యూటీ ప్రతిపాదన ఉత్తిదే: దిగ్విజయ్‌సింగ్
టీ-కాంగ్రెస్ నేతలకు దిగ్విజయ్ స్పష్టీకరణ
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయమే ఫైనల్
హైదరాబాద్ రాజధానిగానే తెలంగాణ ఏర్పాటు
అటార్నీ జనరల్ అనారోగ్యం వల్లే ఈ ఆలస్యం
ఆయన రాగానే ‘ప్రక్రియ’ మొదలవుతుంది
టీ-కాంగ్రెస్ నేతలకు చెప్పిన పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్
దిగ్విజయ్‌తో జానా, పొన్నాల, షబ్బీర్ భేటీ
నీటి పంపకాలపై విద్యాసాగర్ నివేదిక
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోరిన దిలీప్‌కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో.. రాజధాని హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందంటూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం అంతా ఉత్తిదేనని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ పార్టీ తెలంగాణ నేతలకు స్పష్టం చేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేస్తామంటూ పార్టీ అత్యున్నత స్థాయిలో నిర్ణయం చేశాక దానిలో మార్పులు, చేర్పులుచేయటం ఆషామాషీ కాదని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ‘విభజన విషయంలో అన్నీ ఆలోచించాకే వర్కింగ్ కమిటీ స్పష్టమైన నిర్ణయం ప్రకటించింది. దాన్ని అమలు చేయాలన్నదే ఇప్పుడు మా ముందున్న లక్ష్యం. ఈ క్రమంలో సీమాంధ్ర ప్రజల మనోభావాలను గుర్తించి వారి అభ్యంతరాలను పరిశీలించటం మాకు ముఖ్యమే. ఇందులో భాగంగా హైదరాబాద్‌ను యూటీ చేయాలని చాలామంది నేతలు మా ముందు ప్రతిపాదనలు తెచ్చారు. వారు చెప్పినంత మాత్రాన హైదరాబాద్‌ను యూటీ చేయలేం. వర్కింగ్ కమిటీ తీర్మానం మేరకు హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పడుతుంది. ఆ దిశగానే కసరత్తు జరుగుతోంది’ అని దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నట్లు టీ-కాంగ్రెస్ నేతలు తెలిపారు.
‘హైదరాబాద్ యూటీ అంటే మరోమారు సీడబ్ల్యూసీ చర్చించాలి. యూపీఏ పక్షాలను ఒప్పించాలి. దానికి ప్రతిపక్షాలు సైతం అంగీకరించాలి. ఇదంతా సాధ్యమయ్యేది కాదు. అలా చేస్తే కాంగ్రెస్ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి యూటీ విషయంలో జరుగుతున్నదంతా ప్రచారమే. దానిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని దిగ్విజయ్ చెప్పినట్లు వివరించారు. తెలంగాణ ప్రాంత రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎంపీలు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు షబ్బీర్‌అలీ, కపిలవాయి దిలీప్‌కుమార్, సాగునీటి రంగ నిపుణుడు విద్యాసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే దయాసాగర్‌లు గురువారం ఉదయం ఢిల్లీలో దిగ్విజయ్‌ను కలిశారు. సుమారు అరగంట పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ యూటీ విషయమై జరుగుతున్న చర్చపై నేతలు ఆరా తీశారు. యూటీ ప్రతిపాదనకు ఇరు ప్రాంతాల నేతలు వ్యతిరేకమని, తెలంగాణ ప్రజలు దీనికి ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరని స్పష్టంచేశారు. దీనిపై దిగ్విజయ్ స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదని, మీడియానే దీనిపై తప్పుడు ప్రచారం చేస్తోందని పేర్కొన్నట్లు సమాచారం.
అటార్నీ జనరల్ రాగానే ప్రక్రియ మొదలు..
రాష్ట్ర విభజన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని టీ-కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్‌ను కోరారు. ప్రక్రియ ఆలస్యం జరుగుతున్నకొద్దీ అనేక అపోహలు తలెత్తుతున్నాయని చెప్పారు. దీనికి దిగ్విజయ్ స్పందిస్తూ ‘కొన్ని రోజులుగా కేంద్ర హోంమంత్రి షిండే అస్వస్థతతో ఉన్నారు. ఆయన కోలుకుని ప్రక్రియ మొదలుపెట్టే సమయానికి అటార్నీ జనరల్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన సోమవారం మహారాష్ట్ర నుంచి ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. ఆయన రాగానే కేబినెట్ నోట్‌పై న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటాం. ఏయే అంశాలు పొందుపర్చాలో చర్చించి రెండు వారాల్లో నోట్‌ను రాష్ట్రపతికి పంపేలా కృషి చేస్తాం’ అని చెప్పినట్లు తెలిసింది.
నీటి వివాదాలు భ్రమే...
నీటి వివాదాలకు సంబంధించి సీమాంధ్ర నేతలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర జల సంఘం మాజీ సభ్యుడు విద్యాసాగర్‌రావు ఈ సందర్భంగా దిగ్విజయ్‌తో పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదీ జలాల పరిధిలో ఉన్న ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల వివరాలతో కూడిన నివేదికను దిగ్విజయ్‌కు సమర్పించారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు స్పష్టంగా ఉన్నాయని, విభజన జరిగినా అవే కేటాయింపులు కొనసాగుతాయని చెప్పారు. రాజోలిబండ, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలో మాత్రం నీటి పంపకాలు యధావిధిగా సాగేందుకు తుంగభద్ర బోర్డు తరహాలో ఓ బోర్డు ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని పేర్కొన్నట్లు తెలిసింది. ఇదిలావుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రాంతానికే పరిమితమన్నట్లు వ్యవహరిస్తున్నారని.. ఆయనను బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ ఎమ్మెల్సీ, తెలంగాణ ఆర్‌ఎల్‌డీ నాయకుడు దిలీప్‌కుమార్ వినతిపత్రం అందజేశారు.
యూటీ ప్రసక్తే లేదన్నారు: జానారెడ్డి, పొన్నాల
‘హైదరాబాద్ యూటీ అన్న ప్రసక్తే లేదు. వర్కింగ్ కమిటీ తీర్మానం మేరకు పది జిల్లాల తెలంగాణే ఏర్పడుతుంది. యూటీ అంటే అది ఇంకో ఆందోళనకు దారితీస్తుందని చెప్పాం’ అని దిగ్విజయ్‌తో భేటీ అనంతరం మంత్రి జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య మీడియాతో పేర్కొన్నారు. యూటీపై అనవసర అపోహలు వద్దని, ఆ ప్రతిపాదన లేదని దిగ్విజయ్ చెప్పారని ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ తెలిపారు.