విభజనపై రాష్ట్రపతిని కలువనున్న సీమాంధ్ర శాసనసభ్యులు
ఆంధ్ర ప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించడానికి సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలువనున్నారు. విభజనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత సీమాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమాలు లేచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు సీమాంధ్ర ప్రాంత శాసన సభ్యులు గురువారం సమావేశమయ్యారు.
సమావేశమనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఫోరం కన్వీనర్ ఎస్ శైలజానాధ్ మాట్లాడుతూ..రాష్ట్రపతి ప్రణబ్ ను, పార్టీ సీనియర్ నేతలను ఢిల్లీ కలుస్తాం అని అన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల మనోభావాలను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ కు వివరిస్తామన్నారు.