
నీరజ్ గుప్తాను ప్రశ్నిస్తున్న అధికారులు
హైదరాబాద్ నుంచి చెన్నైకు అక్రమంగా తరలిస్తున్న రూ.1.53 కోట్ల డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సాక్షి, చెన్నై: హైదరాబాద్ నుంచి చెన్నైకు అక్రమంగా తరలిస్తున్న రూ.1.53 కోట్ల డబ్బును మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలకు చెందిన ఆ విభాగం అధికారులు గుమ్మిడిపూండి చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.
ఆ సమయంలో ఆంధ్రా నుంచి వచ్చిన ఓ ప్రైవేట్ బస్సులో రెండు సూట్ కేసుల్లో ఉన్న నోట్ల కట్టలు బయట పడ్డాయి. వాటిని లెక్కించగా రూ.1.53 కోట్లని తేలింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన నీరజ్ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తం ఎవరైనా రాజకీయ ప్రముఖుల కోసం ఇక్కడికి తరలిస్తున్నారా అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు.