నిజాయితీగల నాయకుడు జగన్
- ప్రజల బలహీనతలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిన బాబు
- రాష్ట్ర విభజనకు సహకరించి చరిత్రహీనుడిగా మిగిలిన కిరణ్
- బాబు, కిరణ్ చిత్తూరు జిల్లాలో పుట్టడం దురదృష్టకరం
- ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పులిచెర్ల (కల్లూరు): రాజకీయాల్లో నిజాయితీ కలిగిన ఏకైక నాయకుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పులిచెర్లలో సోమవారం ఎంపీపీ మురళీధర్ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఇటీవల ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని అమలుకు సాధ్యంకాని హామీలను గుప్పించి అడ్డదారిలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాడని దుయ్యబట్టారు.
నాడు అధికారం కోసం పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన మాదిరిగానే నేడు ప్రజలను వెన్నుపోటు పొడవడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని ఆయన ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే మొదటి సంతకం రుణమాఫీపైనే చేస్తానంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు దానిపై కమిటీ వేసి కాలయాపన చేస్తున్నాడన్నారు.
ఎన్నికల సమయంలో తమ పార్టీ మేనిఫెస్టోలో రుణమాఫీని చేర్చాలని తనతో పాటు మరికొంత మంది అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకుపోగా అందుకు ఆయన స్పందిస్తూ అది సాధ్యమయ్యే పనికాదని, అధికారంలోకి వచ్చిన తరువాత చేయకపోతే ప్రజల మనసులో మాట నిలుపుకోలేని వ్యక్తులుగా మిగిలిపోవాల్సి వస్తుందని చెప్పినట్టు ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్ర విభజనకు సహకరించి చరిత్ర హీనుడుగా మారాడని విరుచుకుపడ్డారు.
రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇద్దరూ చిత్తూరు జిల్లాలో పుట్టడం మన దురదృష్టకరమన్నారు. టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తెలుగుదేశానికి ఓటు వేసిన ప్రతి ఒక్కరూ ఆ పార్టీ నాయకులను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు అశోక్, ఎంపీపీ మురళీధర్, మండల పార్టీ కన్వీనర్ మురళీమోహన్‌రెడ్డి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, సహకార సంఘం మాజీ అధ్యక్షులు రెడ్డీశ్వర్‌రెడ్డి, నాయకులు నాదమునిరెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డి, ఎన్‌ఎస్ రెడ్డిప్రకాష్, నాగిరెడ్డి, వెంకటరెడ్డెప్ప, డీఎస్.గోవింద్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్వీ రమణ, కోదండయ్య, ముర్వత్‌బాషా, రాయల్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.