బొండాడలో భారీ అగ్ని ప్రమాదం
బొండాడ(కాళ్ల) : బొండాడలో ఆదివారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించిర ది. క్షణాల్లోనే 14 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. గ్రామంలోని చెరువుగట్టు సమీపంలో సగర్ల కులస్తులు(ఉప్పర్లు) గుడిసెలు వేసుకుని చాలా కాలంగా నివాసం ఉంటున్నారు. వీరికి ఇంటి స్థలాలు లేకపోవడంతో దగ్గర దగ్గరగా ఇళ్లు గుడిసెలు వేసుకుని కాలం వెళ్లబుచ్చుతున్నారు. వీరంతా కూలీలే. భార్యాభర్తలు ఇద్దరూ కూలికి వెళుతుంటారు. ఆదివారం ఉదయం యథావిధిగా వారంతా కూలి పనికి వెళ్లారు. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పైపునుంచి గ్యాస్ లీకై అది అంటుకుంది. ఆ మంట ఇంటికి అంటుకుంది. అదే సమయంలో బలమైన గాలులు వీయటంతో ఒకదాని తరువాత ఒకటి క్షణాల్లో 14 ఇళ్లకు మంటలు వ్యాపించాయి. కొన్ని ఇళ్ళలో ఉన్న వారు ప్రాణాలు దక్కించుకోవడం కోసం బయటకు పరుగులు తీశారు.
మంటలు ఒక్కసారిగా పెద్దవైపోవటంతో సామాన్లు కూడా బయటకు తెచ్చుకోలేక పోయారు. మొత్తం ఇళ్లనీ కాలిపోయాయి. సామగ్రి, బీరువాల్లోని బంగారం, నగదు కాలి బూడిదయ్యాయి. వారు దాచుకున బియ్యం, వడ్లు కూడా దక్కలేదు. ఆదివారం కావడంతో పిల్లలు ఇంట్లో ఉంచుకున్న స్కూల్ బ్యాగ్‌లు, పుస్తకాలు కూడా కాలి బూడిదవ్వడంతో పిల్లలూ విలపించారు. వారు పెంచుకుంటున్న కోళ్లు మాంసం ముద్దలయ్యాయి. ప్రమాదం విషయం తెలియగానే కూలికి వెళ్లిన వారు వచ్చి త మ ఇళ్లను చూసి బోరుమని విలపించారు. బీరువాలో దాచుకున్న బంగారం, నగదు కోసం వెతికితే వారికి బూడిదే కనిపించింది. జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న కొద్దిపాటి బంగారం, నగదు కాలిపోవడంతో వారి దుఃఖానికి అంతులేకుండా పోయింది. భీమవరం అగ్ని మాపక దళ కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. కాళ్ల ఎస్సై బి.శ్రీనివాస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో గండికోట నారాయుడు, గండికోట పాశారావు, గండికోట పర్లమ్మ, నక్కా పర్లమ్మ, గండికోట చినమంగ, నక్కా పాపయ్య, నిడమోలు వెంకన్న, నిడమోలు సత్యనారాయణ, గండికోట సోములమ్మ, గండికోట వెంకటేశ్వర్లు, గండికోట తాతయ్య, నక్కా భూలక్ష్మి, నిడమోలు శ్రీను, బోధనపు వెంకటేశ్వర్లు కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. వైసీపీ నాయకుడు, ఎఎంసీ మాజీ చైర్మన్ మన్నే నాగరాజు బాధితులను పరామర్శించారు. సర్పంచ్ మన్నే వరలక్ష్మి బాధితులకు హైస్కూల్లో పునరావాసం కల్పించి భోజన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఆర్‌ఐ ప్రసాదు, వీఆర్వో ఎన్.సీతారాం వచ్చి నష్టాన్ని అంచనా వేశారు. సుమారు రూ.15 లక్షల వరకూ ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు. బాధితులను పరామర్శించిన వారిలో ఎంపీపీ ఆరేడు తాతపండు, టీడీపీ నాయకుడు బండారు వేణుగోపాలరావు ఉన్నారు. ప్రభుత్వం తరఫున ఒక్కో బాధిత కుటుంబానికి 10 కేజీల చొప్పున బియ్యం అందజేశారు.
ఎంపీ, ఎమ్మెల్యేల సాయం
బాధితులకు ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు ఆర్థిక సహాయం అందజేశారు. ఎమ్మెల్యే శివ ‘శివ స్వచ్ఛంద సంస్థ’ తరఫున ఒక్కో కుటుంబానికి 25 కేజీల చొప్పున బియ్యం రూ.1000 నగదును ఎంపీపీ ఆరేటి తాతపండు ద్వారా పంపించారు. ఎంపీ గోకరాజు గంగరాజు ఒక్కో కుటుంబానికి రూ.1000 నగదు, 25 కేజీల బియ్యాన్ని చొప్పున తన సోదరుడు గోకరాజు రామరాజు ద్వారా బాధితులకు పంపించారు.