
హాస్టల్‌లో కామ పిశాచులు
సాక్షి, ఏలూరు / బుట్టాయిగూడెం : అమాయక బాలికలపై కామపిశాచులు విరుచుకుపడ్డారు. బుట్టాయగూడెం హాస్టల్ విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయూన్ని సంక్షేమ శాఖ అధికారులు కలెక్టర్ కె.భాస్కర్, జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డికి ఫిర్యాదు చేయడంతో విచారణ . వివరాల్లోకి వెళితే.. బుట్టాయగూడెం మండలంలోని ఓ హాస్టల్‌లో దాదాపు 60 మంది బాలికలు ఉన్నారు. హాస్టల్‌లో ఓ కాంట్రాక్టు ఉద్యోగినికి డబ్బు ఆశ చూపించి కొందరు వ్యక్తులు బాలికలపై అకృత్యానికి ఒడిగట్టారు. ఈ విషయూన్ని బయటపెట్టి అల్లరి చేస్తామని కొందర్ని బెదిరించారు. విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఏవీ సుబ్బరాజు, డీటీసీ డీఎస్పీ కె.సరిత, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జి.ధర్మేంద్రను విచారణాధికారులుగా నియమించారు. సోమ, మంగళ వారా ల్లో వారు క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు స్థానిక యువకులను, అసాం ఘిక కార్యకలాపాలకు సహకరించిందని అవుట్ సోర్సింగ్ ఉద్యోగి శ్యామలను అరెస్ట్ చేశారు. మరికొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నిందితులపై కఠిన చర్యలు
జిల్లా ఎస్పీ రఘురామ్‌రెడ్డి మంగళవా రం హాస్టల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులపై ఉమెన్ ట్రాఫికింగ్, బలవంతం, ఫోక్స్ యాక్ట్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతోపాటు నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉంటే పూర్తి స్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాలికలను వైద్య పరీ క్షల కోసం ఏలూరు తరలించారు. వారిని ఎస్పీ పరామర్శించారు.
వెలుగు చూసిందిలా
హాస్టల్‌లోని విద్యార్థినులు ప్రతిరోజు తమకు కావలసి వస్తువులు కొనుగోలు చేసేందుకు సెంటర్‌లోని షాపులకు వెళుతుంటారు. ఆదివారం సాయంత్రం ఈ విషయం మేట్రిన్ జ్ఙానకుమారికి తెలియంతో వారిని మందలిం చారు. అదే సమయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి శ్యామలకు బయటి వ్యక్తుల నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ఒకసారి మాట్లాడి పెట్టేసినా మళ్లీ ఫోన్ రావడంతో మేట్రిన్ ఆ ఫోన్ తీసుకుని మాట్లాడారు. గతంలో తాను మందలించిన యువకుడి గొంతు కావడంతో వార్డెన్‌కు అనుమానం వచ్చింది. విద్యార్థినులను ఆరా తీయగా, కొంతమంది వ్యక్తులు రాత్రి సమయంలో శ్యామల సహకారంతో హాస్టల్‌లోకి వస్తున్నారని వెల్లడించారు. దీంతో సోమవారం జిల్లా అధికారులకు మేట్రిన్ ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది.
మేట్రిన్ సస్పెన్షన్
మేట్రిన్ జ్ఞానకుమారి జంగారెడ్డిగూడెం హాస్టల్‌లో పనిచేస్తూ ఈ హాస్టల్‌కు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆమె అప్పుడప్పుడూ రావటంతో పర్యవేక్షణ కరువైంది. నైట్‌వాచర్ శ్యామల ప్రతిరోజు విద్యార్థుల్ని తీసుకుని కూరగాయలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్దకు వెళుతోంది. ఈ నేపథ్యంలో ఆమెకు కొందరు వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. అదే ఈ దారుణానికి దారి తీసిం ది. ఇదిలావుండగా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేసినట్టు సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎం.శోభారాణి చెప్పారు.
వివరణ కోరిన బాలల హక్కుల కమిషన్
సాక్షి, హైదరాబాద్: ఈ ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ జిల్లా కలెక్టర్, ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్‌ను వివరణ కోరింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులిస్తూ నిందితులపై చర్యలు తీసుకోవడంతోపాటు బాలికలకు రక్ష ణ కల్పించాలని కమిషన్ ఆదేశించిం దని కమిషన్ సభ్యులు అచ్యుతరావు, మమతా రఘువీర్, రహీముద్దీన్ తెలిపారు.
కఠినంగా శిక్షించండి : మంత్రి
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహంలో అసాంఘిక కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి పీతల సుజాత జిల్లా ఎస్పీని ఆదేశించారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సుజాత ఈ విషయమై కలెక్టర్ కె.భాస్కర్, జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. వసతి గృహంలోని ఘటన సభ్యసమాజానికి తలవంపులు తెచ్చేదిగా ఉందని, సంక్షేమ హాస్టల్స్‌ను దేవాలయాలుగా భావించి అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన సిబ్బంది అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా నిర్లక్ష్యం వహించడం దారుణమని ఆమె పేర్కొన్నారు.దోషులు ఎవరైనా చర్యలు తీవ్రంగా ఉండాలని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.