చేయలేమని తెలిసీ హామీ ఇస్తే మోసం కాదా?
నేతలకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ చురక
అనంతపురం లీగల్: పర్యవసానాలేమీ తెలియకుండా నాయకులు హామీలెలా ఇస్తారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ప్రశ్నించారు. హామీలను నెరవేర్చలేమని తెలిసీ.. చేస్తామని నమ్మబలికితే అది మోసం కాదా? అని చురకలంటించారు. గురువారం అనంతపురంలోని ప్రభుత్వ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ‘నైతిక విలువలు-విద్యార్థుల బాధ్యత’ అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాభీష్టం మేరకు నడవకపోతే యువత భగత్‌సింగ్ వారసులుగా నూతన సమాజం కోసం ముందుకు రావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఫ్యాక్షన్ కేసుల విచారణలో విచక్షణ చూపండి
పత్తికొండ: ఫ్యాక్షన్ కేసుల విచారణలో న్యాయమూర్తులు విచక్షణతో వ్యవహరించాలని హైకోర్టు జడ్జి జస్టిస్ బి.చంద్రకుమార్ సూచించారు. ఫ్యాక్షన్ ముసుగులో సంబంధం లేని అమాయకులపై కేసులు బనాయిస్తున్నారని, వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. కర్నూలు జిల్లా పత్తికొండలోని జూనియర్ సివిల్‌జడ్జి కోర్టు ఆవరణలో నిర్మించిన బార్ అసోసియేషన్ కార్యాలయ భవనాన్ని జస్టిస్ చంద్రకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వార్థ నాయకుల మాటలు విని అమాయకులు ఫ్యాక్షన్ ఊబిలో కూరుకుపోరాదన్నారు.