S Sailajanath
-
హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరివ్వాలి : శైలజనాథ్
అనంతపురం సెంట్రల్ : హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగు నీరివ్వాలని మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షుడు సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది అధికార పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు వలన మిడ్‌పెన్నార్, సౌత్, నార్త్ కెనాల్స్‌తో పాటు తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ కింద ఆయకట్టును బీడుపెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఏడాది హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరిచ్చిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు మళ్లించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు దాదాగాంధీ, నాయకులు నాగరాజు, వాసు, అగిశం రంగనాథ్ పాల్గొన్నారు. -
'సీమకు దక్కకుండా చేశారు'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఎస్. శైలజానాథ్ శనివారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. చంద్రబాబు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్ర రాజధాని రాయలసీమకు దక్కకుండా చేశారని విమర్శించారు. ఇప్పుడు సొంత జిల్లాలో తాగునీటి పథకం రద్దు చేశారని మండిపడ్డారు. తాగునీటి పథకానికి గత ప్రభుత్వం రూ. 7, 390 కోట్లు కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. అన్ని నిధులు కేటాంచిన ఆ పథకాన్ని ఇప్పుడు ఎందుకు రద్దు చేశారో చెప్పాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని శైలజానాథ్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత పథకాలను రద్దు చేయడం వెనక మతలబు ఏమిటని చంద్రబాబు ప్రభుత్వాన్ని శైలజానాథ్ ప్రశ్నించారు. -
మండలిలో ‘నిజాం’ రగడ
సాక్షి, హైదరాబాద్: నిజాంను కీర్తించడం, నిందించడం శాసనమండలిలో ఆదివారం సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమయింది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై ఆదివారం మండలిలో చర్చ కొనసాగింది. హైదరాబాద్ రాష్ట్రంలో ఆదాయం ఘనంగా ఉండేదని, అభివృద్ధిలోనూ ఆంధ్రా కంటే ముందుండేదని టీఆరెల్డీ సభ్యుడు దిలీప్‌కుమార్ పేర్కొన్నారు. అనంతరం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యతను వివరిస్తూ బిల్లును వ్యతిరేకించారు. తర్వాత శాసనసభ వ్యవహారాల మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ.. ‘పెద్దల సభలో నిజాం ప్రభువును కీర్తించడం దురదృష్టకరం. మరాఠా, కన్నడ, తెలంగాణ కలిసున్న ఉమ్మడి హైదరాబాద్ ఆదాయాన్ని తెలంగాణ ఆదాయంగా చూపిస్తూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ సభ్యుడు భానుప్రసాద్ అడ్డు తగులుతూ.. ‘మంత్రి హోదాలో క్లారిఫికేషన్ ఇస్తున్నారా? మండలి సభ్యుడిగా మాట్లాడుతున్నారా? స్పష్టం చేయూలి’ అని డిమాండ్ చేశారు. గొడవ ముదిరే పరిస్థితి కనిపించడంతో చైర్మన్ చక్రపాణి 10 నిమిషాల పాటు ‘టీ బ్రేక్’ ప్రకటించారు. తర్వాత కూడా శైలజానాథ్, భానుప్రసాద్‌ల మధ్య వాగ్వాదం కొనసాగింది. అనవసరంగా సభలో అడ్డుతగలవద్దని, చేతనైతే వాదనను అడ్డుకోవాలని మంత్రి సవాల్ చేశారు. తాను చైర్మన్‌ను అడిగానని, నిన్నేమీ అడగలేదంటూ భానుప్రసాద్ అదే స్థాయిలో సమాధానం చెప్పారు. మంత్రులు కాసు కృష్ణారెడ్డి, సి.