సాక్షి, హైదరాబాద్: నిజాంను కీర్తించడం, నిందించడం శాసనమండలిలో ఆదివారం సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమయింది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై ఆదివారం మండలిలో చర్చ కొనసాగింది. హైదరాబాద్ రాష్ట్రంలో ఆదాయం ఘనంగా ఉండేదని, అభివృద్ధిలోనూ ఆంధ్రా కంటే ముందుండేదని టీఆరెల్డీ సభ్యుడు దిలీప్‌కుమార్ పేర్కొన్నారు. అనంతరం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యతను వివరిస్తూ బిల్లును వ్యతిరేకించారు. తర్వాత శాసనసభ వ్యవహారాల మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ.. ‘పెద్దల సభలో నిజాం ప్రభువును కీర్తించడం దురదృష్టకరం. మరాఠా, కన్నడ, తెలంగాణ కలిసున్న ఉమ్మడి హైదరాబాద్ ఆదాయాన్ని తెలంగాణ ఆదాయంగా చూపిస్తూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని పేర్కొన్నారు.
అధికార కాంగ్రెస్ సభ్యుడు భానుప్రసాద్ అడ్డు తగులుతూ.. ‘మంత్రి హోదాలో క్లారిఫికేషన్ ఇస్తున్నారా? మండలి సభ్యుడిగా మాట్లాడుతున్నారా? స్పష్టం చేయూలి’ అని డిమాండ్ చేశారు. గొడవ ముదిరే పరిస్థితి కనిపించడంతో చైర్మన్ చక్రపాణి 10 నిమిషాల పాటు ‘టీ బ్రేక్’ ప్రకటించారు. తర్వాత కూడా శైలజానాథ్, భానుప్రసాద్‌ల మధ్య వాగ్వాదం కొనసాగింది. అనవసరంగా సభలో అడ్డుతగలవద్దని, చేతనైతే వాదనను అడ్డుకోవాలని మంత్రి సవాల్ చేశారు. తాను చైర్మన్‌ను అడిగానని, నిన్నేమీ అడగలేదంటూ భానుప్రసాద్ అదే స్థాయిలో సమాధానం చెప్పారు. మంత్రులు కాసు కృష్ణారెడ్డి, సి.రామచంద్రయ్య వారికి సర్దిచెప్పారు.
నిజాం కర్కశంగా వ్యవహరించారు: పాలడుగు
సభలో మరోమారు ఇదే అంశం వివాదానికి దారితీసింది. నిజాం నూటికి నూరు శాతం కర్కశంగా వ్యవహరించారని కాంగ్రెస్ సభ్యుడు పాలడుగు వెంకట్రావు అన్నారు. దీనిపై అదే పార్టీ సభ్యుడు ఫరూక్, ఎంఐఎం సభ్యుడు జాఫ్రి, మరికొంత మంది తెలంగాణ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. వెంకట్రావు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఫరూక్ గట్టిగా డిమాండ్ చేశారు. దీంతో వివాదాస్పద అంశాల జోలికి పోవద్దంటూ చైర్మన్ సూచించారు. భూస్వాముల కుట్రలో భాగంగా 69లో తెలంగాణ ఉద్యమం వచ్చిందని, 72లో ఎగిసిపడిన జైఆంధ్ర ఉద్యమాన్ని కొంతమంది పెట్టుబడిదారులు తీసుకొచ్చారని పాలడుగు విమర్శించారు. ప్రస్తుత తెలంగాణ ఉద్యమం కూడా ప్రజా ఉద్యమం కాదనడంతో తెలంగాణ సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయింది. దాంతో జానారెడ్డి, జైపాల్‌రెడ్డి తదితరులు వచ్చిన తర్వాత ప్రజా ఉద్యమంగా మారిందన్నారు.
తెలంగాణ మంత్రుల డుమ్మా
ఆదివారం మండలికి తెలంగాణ మంత్రులు గైర్హాజరయ్యూరు. శాసనసభ, మండలికి హాజరుకావాల్సిన మంత్రులను బృందాలుగా విభజిస్తారు. ‘ఎ’గ్రూప్ అసెంబ్లీలో ఉంటే, ‘బి’ గ్రూప్ మండలిలో ఉంటుంది. ఆదివారం మండలికి ‘ఎ’గ్రూప్ హాజరుకావాలి. ముఖ్యమంత్రితో పాటు ‘ఎ’ గ్రూప్‌లో ఉన్న సీమాంధ్ర మంత్రులంతా ఆదివారం సభకు వచ్చారు. ఇదే గ్రూప్‌లో ఉన్న తెలంగాణ మంత్రులు జానారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, సారయ్య, దానం నాగేందర్, సునీతా లక్ష్మారెడ్డి, డి.కె.అరుణ, గీతారెడ్డి మాత్రం రాలేదు. ఈ గ్రూప్‌లో లేని పొన్నాల లక్ష్మయ్య మాత్రం చివర్లో వచ్చారు. సీమాంధ్ర సభ్యులు తెలంగాణకు వ్యతిరేకంగా పరుషమైన వ్యాఖ్యలు చేసినప్పుడు అడ్డుకోవాల్సిన తెలంగాణ మంత్రులు ఏమయ్యారంటూ పలువురు తెలంగాణ సభ్యులు పొన్నాలను ప్రశ్నించారు.
మండలిలో ‘నిజాం’ రగడ
Published Mon, Jan 20 2014 1:18 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement