
రబీ వర్రీ
రైతుల బతుకులు బండలైపోతున్నాయి. ఏ పంట పండించేవారికైనా అడుగడుగునా ఒడిదుడుకులే..పెరిగిన మదుపులు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ తోడ్పాటు...
- ప్రతికూల వాతావరణంతో కలిసిరాని సాగు
- తెగుళ్లు, వర్షాభావంతో 30శాతం తగ్గిన దిగుబడి
- గిట్టుబాటు ధర లేక రూ.40 లక్షలు నష్టపోయిన రైతులు
రైతుల బతుకులు బండలైపోతున్నాయి. ఏ పంట పండించేవారికైనా అడుగడుగునా ఒడిదుడుకులే..పెరిగిన మదుపులు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ తోడ్పాటు,గిట్టుబాటు ధర అడుగంటి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ఈ ఏడాది రబీలోనూ అన్నదాతకు ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. వర్షాభావ పరిస్థితులు,తెగుళ్ల బెడదతో పంటదిగుబడి బాగా తగ్గిపోయింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడిప్పుడే నూర్పుడి చేపట్టి ధాన్యం అమ్మకాలతో అసలు విషయం బయటపడుతోంది.
నర్సీపట్నం, న్యూస్‌లైన్: రబీ వరిసాగు జిల్లా రైతులకు కలిసిరాలేదు. పంటకు దిగుబడి బాగా తగ్గడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. పెట్టుబడులు సైతం రాని పరిస్థితులతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 5,502 హెక్టార్లలో రబీవరి చేపట్టారు. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 3,43,875 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రావాలి. సీజను ప్రారంభంలో వర్షాభావం, తెగుళ్లు, కోత దశలో ఈదురుగాలులు, వర్షాల కారణంగా పంట పూర్తిగా చేతికి రాలేదు. 30 శాతం వరకు పంట నష్టపోవాల్సి వచ్చింది. ప్రతి కూల వాతావరణంలో రైతులు ఆలస్యంగా ఈ వరి సేద్యం చేపట్టారు. తెగుళ్లదాడితో పెట్టుబడులు పెరిగాయి. వచ్చిన ఆదాయం కేవలం మదుపులకే సరిపోతోంది. వచ్చిన ధాన్యాన్నైనా అమ్మకం చేద్దామంటే వ్యాపారులు ఇష్టమొచ్చిన రీతిలో కొనుగోలు చేస్తున్నారు.
ప్రతికూల వాతావరణం
గతంతో పోలిస్తే ఈ రబీలో ప్రతికూల పరిస్థితులెదురయ్యాయి. అక్కడక్కడా సాగునీటి వసతులున్న ప్రాంతాల్లో పంట వేసినా నిర్ణీత సమయాల్లో వర్షాలు అనుకూలించలేదు. పంటకు సాగునీరు అందని దుస్థితి ఎదురయింది. దీంతో పాటు కూలీ, ఎరువుల ధరలు అధికం కావడంతో ఎకరా సేద్యానికి పెట్టుబడి రూ. 18వేల వరకు పెరిగింది. పంట కోత సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి పనలు తడిసి ముద్దయ్యాయి. కొన్ని చోట్ల గింజలు రాలిపోయి మొలకెత్తాయి. ఇలా ప్రతికూల పరిస్థితుల కారణంగా ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు రావాల్సిన దిగుబడి 18 క్వింటాళ్లకే పరిమితమైంది. ఈ విధంగా వచ్చిన దిగుబడులు కేవలం పెట్టుబడులకే సరిపోయాయి.
రాని మద్దతు ధర
కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం క్వింటాకు రూ. 1,280 వరకు చెల్లించాలి. అయితే రైతుల నుంచి రూ. వెయ్యికి మించి వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. ఈ విధంగా జిల్లా మొత్తంగా రైతులు రూ. 40 లక్షలు నష్టపోయారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఈ విధంగా గత ఏడాదితో పోలిస్తే జిల్లా రైతులకు రబీ నిరాశనే మిగిల్చింది.
మదుపులు రాలేదు
నాది నాతవరం మండలం మన్యపురట్ల. రెండెకరాల్లో రబీవరి సాగు చేశాను. పరిస్థితులు అనుకూలిస్తే 50 క్వింటాళ్ల వరకు ధాన్యం దిగుబడి రావాలి. పంట కోత సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల పనలు తడసి ము ద్దయ్యాయి. తడిసిపోయిన, ఎగిరిపోయిన పనలు ఒక దగ్గరకు చేర్చేందుకు, రోడ్లపైనే నూర్పిడికి పెట్టుబడి మరింత పెరిగింది. తీరా చూస్తే 15 క్వింటాళ్లు మా త్రమే దిగుబడి వచ్చింది. మదుపులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
- ఈశ్వర్రావు, రైతు