రామచంద్రయ్య వారికి సర్దిచెప్పారు. నిజాం కర్కశంగా వ్యవహరించారు: పాలడుగు సభలో మరోమారు ఇదే అంశం వివాదానికి దారితీసింది. నిజాం నూటికి నూరు శాతం కర్కశంగా వ్యవహరించారని కాంగ్రెస్ సభ్యుడు పాలడుగు వెంకట్రావు అన్నారు. దీనిపై అదే పార్టీ సభ్యుడు ఫరూక్, ఎంఐఎం సభ్యుడు జాఫ్రి, మరికొంత మంది తెలంగాణ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. వెంకట్రావు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఫరూక్ గట్టిగా డిమాండ్ చేశారు. దీంతో వివాదాస్పద అంశాల జోలికి పోవద్దంటూ చైర్మన్ సూచించారు. భూస్వాముల కుట్రలో భాగంగా 69లో తెలంగాణ ఉద్యమం వచ్చిందని, 72లో ఎగిసిపడిన జైఆంధ్ర ఉద్యమాన్ని కొంతమంది పెట్టుబడిదారులు తీసుకొచ్చారని పాలడుగు విమర్శించారు. ప్రస్తుత తెలంగాణ ఉద్యమం కూడా ప్రజా ఉద్యమం కాదనడంతో తెలంగాణ సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయింది. దాంతో జానారెడ్డి, జైపాల్‌రెడ్డి తదితరులు వచ్చిన తర్వాత ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. తెలంగాణ మంత్రుల డుమ్మా ఆదివారం మండలికి తెలంగాణ మంత్రులు గైర్హాజరయ్యూరు. శాసనసభ, మండలికి హాజరుకావాల్సిన మంత్రులను బృందాలుగా విభజిస్తారు. ‘ఎ’గ్రూప్ అసెంబ్లీలో ఉంటే, ‘బి’ గ్రూప్ మండలిలో ఉంటుంది. ఆదివారం మండలికి ‘ఎ’గ్రూప్ హాజరుకావాలి. ముఖ్యమంత్రితో పాటు ‘ఎ’ గ్రూప్‌లో ఉన్న సీమాంధ్ర మంత్రులంతా ఆదివారం సభకు వచ్చారు. ఇదే గ్రూప్‌లో ఉన్న తెలంగాణ మంత్రులు జానారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, సారయ్య, దానం నాగేందర్, సునీతా లక్ష్మారెడ్డి, డి.కె.అరుణ, గీతారెడ్డి మాత్రం రాలేదు. ఈ గ్రూప్‌లో లేని పొన్నాల లక్ష్మయ్య మాత్రం చివర్లో వచ్చారు. సీమాంధ్ర సభ్యులు తెలంగాణకు వ్యతిరేకంగా పరుషమైన వ్యాఖ్యలు చేసినప్పుడు అడ్డుకోవాల్సిన తెలంగాణ మంత్రులు ఏమయ్యారంటూ పలువురు తెలంగాణ సభ్యులు పొన్నాలను ప్రశ్నించారు. -
సిగ్గు, శరం ఉంటే రాజీనామా చెయ్: ఎర్రబెల్లి
అసెంబ్లీలో రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై శుక్రవారం శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతున్న సమయంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఆయనకు సిగ్గు, శరం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అనడం కలకలం సృష్టించింది. మరోపక్క రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా మంత్రి మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ సభ్యులు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని చేర్చినప్పుడు దమ్ముంటే రాజీనామా చేసి ఉండాల్సిందని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. కాగా, పరుష పదజాలంతో మాట్లాడటం సరికాదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఎర్రబెల్లికి హితవు పలికారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఎర్రబెల్లి కోరగా, స్పీకర్ తిరస్కరించారు. దీంతో ఆయన స్పీకర్ పోడియం ముందుకు వెళ్లారు. అయితే, ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఆయనకు మద్దతుగా నిలవకపోవడం గమనార్హం. మంత్రి జానారెడ్డి జోక్యం చేసుకుని.. సభ్యులు రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడటం సరికాదని శైలజానాథ్‌ను ఉద్దేశించి అన్నారు. గొడవ సద్దుమణిగిన అనంతరం శైలజానాథ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. -
'రాష్ట్రపతితో భేటీ హైకమాండ్‌ను ధిక్కరించడం కాదు'
