
పట్టుబడిన నెల్లూరు జిల్లా ట్రాక్టర్లు
సూళ్లూరుపేట: ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. ఉచితంగా ఇసుక తీసుకోవచ్చనే ప్రకటనతో అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు. ఇదే సరిహద్దు పోలీసు స్టేషన్లకు వరంగా మారింది. ఆంధ్రా–తమిళనాడు సరిహద్దుల్లోని తడ, సూళ్లూరుపేట, చిత్తూరు జిల్లా పరిధిలోని వరదయ్యపాళెం మండలాల్లో పలు ప్రాంతాలను డంపింగ్ కేంద్రాలను ఎంపిక చేసుకుని రాత్రి వేళల్లో తమిళనాడుకు ఇసుక తరలిస్తున్నారు. పగలంతా ట్రాక్టర్ల ద్వారా మిక్సర్ ప్లాంట్ల పేరుతో ఇసుకను తీసుకెళుతున్నారు. రాత్రి వేళల్లో జేసీబీలతో లారీల్లో లోడింగ్ చేసి తమిళనాడుకు సరఫరా చేస్తున్నారు.
కఠినతరం చేయడంతో..
తమిళనాడులో ఎక్కడా ఇసుక తవ్వకూడదనే నిబంధనలను కఠినతరంగా అమలు చేస్తున్నారు. దీంతో ఆంధ్రా నుంచి వెళ్లే ఇసుక మీదే ఆధారపడి అక్కడ భవన నిర్మాణాలు చేస్తున్నారు. నాయుడుపేట, శ్రీకాళహస్తి, పెళ్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ మండలాల నుంచి శ్రీసిటీ, రామాపురం, బత్తులవల్లం పేరుతో పగలు, రాత్రి తేడా లేకుండా ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. నెల్లూరు–చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో డంపింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసుకుని అక్కడినుంచి లారీల్లో ఇసుకను చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు తదితర ప్రాంతాలకు బాహాటంగా రవాణా చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ యజమానికి ఒక్కో టీడీపీ నాయకుడు అండదండలు ఉండటంతో అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.
15 ట్రాక్టర్లు
జిల్లాలోని కాళంగి, స్వర్ణముఖి, నెల్లూరు పెన్నా నది నుంచి అధికలోడుతో ఇసుకను చిత్తూరు జిల్లా బత్తులవల్ల వద్ద ఉన్న మిక్సర్‌ప్లాంట్‌కు తోలుతున్నారు. అక్కడ డంప్ చేసి రాత్రివేళల్లో తమిళనాడుకు తరలిస్తున్నారనే సమాచారంతో వరదయ్యపాళెం పోలీసులకు మంగళవారం ఆకస్మికంగా దాడులు చేసి సుమారు 15 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 10 ట్రాక్టర్ల వరకు నెల్లూరు జిల్లాకు చెందినవే కావడం విశేషం. పట్టుబడిన ట్రాక్టర్ల డ్రైవర్లను అదుపులోకి తీసుకుని యజమానులను పిలిపించుకుని విచారిస్తున్నారు.
ఆంధ్రా ఇసుకకు డిమాండ్
జిల్లాలోని పెన్నా, స్వర్ణముఖి, కాళంగి నది ఇసుక మంచి డిమాండ్ ఉంది. పెన్నా, స్వర్ణముఖి ఇసుక టన్ను రూ.450 నుంచి రూ.500కు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఒక్కో ట్రాక్టర్‌కు 6 నుంచి 8 టన్నుల వరకు లోడ్ చేసుకుని వెళుతున్నారు. చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చి లాంటి నగరాల్లో ఒక్క లారీ ఇసుక రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు పలుకుతోంది. వరదయ్యపాళెం మండలాల సరి«హద్దులోని సంతవేలూరు రోడ్డు సమీపంలో మంగళంపాడు చెరువుకు దగ్గరగా ఉన్న అటవీ ప్రాంతం, బత్తులవల్లం, శ్రీసిటీ తదితర ప్రాంతాల్లో డంపింగ్ కేంద్రాల నుంచి లారీలకు ఇసుక సరఫరా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment