భార్యను హతమార్చిన భర్త అనాథలుగా మారిన పిల్లలు
శాంతిపురం: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అనుమానించాడు. తనకు తెలియకుండా పుట్టింటి వారితో ఫోన్‌లో మాట్లాడుతోందని ఆగ్రహానికి గురయ్యాడు. దీనిపై గొడవ పడ్డాడు. చివరకు గొంతు నులిమి హత్య చేశాడు. ఈ సంఘటన కర్ణాటక సరిహద్దు గ్రామమైన బెళ్లకోగిల వద్ద గురువారం వెలుగు చూసింది. మృతురాలి పిల్లలు, బంధువులు, పోలీసుల కథనం మేరకు.. కర్ణాటకలోని మడివాళకు చెందిన శివానంద(35), పక్క గ్రామమైన క్యాసంబల్లికి చెందిన అలివేలమ్మ(30) ప్రేమించుకుని 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు లోకానంద 5వ తరగతి, చిన్నకొడుకు సత్యానంద 3వ తరగతి మడివాళలోని నాన్నమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. శివానంద తాపీ మేస్త్రీగా, అలివేలమ్మ వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ బెళ్లకోగిలో కాపురం పెట్టారు. బెళ్లకోగిలలోని శివానంద బంధువులు గ్రామ సమీపంలో ఇంటి స్థలం ఇవ్వడంతో అక్క డ ఇందిరమ్మ ఇల్లు కట్టుకుని జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలివేలమ్మపై శివానందకు అనుమానం వచ్చింది. దీనికితోడు తనకు తెలియకుండా ఫోన్ దాచుకుని పుట్టింటి వారితో మాట్లాడడంతో బుధవారం గొడవ పడ్డాడు. మధ్యాహ్నం ప్రాంతంలో క్యాసంబల్లికి వెళ్లి కొబ్బరి బోండాలు తీసుకువస్తామని చెప్పి ఇంట్లో ఉన్న చిన్న కుమారుడు సత్యానందను ద్విచక్ర వాహనంలో మడివాళకు వెళ్లాడు. అక్కడ బాలుడిని అక్కడే వదిలి తిరిగి ఇంటికి వచ్చి భార్యతో మళ్లీ గొడవపడి ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత తలుపు దగ్గరగా వేసి పరారయ్యాడు.
కేసు నమోదు
గ్రామస్తుల సమాచారంతో కుప్పం సీఐ రాజశేఖర్, రాళ్లబూదుగూరు ఎస్‌ఐ గోపీ అక్కడికి చేరుకుని అలివేలమ్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కుప్పానికి తరలించారు. మృతురాలి బంధువులు, పిల్లలను విచారించారు. అలివేలమ్మ సోదరుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
తల్లిదండ్రులు గొడవపడుతుంటారని..
బోండాలు తెస్తానని చెప్పి వెళ్లిన తండ్రి ఎంతకూ రాకపోవడంతో తల్లిదండ్రులు మళ్లీ గొడవ పడుతుంటారని మడివాళలో ఉన్న పిల్లలు భావించారు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో లోకానంద, సత్యానంద కాలి నడకన రెండు కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఇంటికి చేరారు. కింద పడి ఉన్న తల్లిని లేపడానికి ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేదు. దీంతో పరుగున మళ్లీ మడివాళకు వెళ్లి నాన్నమ్మకు విషయం చెప్పారు. బుధవారం రాత్రి బంధువులు వచ్చి చూడగా అలివేలమ్మ మృతిచెందినట్టు గుర్తించారు. తల్లి మృతి చెందడంతో చిన్నారులు అనాథలుగా మిగిలారు.