న్యూఢిల్లీ: ప్రస్తుత రాష్ట్ర విభజన పక్రియ రాజ్యాంగ విరుద్ధమని మంత్రి ఎస్ శైలజానాథ్ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ చేయాలని రాష్ట్రపతిని కోరానున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సాయంత్రం 7 గంటలకు కలవనున్నట్టు తెలిపారు. రాష్ట్రపతితో భేటీ హైకమాండ్‌ను ధిక్కరించడం కాదని స్పష్టం చేశారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేశ్, పలువురు సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. రాత్రి 8 గంటలకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్‌తో సీమాంధ్ర నాయకులు భేటీ కానున్నారు. సమైక్యాంధ్ర కోసం చివరివరకు ప్రయత్నాలు చేస్తామని శైలజానాధ్ అంటున్నారు. -
విభజనపై రాష్ట్రపతిని కలువనున్న సీమాంధ్ర శాసనసభ్యులు
ఆంధ్ర ప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించడానికి సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలువనున్నారు. విభజనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత సీమాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమాలు లేచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు సీమాంధ్ర ప్రాంత శాసన సభ్యులు గురువారం సమావేశమయ్యారు. సమావేశమనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఫోరం కన్వీనర్ ఎస్ శైలజానాధ్ మాట్లాడుతూ..రాష్ట్రపతి ప్రణబ్ ను, పార్టీ సీనియర్ నేతలను ఢిల్లీ కలుస్తాం అని అన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల మనోభావాలను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ కు వివరిస్తామన్నారు. -
ఒత్తిడిలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు
రాజీనామా చేయకుంటే సీమాంధ్రలో అడుగుపెట్టలేని పరిస్థితి సీఎంను కలిసిన కృపారాణి, శైలజానాథ్, గాదె, జేసీ, ఉండవల్లి, అనంత వైఎస్సార్సీపీ, టీడీపీ వైఖరిపై చర్చ ఏపీ ఎన్జీవోలకు జీతాలు చెల్లించాలని కోరిన శైలజానాథ్ పనిచేసిన కాలానికి జీతాలిచ్చే విషయాన్ని ఆలోచిస్తున్నామన్న సీఎం సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ ఉధృతమవుతున్న సమైక్యాంధ్రప్రదేశ్ ఉద్యమ నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీవ్ర మైంది. విభజనకు కాంగ్రెస్ కారణమైనందున ఆ ప్రాంత ప్రజలంతా తమను దోషులుగా పరిగణిస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. నిన్నటివరకు రాజీనామాలు చేసి రావాలని చెబుతున్న సమైక్యవాదులు తాజాగా రాజీనామాలను ఆమోదించుకున్న తరువాతే నియోజకవర్గంలో కాలుపెట్టాలంటూ హెచ్చరికలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం విభజన విషయంలో వెనక్కువెళ్లే ప్రసక్తేలేదని తేల్చిచెబుతుండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాసరావు గవర్నర్‌ను కలిసి రాజీనామాను ఆమోదించుకునే పనిలో పడటంతో వీరిపై ఒత్తిడి మరింత అధికమైంది. దీనిని ఏ విధంగా అధిగమించాలనే అంశంపై చర్చించేందుకు సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ డాక్టర్ ఎస్.శైలజానాథ్, ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, అనంత వెంకట్రామిరెడ్డి, మాజీమంత్రులు గాదె వెంకటరెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి ఆదివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. సీమాంధ్ర ప్రజల ఒత్తిడిని అధిగమించి రాజకీయంగా మనుగడ సాధించాలంటే తెలంగాణ ప్రక్రియను అడ్డుకోవడం ఒక్కటే మార్గమని నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. పార్లమెంటు సమావేశాల తరువాత తెలంగాణ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసే అవకాశాలున్నందున అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య నినాదంతో ముందుకు వెళుతున్నందున అసెంబ్లీలో విభజనకు