అవుటర్‌లో అవుట్
శివారులో గంటలకొద్దీ నిలిచిపోతున్న రైళ్లు
ప్లాట్‌ఫాంలు ఖాళీలేక.. ట్రాక్‌లలో లోపాల వల్లే..
నరకం చవిచూస్తున్న ప్రయాణికులు రాత్రిపూట భయంభయం
రైల్వేస్టేషన్ : రైల్వే ప్రయాణికులకు నగర శివారుల్లో చుక్కలు కనిపిస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్‌లు మొదలుకుని పాసింజర్ రైళ్ల వరకూ ప్రతీది నగర శివారులో సుమారు 10 నుంచి 45 నిమిషాల పాటు ఆగిపోతోంది. దీంతో ప్రయాణికులు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. విజయవాడ మీదుగా రోజూ 350కిపైగా ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్లు వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి. సాధారణ రోజుల్లో లక్షమందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. పండుగలు, సెలవు దినాల్లో రెట్టింపు రాకపోకలు ఉంటాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఈ ప్రయాణికులంతా నగర శివారుకు రాగానే బెంబేలెత్తిపోతున్నారు. ప్లాట్‌ఫాంలు ఖాళీ లేక.. ట్రాక్‌లలో లోపాల కారణంగా రైళ్లు గంటలకొద్దీ శివారుల్లోనే ఆగిపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రారంభించిన రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టమ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రూ.50కోట్లతో 2005లో ప్రారంభమైన ఈ పనులు 2012 దసరా నాటికి పూర్తికావాల్సి ఉన్నా అధికారులెవరూ పట్టించుకోవట్లేదు.
ఎందుకిలా..
రైల్వేస్టేషన్‌లోని ట్రాక్‌లో ఏదైనా లోపం తలెత్తిందంటే చాలు ఈవిధంగా నగర శివారులో రైళ్లను ఆపేస్తారు. విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్ మార్గాల నుంచి రైళ్లు నిర్ణీత సమయానికి చేరుకున్నా స్టేషన్‌లో ప్లాట్‌ఫాంలు ఖాళీ లేక గంటలకొద్దీ అవుటర్‌లోనే నిలిచిపోతున్నాయి. ఉదాహరణకు ఏలూరు నుంచి విజయవాడకు గంట సమయం పడుతుంటే.. విజయవాడ శివారు నుంచి రైల్వేస్టేషన్‌కు సుమారు 30 నిమిషాలు పడుతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దొంగల భయం
రాత్రివేళ శివారుల్లో దొంగల భయం అధికంగా ఉండటంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. చెన్నై వైపు నుంచి వచ్చే రైళ్లను కృష్ణా కెనాల్ వద్ద గంటల కొద్దీ నిలిపి వేయడంతో మూడు నెలల్లో రూ.2లక్షల విలువైన బంగారం దోపిడీకి గురైంది. రాజధాని నేపథ్యంలో విజయవాడ, గుంటూరుకు వచ్చే ఉద్యోగులు, వ్యాపారుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
త్వరలోనే ఆర్‌ఆర్‌ఐ తుది దశ పనులు
రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టమ్ తుది దశ పనులకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. త్వరలోనే పనులు ప్రారంభించి మూడు నెలల్లో పూర్తిచేస్తాం. రాత్రివేళల్లో అవుటర్‌లో నిలిపే రైళ్లకు భద్రత కల్పిస్తాం.
- ఎంఎన్‌ఎస్‌ఆర్ ప్రసాద్, రైల్వే ఏడీఆర్