, పీటీఎం, శ్రీనివాసపురం తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఘాతుకాలకు పాల్పడ్డారు. ప్రయాణికుల్లా లారీలు ఎక్కడం, అటవీ ప్రాంతం రాగానే డ్రైవర్ల మెడకు ప్లాస్టిక్ వైరు బిగించి చంపడం లేదా పదునైన కత్తులతో నరకడం చేస్తుంటారు. గతంలో జరిగిన హత్యలన్నీ ఇదే రీతిలో జరిగాయి. హత్య చేసి మృతదేహాలను అటవీప్రాంతాల్లో పూడ్చిపెడుతుంటారు. ఈ మధ్య జరుగుతున్న సంఘటనలతో ఈ ముఠా ప్రస్తావన మళ్లీ వినిపిస్తోంది.