వ్యతిరేకంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారని, దీంతో టీడీపీ కూడా తన అభిప్రాయాన్ని మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించే బాధ్యతను తాము తీసుకుంటామని... పార్లమెంటులో, కేంద్రంలో తెలంగాణ ప్రక్రియ జరగకుండా చూసే బాధ్యతను కేంద్ర మంత్రులు, ఎంపీలు తీసుకోవాలని సీఎం, శైలజానాథ్ కోరినట్లు సమాచారం. తెలంగాణ ప్రక్రియ ఆపడానికి ఎంతదూరమైనా వెళ్లేందుకు తాము సిద్ధమయ్యామని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి చెప్పినట్లు తెలిసింది. మరోవైపు శైలజానాథ్ ఈనెల మూడో తేదీన అసెంబ్లీ ఆవరణలో జరపతలపెట్టిన సత్యాగ్రహ దీక్ష అంశాన్ని సీఎంకు వివరించారు. సమైక్యాంధ్ర కోసం సమ్మె చేస్తున్న ఏపీఎన్జీవోలకు జీతాలు చెల్లించాలని కోరారు. గత నెలలో వారు 12 రోజులపాటు పని చేసినందున కనీసం ఆ కాలానికైనా జీతాలు చెల్లించే విషయాన్ని ఆలోచిస్తున్నామని సీఎం బదులిచ్చినట్లు సమాచారం. అంతకుముందు కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి సీఎంను కలిసి ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను వివరించినట్లు తెలిసింది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదివారం ఢిల్లీ వెళ్లారు. సోమ, మంగళవారాల్లో కాంగ్రెస్ పెద్దలందరినీ కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, సమైక్యాంధ్ర ఉద్యమ తీరును వివరించనున్నారు. అదే విధంగా ఈనెల 3న ఏకే ఆంటోనీ కమిటీతోనూ బొత్స సమావేశం కానున్నారు. నేడు సోనియాను కలవనున్న డీఎస్ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కూడా సోమవారం హస్తిన పయనమవుతున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ఆయన సమావేశమై తెలంగాణ రాష్ట్ర ప్రకటన అనంతర పరిణామాలు, తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి వంటి అంశాలను వివరించే అవకాశాలున్నాయి. అదే సమయంలో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి హైకమాండ్ తీసుకున్న విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రకటనలతోపాటు సీమాంధ్ర ఉద్యమాన్ని వెనుక నుంచి ప్రోత్సహిస్తున్నారనే విషయాన్ని సోనియా దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. మరోవైపు సీమాంధ్ర ప్రాంతానికి ఎంపీలు కూడా ఈనెల 3న ఆంటోనీ కమిటీని కలిసి విభజన ప్రక్రియను కొనసాగించడంవల్ల జరగబోయే పరిణామాలను, పార్టీకి జరిగే నష్టాన్ని వివరించేందుకు సిద్ధమవుతున్నారు. -
రేపు ఢిల్లీలో సమైక్య ధర్నా: శైలజానాథ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల వైఖరేమిటో సూటిగా చెప్పాలని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి ఎస్.శైలజానాథ్ డిమాండ్ చేశారు. తాము మాత్రం మొదటి నుంచి సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. అందులో భాగంగా సీమాంధ్ర ప్రజల మనోభావాలను పార్టీ అధిష్టానం పెద్దలకు విన్పించేందుకు ఈనెల 13న సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులమంతా ఢిల్లీ వెళ్లి జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా సోమవారం సాయంత్రానికి ఢిల్లీ చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. జంతర్‌మంతర్ వద్ద తలపెట్టిన కార్యక్రమానికి జాతీయ నాయకులు హాజరవుతారా లేదా? అనే సంగతి సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు చూసుకుంటారని వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు విజన్ లేదని, అసలాయన రాజకీయ నాయకుడెలా అయ్యారో? ఇన్నాళ్లుగా ఎలా కొనసాగుతున్నారో? తమకు అర్థం కావడంలేదని పేర్కొన్నారు.