
అనంత జన్మభూమిలో తేనెటీగల దాడి
జన్మభూమి-మాఊరు కార్యక్రమం కాస్తా అనంతపురం జిల్లాలో రసాభాసగా మిగిలింది. మడకశిర మండలం గుండుముల గ్రామంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో అనుకోని అతిథులుగా.. తేనెటీగలు వచ్చిపడ్డాయి. మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యేలు పార్థసారథి, ఈరన్న, ఎమ్మెల్సీ తిప్పేస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అయితే కార్యక్రమం ఇంకా పూర్తి కాకముందే ఉన్నట్టుండి తేనెటీగలు వచ్చి మీదపడ్డాయి. దాంతో జనం కాస్తా ఒక్కసారిగా అక్కడినుంచి పరుగులు తీశారు. ఎవరో తేనెపట్టు మీద రాయి వేసి ఉంటారని, అందుకే తేనెటీగలు ముసిరాయని అంటున్నారు. మొత్తానికి అనుకోని అతిథుల కారణంగా జన్మభూమి కార్యక్రమం మాత్రం సగంలోనే ఆగిపోయింది.