=హెలెన్ తుపానుతో కోలుకోలేని దెబ్బ
= పొలంలోనే మొలకెత్తుతున్న ధాన్యం
= చేష్టలుడిగిన అన్నదాత
= పంట నష్టం అంచనాకు అధికారులు సిద్ధం
శ్రమ చేసి.. చెమటోడ్చి.. నిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పంట చేతికొచ్చే దశలో నేలపాలైతే.. ఆ రైతుకు ఎంత కష్టం! అప్పులు తెచ్చి.. పెట్టుబడులు పెట్టి.. ఎన్నో ఆశలతో చేసిన సాగు పొలంలోనే దెబ్బతింటే.. దిగుబడులు దారుణంగా పడిపోయే పరిస్థితి నెలకొంటే అన్నదాతకు ఎంత నష్టం!! ఆశలు అడియాసలవుతున్న వేళ.. ఉన్న పంటనైనా కాపాడుకునేందుకు రైతన్న నానా పాట్లు పడుతున్నాడు.
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : హెలెన్ తుపాను ప్రభావంతో జిల్లా రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. పంట చేతికొచ్చే సమయంలో బలమైన గాలులు, వర్షం ధాటికి నేలకొరిగిన పైరు లోలోపలే కుళ్లిపోతోంది. నేలవాలిన వరి కంకులు నీటిలో నానిపోతూ మొలకెత్తేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఖరీఫ్ సీజన్‌లో బీపీటీ 5204 రకాన్ని అత్యధికంగా రైతులు సాగు చేశారు. ఈ రకం విత్తనానికి పై తోలు పలుచగా ఉండటంతో వర్షాలకు తడిచి నీటిలో పడిన ధాన్యం త్వరితగతిన మొలకెత్తేందుకు అవకాశముందని రైతులు చెబుతున్నారు. ఆదివారం కొంతమేర జిల్లాలో వర్షం తగ్గినా పైరు నీటిలోనే నానుతుండటంతో రైతులు ఖరీఫ్ పంటపై ఆశలు వదులుకునే పరిస్థితి దాపురించింది.
పంటలను రక్షించుకునేందుకు రైతన్న పాట్లు...
తుపాను తాకిడికి నేలవాలిన వరిని కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. పొలంలో ఉన్న నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. పడిపోయిన వరిని జుట్టుకట్టలు కట్టి నిలబెట్టే పనులు చేపట్టారు. నేలవాలిన వరి పైకి పచ్చగానే కనపిస్తున్నా నీటిలో నానుతూ పైరు కుళ్లిపోతోంది. పాలుపోసుకునే దశలో ఉన్న కంకులు నీటిలో రెండు, మూడు రోజులకు మించి మునిగి ఉంటే గింజ గట్టిపడదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంటుమిల్లి తదితర ప్రాంతాల్లో పొలాల్లో నిలిచిన నీటిని బయటికి తరలించేందుకు ఇంజన్లను ఉపయోగిస్తున్నారు. మరికొన్నిచోట్ల కోతకొచ్చిన పైరును యంత్రాలను కోయిస్తున్నారు.
మినుము విత్తనాలు చల్లేందుకు ఆటంకమే...
జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. 5.50 లక్షల ఎకరాలకు పైగా వరికోతకు సిద్ధమైంది. హెలెన్ తుపాను ప్రభావంతో 2.25 లక్షల ఎకరాల్లో పంట నీటమునిగింది. దాదాపు మూడు లక్షల ఎకరాల్లో రెండో పంటగా మినుము (అపరాలు) సాగు చేస్తారు. పైరు నేలవాలటంతో మినుము విత్తనాలు చల్లేందుకు అవకాశం లేకుండా పోయిందని రైతులు చెబుతున్నారు. పొలంలో నీరు నిలిచి ఉండటంతో మినుము విత్తనాలు ఇప్పట్లో చల్లే అవకాశం లేదని పేర్కొంటున్నారు. మినుము సాగు చేసే 22 మండలాలకు నాలుగువేల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పొలంలో నీరు తగ్గితేనే మినుము చల్లేందుకు అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు.
పంటను ఇలా కాపాడుకోండి...
హెలెన్ తుపాను ప్రభావంతో కోత దశలో ఉన్న పైరు నీటమునిగిందని, ఈ పంటను రక్షించుకునేందుకు చర్యలు చేపట్టాలని మచిలీపట్నం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు పి.అనురాధ, నాగేంద్రరావు పలు సూచనలు చేశారు. కోతకు సిద్ధంగా ఉన్న పైరు నేలవాలితే పైరుపై లీటరు నీటికి 50 గ్రాముల ఉప్పు కలిపి కంకుల మీద పిచికారీ చేయాలని తెలిపారు. వల్ల ధాన్యం మొలకెత్తకుండా, రంగు మారకుండా కొంతవరకు కాపాడుకునే అవకాశం ఉంటుందన్నారు. కోసిన వరి పనలపై ఉంటే లీటరు నీటికి 50 గ్రాముల ఉప్పు కలిపి ఆ ద్రావణాన్ని పిచికారీ చేయాలన్నారు. పనలను తరచూ తిప్పుతూ ఆరబెట్టాలన్నారు.
తడిచిన పనలను కుప్పగా వేస్తే సిలీంద్ర వ్యాప్తి జరిగి ధాన్యం రంగుమారి ముక్కిపోయే అవకాశం ఉందని చెప్పారు. ఎకరం పైరును కుప్పవేసే సమయంలో 40 నుంచి 50 కిలోల ఉప్పును కుప్పలో ప్రతి వరుసకు చల్లితే ధాన్యం మొలకెత్తకుండా ముక్కిపోకుండా ఉంటుందన్నారు. కల్లంలో ఉన్న ధాన్యం తడిస్తే క్వింటాలు ధాన్యానికి ఐదు కిలోల ఉప్పు, 20 కిలోల పొడి ఊక కలిపి పోగు పెట్టాలని సూచించారు. ఇలా చేస్తే తడిచిన ధాన్యం వారం రోజుల వరకు మొలకెత్తకుండా, దెబ్బతినకుంటే ఉండే అవకాశం ఉందన్నారు.
హెలెన్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించాలని విజయవాడలో జరిగిన మండల వ్యవసాయాధికారుల సమావేశంలో నిర్ణయించారు. పంట నష్టం అంచనాలను కచ్చితంగా తయారుచేయాలని వ్యవసాయ శాఖ జేడీ బాలునాయక్ ఏవోలకు సూచించారు.
ఎంత కష్టం.. ఎంత నష్టం..
Published Mon, Nov 25 2013 12:36 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement